Monday, April 26, 2010

ఏజెంట్లకు ప్రోత్సాహకాల పందేరంపై సెబి కన్ను

న్యూఢిల్లీ : మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) సంస్థలు ఏజెంట్లకు అందిస్తున్న ప్రోత్సాహకాలపై చర్యలు తీసుకోవాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) యోచిస్తోంది.

ఎంఎఫ్‌ల అత్యధిక అమ్మకాలపై డిస్ట్రిబ్యూటర్లు, ఏజెంట్లకు నగదు ప్రోత్సాహకాలతోపాటు విదేశీ ప్రయాణాల రూపంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు భారీ ఆఫర్లను ఉదారంగా అందిస్తుండటంతో సెబి వీటిని కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది.

ఎంఎఫ్‌లలో ఇన్వెస్టర్లు పెడుతున్న మొత్తాలపై ఎంట్రీ లోడ్ చార్జీలను ఎత్తివేసినప్పటి నుంచి పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు డిస్ట్రిబ్యూటర్లకు నగదు ప్రోత్సాహకాలు, విదేశీ ప్రయాణాల వంటివి వెలుగులోకి వచ్చాయని సెబి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఫండ్ ఖర్చుల పేరుతో ఇన్వెస్టర్ల నిధులను ప్రోత్సాహకాల రూపంలో ఉపయోగిస్తున్నారా అనే దానిని పరిశీలించటానికి సెబి సన్నద్దమవుతోంది. ఈ తరహా చర్యలన్ని పూర్తిగా అనైతికమవని సెబి పేర్కొంది.

ఇలాంటి అంశాలను కట్టుదిట్టం చేయటానికి గాను అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ (ఎఎంఎఫ్ఐ)ను సంప్రదించిన పిదప త్వరలోనే సెబి కొన్ని మార్గదర్శకాలను విడుదల చే యటానికి సిద్దమవుతోందని ఉన్నతాధికారి తెలిపారు.

ఇప్పటికే ఈ తరహా ప్రోత్సాహకాల అంశం ఫార్మా, కన్జూమర్ గూడ్స్, మార్కెటింగ్ పరిశ్రమల్లో ప్రబలంగా ఉందని దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని మ్యూచువల్ ఫండ్ సంస్థకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు ఇన్వెస్టర్ల నుంచి ఎంట్రీ లోడ్ చార్జీలను ఎంఎఫ్ సంస్థలు వసూలు చేయకుండా సెబి నిషేధించినప్పటి నుంచే పరిశ్రమ తీరు గతి తప్పిందని ఎంఎఫ్ డిస్ట్రిబ్యూటర్లు పేర్కొంటున్నారు.

ఈ పరిస్థితి ప్రస్తుత యులిప్‌ల వివాదం కారణంగానే వచ్చిందని, పాలసీల విక్రయంపై ఇన్సూరెన్స్ సంస్థలు వారి ఏజెంట్లకు భారీ మొత్తంలో కమీషన్లను ముట్టజెప్పేవని వారు తెలిపారు. యులిప్‌ల వివాదంతో పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు ఎంఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని, దీంతో ఫండ్ సంస్థలు వ్యాపారాన్ని మరింతగా విస్తరించటానికి ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయని పరిశ్రమ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. 2009 ఆగస్టు1న ఎంట్రీ లోడ్ చార్జీలపై సెబి నిషేధం విధించింది.