
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1500 వరకూ బార్లు ఉన్నాయి. వీటి నుంచి ప్రతి ఏడాదీ అనుమతి రుసుం(లైసెన్సు ఫీజు) రూపేణా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఏటేటా ఈ రుసుంను పెంచుతున్నా మద్యం దుకాణాల(వైన్ షాపుల)తో పోలిస్తే వీటి ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా కనిపిస్తుంది. బార్ల ద్వారా ఏటా సాధారణంగా రూ.500 కోట్లు వస్తే మద్యం దుకాణాల వేలం ద్వారా రెండేళ్లకు (2008-10 ఆర్థిక సంవత్సరానికి) ప్రభుత్వానికి సమకూరింది రూ.3200 కోట్లు. అందువల్ల ఎక్సైజ్ అధికారుల దృష్టంతా మద్యం దుకాణాలపైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణదారులకు ప్రయోజనం కలిగించేందుకు బార్‌లలో చీప్, మీడియం బ్రాండ్ల విక్రయాలను తొలగించే అంశంపై ఉన్నతాధికారులు కొంత కసరత్తు చేసినట్లు సమాచారం. దీనికి తమ సిబ్బంది నుంచే వ్యతిరేకత వ్యక్తమయింది. ఈ ప్రతిపాదనే కనుక అమలులోకి వస్తే బార్‌లు ఉండవని, అప్పుడు మద్యం దుకాణదారులు గుత్తాధిపత్యంతో ఇష్టానుసారంగా వ్యవహరించే ప్రమాదముందని సిబ్బంది అభిప్రాయపడినట్లు తెలిసింది. దీంతో అధికారులు ఈ ప్రతిపాదనను కాస్త పక్కకు పెట్టినట్లు సమాచారం.
మరింత సరకు పోవాలె!
రానున్న రెండు నెలల్లో మద్యం దుకాణాల లైసెన్సు గడువులు ముగియనున్నందున మరింత మద్యం విక్రయాలు జరిగేలా చూడాలని సిబ్బందిపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలోనూ ఉన్నతాధికారులు తమ సిబ్బందికి ఈ విధమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. వాస్తవానికి లైసెన్సు గడువు ముగిసే సమయానికి ఒక్క మద్యం సీసా కూడా వ్యాపారి వద్ద ఉండటానికి వీల్లేదు. అందువల్ల ఆఖరి రోజుల్లో వ్యాపారుల సరకు కోసం ఆర్డర్లు తగ్గిస్తుంటారు. ఉన్నతాధికారులు మాత్రం ప్రభుత్వానికి ఈ రెండు నెలల సమయంలోనూ ఆదాయం పెంచాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీని కోసం సిబ్బంది బదిలీలను సైతం కొంత కాలం నిలిపేస్తున్నారు. దుకాణాల వేలం పాటల తర్వాతే ఆ ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.