ఈ ఏడాది 20 కొత్త ఔషధాలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఔషధ కంపెనీ న్యూలాండ్ లేబరేటరీస్. గత మూడేళ్లుగా పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలపై భారీగా వెచ్చించింది. అంతేగాక ఔషధ తయారీ సదుపాయాలను సైతం నవీకరించింది. కేవలం బల్క్ డ్రగ్స్‌కే పరిమితం కాకుండా కాంట్రాక్టు పరిశోధన, కాంట్రాక్టు తయారీ, క్లినికల్ పరీక్షల విభాగాల్లోకి తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించింది. తత్ఫలితంగా ఖర్చులు పెరిగి గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నష్టాలు నమోదు చేయాల్సి వచ్చింది. కానీ ఈ పరిస్థితి తాత్కాలికమేనని, వచ్చే రెండు మూడేళ్లలో అనూహ్యమైన వృద్ధి ఉంటుందని అంటున్నారు న్యూలేండ్ లేబొరేటరీస్ సీఈఓ సుచేత్ రావు దావులూరి. ఆయన 'న్యూస్‌టుడే'కిచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..
జపాన్ మార్కెట్‌కు విస్తరణ
పరిశోధన- అభివృద్ధి విభాగం బలోపేతం
న్యూలాండ్ లేబొరేటరీస్ సీఈఓ
సుచేత్‌రావు దావులూరి

సుచేత్ రావు: గత మూడేళ్లుగా మేం భారీగా విస్తరణ కార్యకలాపాలు చేపట్టాం. పరిశోధన-అభివృద్ధి విభాగంలోకి విస్తరించాం. హై పొటెన్సీ ఏపీఐలు, పెప్త్టెడ్ బిల్డింగ్ బ్లాకులు తయారు చేయడం మొదలుపెట్టాం. ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నాం. మౌలిక సదుపాయాలు, సామర్థ్యంపరంగా చూస్తే గత మూడేళ్ల క్రితం కంటే ఇప్పుడు ఎంతో మెరుగైన స్థితిలో ఉన్నాం. ఫార్మాలో ఒకేసారి పెట్టుబడి పెట్టి, వెంటనే ఫలితాలు ఆశించలేం. క్రమంగా పెట్టుబడులు పెట్టుకుంటూ వచ్చి దీర్ఘకాలంలో ప్రతిఫలాన్ని తీసుకోవాలి. సహజంగా ఈ విస్తరణ ఫలితంగా వడ్డీ భారం, తరుగుదల, పలు రకాల ఖర్చులు పెరిగిపోయాయి. అయితే ఈ పరిస్థితి తాత్కాలికమే. మొత్తం మీద చూస్తే వ్యాపార కార్యకలాపాలు, ఆదాయాలు పెరుగుతున్నాయి.
? వచ్చే రెండు మూడేళ్లలో ఆదాయాలు, లాభాలు ఎలా ఉంటాయి
మాది స్టాక్‌మార్కెట్లో నమోదైన కంపెనీ. అందువల్ల ఈ వివరాలను ముందుగానే బయటకు చెప్పలేం. కాకపోతే భవిష్యత్తు ఎంతో బాగుంటుందని మాత్రం స్పష్టం చేయగలను. గత అయిదేళ్లుగా ఏటా 20 శాతం చొప్పున వృద్ధి నమోదు చేస్తున్నాం. మున్ముందు ఇది ఇంకా అధికంగా ఉంటుంది. అదేవిధంగా నికర మార్జిన్లు కూడా పెరుగుతాయి. ఒక సానుకూల సంకేతం ఏమిటంటే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సగానికి పైగా ఔషధ సరఫరా ఆర్డర్లు మాకు ఖరారయ్యాయి. ఆదాయాలు అధికంగా ఉంటాయనే దానికి ఇదొక సంకేతం. ముఖ్యంగా గుర్తించాల్సి అంశం- కేవలం ఏపీఐలు తయారు చేసే కంపెనీ ఇప్పుడు కెమికల్ డెవలప్‌మెంట్‌లో మొదటి దశ నుంచి భారీస్థాయి తయారీ వరకూ అన్ని పనులు చేయగలిగిన కంపెనీగా న్యూలాండ్ ఎదిగిందనే విషయం. మేం దీర్ఘకాలిక దృక్పథంతో ముందుకెళ్తున్నాం.
? ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త ఔషధాల తయారీ ఏమైనా చేపడుతున్నారా
ఇప్పటికే మేం ఉన్న ఔషధ విభాగాల్లో, కొత్తగా ప్రవేశించే విభాగాల్లో కలిసి ఈ ఏడాదిలో 20 వరకూ కొత్త ఔషధాలు ప్రవేశపెడతాం. గత ఏడాదిలో 10 కొత్త ఔషధాలను మార్కెట్‌కు అందించాం. ఇంతకుముందే చెప్పినట్లుగా పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలను విస్తరించినందువల్ల కొత్త ఔషధాల తయారీ సాధ్యమవుతోంది. ప్రస్తుతం మేం కార్డియో వేస్క్యులర్, సెంట్రల్ నెర్వస్ సిస్టమ్, యాంటీ బయాటిక్, యాంటీ ఇన్ఫెక్టివ్స్, యాంటీ ఇమాటిక్స్ వంటి కొన్ని ప్రత్యేక విభాగాల్లో ఔషధాలు తయారు చేస్తున్నాం.
? పరిశోధన- అభివృద్ధి విభాగం ప్రధానంగా జనరిక్ ఔషధాల కోసమా లేక ఔషధాలు, ఔషధ సేవల కోసమా... దేనిపై ఈ విభాగం ప్రధానంగా పనిచేస్తోంది.
అటు జనరిక్ ఔషధాల్లో ఇటు కాంట్రాక్టు పరిశోధన, కాంట్రాక్టు తయారీ విభాగాల్లో ఆర్ అండ్ డి విభాగం దృష్టి కేంద్రీకరించింది. న్యూలాండ్ ఆర్ అండ్ డి విభాగానికి నలభై వేల చదరపు అడుగుల విస్తీర్ణం కల కేంద్రంలో 12 క్లినికల్ డెవలప్‌మెంట్ బ్లాకులు ఉన్నాయి, 180 మందికి పైగా నిపుణులు పనిచేస్తున్నారు. ఐపీఆర్, అనలైటికల్ ఆర్‌అండ్‌డీ, టెక్నాలజీ బదిలీ, డెవలప్‌మెంట్ క్యూఏ, కెమికల్ ఆర్‌అండ్‌డి, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ తదితర అంశాల్లో కార్యకలాపాలు సాగుతున్నాయి. ఆర్‌అండ్‌డీ పై గత రెండు మూడేళ్లలో రూ.25 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టాం.
?జపాన్ మార్కెట్‌కు విస్తరించే సన్నాహాల్లో ఉన్నట్లు గతంలో మీరు చెప్పారు. ఈ విషయంలో ప్రగతి ఎలా ఉంది
కాంట్రాక్టు పరిశోధన, కాంట్రాక్టు తయారీ సేవలను జపాన్ మార్కెట్‌కు విస్తరిస్తున్నాం. దీనికి సంబంధించి అక్కడి ప్రముఖ ఔషధ కంపెనీలతో దీర్ఘకాలిక సంబంధాలు నెలకొల్పుకుంటున్నాం.
?కాటో రీసెర్చ్‌తో కలిసి అనుబంధ కంపెనీని ప్రారంభించారు. ఇది ఎందుకోసం ... ఏ దశలో ఉంది.
ప్రధానంగా ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ పరీక్షల కోసం ఈ అనుబంధ కంపెనీ. ఇందులో న్యూలాండ్ లేబొరేటరీస్‌కు 30 శాతం వాటా ఉంది. ఈ ఏడాది చివర్లో దీని కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయిలో ప్రాజెక్టులను ఇది చేపడుతుంది.