కొత్తగా 6.4 కోట్ల మంది దారిద్య్రంలోకి...
ప్రపంచాభివృద్ధి సూచీ నివేదిక
సంక్షేమం దేశాలకు భారం
పేదరిక నిర్మూలనపై ఇంకా ఆశ
పెద్ద దేశాలకే మాంద్యం దెబ్బ

ఆర్థిక వ్యవస్థ
*కొనుగోలు శక్తి ఆధారంగా 2008లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి 2.8 శాతంగా నమోదైంది. అది ఉచ్ఛస్థితిలో బాగా ఉన్న 2007లో 5శాతంగా ఉంది.
* చిన్న, మధ్య తరహా ఆర్థిక వ్యవస్థలు భారీ ఆర్థిక వ్యవస్థల కంటే మెరుగైన పనితీరును కనబరిచాయి. ఇవి మొత్తం ప్రపంచ ఉత్పాదకతలో 43.3శాతం వాటాను సమకూర్చాయి.
* ప్రపంచం మొత్తం మాంద్యం దెబ్బకు కుదేలైంది. దక్షిణాసియాపై ఆ ప్రభావం పెద్దగా పడలేదు. (దక్షిణాసియాలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, తదితర దేశాలు ఉన్నాయి)
* అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎగుమతుల్లో 33శాతం వాటాను సాధించాయి. సేవల్లో వాటి ఎగుమతుల వాటా 21శాతం.
విద్య
2015 నాటికి ప్రతి విద్యార్థి పాఠశాలకు వెళ్లాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రపంచం ముందుకు సాగుతోంది. 2007 చివరినాటికి ప్రతి 10 మందిలో ఏడుగురు పాఠశాలకు వెళ్లగలుగుతున్నారు. ఇంకా 7.2 కోట్ల మంది పిల్లలు పాఠశాల గడప తొక్కలేదు. వీరిలో ఎక్కువమంది దక్షిణాసియా, సహార దేశాల్లో ఉన్నారు.
మహిళలు
*విద్యావకాశాలు బాలికలకు బాగానే అందుబాటులోకి వచ్చాయి. కానీ తక్కువ ఆదాయం గల ఆర్థిక వ్యవస్థలున్న దేశాల్లో లింగ వివక్ష కొనసాగుతోంది. చాలామంది ప్రమాదకర పనుల్లో మగ్గుతున్నారు.
*దక్షిణాసియా, లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల్లో మరింతమంది మహిళలు పార్లమెంటులోకి అడుగిడారు. దాదాపుగా 20%పైగా స్థానాలను వారు సొంతం చేసుకున్నారు.
బాలల ఆరోగ్యం
*పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరిగేలా చర్యలు మెరుగవుతున్నాయి. డయేరియా, మలేరియాలను నియంత్రించే కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి.
*అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు 1997లో వేయికి 101 ఉండేది. అది 2008 నాటికి 73కు తగ్గింది.
*45శాతం జనాభాకు ప్రాతినిథ్యం వహించే 39 దేశాలు శిశు మరణాల రేటును మూడింట రెండొంతులు తగ్గించగలిగాయి.
తల్లుల ఆరోగ్యం
*బాలింత మరణాలు భారీగా తగ్గాయి. 1990లో కనీసం ఒకసారైనా ఆసుపత్రికి వెళ్లగలిగిన గర్భిణీలు 64శాతం ఉండగా ఇప్పుడది 79శాతానికి చేరింది.
*సురక్షితమైన గర్భానికి వీలుగా కనీసం నాలుగు సార్త్లెనా ఆసుపత్రిని సందర్శించేవారి సంఖ్య ఇప్పటికీ 50శాతంలోపేఉంది.
వ్యాధులపై పోరాటం
*హెచ్‌ఐవీ వ్యాప్తి 17% తగ్గింది. యాంటీరెట్రోవైరల్ చికిత్స అందుబాటులోకి రావడంతో ఎయిడ్స్ మరణాలు తగ్గుముఖం పట్టాయి.
*క్షయ వ్యాధి తగ్గుముఖం పట్టినా 2015 నాటికి పూర్తిగా నిర్మూలన సాధ్యం కాదు. 2007లో క్షయ వ్యాధి గ్రస్థుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 1.37 కోట్లుగా ఉంది.
**2006లో మలేరియాతో 10లక్షల మంది మరణించారు. 90శాతం మరణాలు ఆఫ్రికాలోనే చోటుచేసుకుంటున్నాయి.
పర్యావరణం
*1990 నుంచి అడవుల నరికివేత నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. కానీ చైనా, తూర్పు ఆసియా దేశాల్లో అడవుల పెంపకం చేపట్టడంతో పరిస్థితి కొంత మెరుగుపడింది.
*రక్షిత మంచినీరు మరింత మందికి లభ్యమవుతోంది. 65 అభివృద్ధి చెందుతున్న దేశాలు మంచినీరు దొరకని సగం మందికి అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
*ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మందికి ఇప్పటికీ మరుగుదొడ్లు అందుబాటులో లేవు.