Tuesday, April 20, 2010

నేడే ఆర్‌బిఐ వార్షిక ద్రవ్య పరపతి విధానం

పోటున్నా అది స్వల్పమే

ముంబై : రెండంకెల స్థాయికి కేవలం కూతవేటు దూరంలో ఉన్న టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం, అడ్డూ ఆపూ లేకుండా పెరిగిపోయిన ఆహార వస్తువుల ధరల ప్రభావం వల్ల పై చూపే గాని కింద చూపు ఏ మాత్రం లేనట్టుగా పయనిస్తున్న వినియోగ వస్తువుల ధరల సూచి, దీని ప్రభావం ఇతర రంగాలకు కూడా విస్తరిస్తుందన్న భయాల నేపథ్యంలో ఆర్‌బిఐ 2010-11 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ద్రవ్య, పరపతి విధానం మంగళవారం ప్రకటించనుంది. దూసుకుపోతున్న ద్రవ్యోల్బణానికి పగ్గాలు బిగించడానికి ఆర్‌బిఐ ఈ సారి కీలక రేట్లను మరి కొంత పెంచే అవకాశాలున్నట్టు ఊహాగానాలు సాగుతున్నాయి.

మార్చిలోనే ఆర్‌బిఐ రెపో, రివర్స్ రెపో రేట్లను 0.25 శాతం వంతున పెంచింది. ఆహార వస్తువుల ధరల పెరుగుదల ప్రభావం వల్ల మార్చి చివరి నాటికి టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం 9.90 శాతం ఉంది. ద్రవ్యోల్బణానికి కళ్ళెం వేయడం ఒక్కటే కాకుండా ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటు మందగించకుండా చూడాల్సిన సమాంతర బాధ్యత కూడా ఉన్న ఆర్‌బిఐ కీలక రేట్ల పెంపు విషయంలో మరీ దూకుడుతనం ప్రదర్శించకపోవచ్చునని ఆర్థిక పండితులంటున్నారు. మొత్తం మీద ఆర్‌బిఐ ద్రవ్యపరపతి విధానం కొంత కఠినంగానే ఉంటూ అవసరం అనుకున్న అంశాల్లో కొంత సద్దుబాటు ధోరణిలో కూడా ఉండవచ్చునన్నది వారి అభిప్రాయం.

బ్యాంకింగ్ రంగంలో వడ్డీరేట్లకు దిక్సూచిగా భావించే రెపో, రివర్స్ రెపో రేట్లను ఆర్‌బిఐ మరో 0.25 శాతం వంతున పెంచి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాను మరి కొంత తగ్గించవచ్చునని బ్యాంకర్లు అంటున్నారు. గోధుమ, చక్కెర, బంగాళాదుంప, పప్పు దినుసులతో సహా రబీ పంట దిగుబడులు మే నెల మధ్య నాటికి మార్కెట్‌లోకి వచ్చే ఆస్కారం ఉన్నందువల్ల ద్రవ్యోల్బణ వత్తిడి కొంత తగ్గుతుందని, ఈ దశలో ద్రవ్య సరఫరాను స్వల్పంగా తగ్గిస్తే చాలునని వారు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక తిరోగమనం ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ తరుణంలో ద్రవ్య సరఫరా విషయంలో మరీ అధిక జాగ్రత్తలు పాటించినా ప్రతికూల ఫలితాలు తప్పవని వారంటున్నారు.

వృద్ధిరేటు 8.2 శాతమే.. ఆర్‌బిఐ అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధిరేటు 8.2 శాతానికి పరిమితం కావచ్చునని ఆర్‌బిఐ అంచనా వేసింది. ఉద్దీపన ప్యాకేజిలను ఉపసంహరణతో పాటు వృద్ధికి ఊతం ఇస్తున్న ద్రవ్య విధానాలను కఠినం చేసే విషయంలో జాగ్రత్తగా అడుగు వేయకపోతే ఆర్థికాభివృద్ధి రేటు మందగించవచ్చునని కూడా హెచ్చరించింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి వార్షిక ద్రవ్య పరపతి విధానం ప్రకటించడానికి ముందు 2009-10 ఆర్థిక సంవత్సరంలో స్థూల ఆర్థికాంశాలు, ద్య్రవ పరిణామాలను వివరించే నివేదికను ఆర్‌బిఐ సోమవారం విడుదల చేసింది.

రానున్న కొద్ది నెలల్లో టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు ప్రత్యేకించి ఆయిల్ ధరలు పెరుగుతున్నందువల్ల ఊర్థ్వముఖ కదలికకు సంబంధించిన రిస్క్‌ను కూడా తోసి పుచ్చలేమని ఆ నివేదిక స్పష్టం చేసింది. రుతుపవనాలు సంతృప్తికరంగా లేకపోయినా 2010 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన రికవరీ సాధించిందని, 2009-10 సంవత్సరం తుది గణాంకాలు వెలువడే నాటికి వృద్ధిరేటు 7.2 శాతం ఉండవచ్చునని పేర్కొంది.

2009 సెప్టెంబర్-డిసెంబర్ త్రైమాసికంలో రుణాల్లో 12.2 శాతం వృద్ధి మాత్రమే చోటు చేసుకున్నదని కూడా ఆర్‌బిఐ తేల్చి చెప్పింది. 2008 సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో రుణాల్లో ఏర్పడిన వృద్ధిరేటు 23.3 శాతం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బిఐ గ్రూప్ బ్యాంకుల రుణాల వృద్ధిరేటు 24 శాతం నుంచి 14.4 శాతానికే పరిమితం అయిందని, అలాగే మొత్తం జాతీయ బ్యాంకుల రుణాల వృద్ధిరేటు 29 శాతం నుంచి 15.7 శాతానికి తగ్గిందని కూడా పేర్కొంది. అయితే డిపాజిట్లలో పతనం మరీ అంత ఎక్కువగా లేకపోవడం గమనార్హం. 2008 సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో డిపాజిట్లలో 21 శాతం వృద్ధి ఏర్పడగా ఈ ఏడాది 17.9 శాతానికి తగ్గింది.

ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధానం ఎలా ఉండవచ్చునన్న అంశంపై బ్యాంకర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలు...
మార్కెట్‌లో విశ్వాసం పెంపొందించి తగు వెసులుబాటు కల్పించాలంటే సిఆర్ఆర్, రెపో, రివర్స్ రెపో రేట్లను 0.25 శాతం వంతున పెంచితే చాలు.
- రాణా కపూర్, సిఇఒ, యస్ బ్యాంక్.

ఆర్‌బిఐ ద్రవ్యపరమైన చర్యలు తీసుకుంటే తప్ప ద్రవ్యోల్బణం దిగి రాని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కీలక రేట్లను 0.25 శాతం నుంచి 0.5 శాతం మధ్యన పెంచే ఆస్కారం ఉంది.
- టి.వై.ప్రభు, సిఎండి, ఒబిసి.

ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితి, ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన పునరుజ్జీవన క్రమం రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటే సిఆర్ఆర్ మరో 0.25 శాతం పెంచే అవకాశం కనిపిస్తోంది. రెపో, రివర్స్ రెపో రేట్లను గత నెలలోనే పెంచినందువల్ల ఈ సారి వాటి జోలికి వెళ్ళకపోవచ్చు.
- ఎస్.ఎస్.రంజన్, సిఎఫ్ఓ, ఎస్‌బిఐ.