సీఆర్‌ఆర్ పావు శాతం పెంపు
రెపో, రివర్స్ రెపోలదీ అదే వరుస
ఆర్‌బీఐ ద్రవ్య, పరపతి విధాన సమీక్ష

* నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ని 5.75 శాతం నుంచి కేవలం పావు శాతం పెంచి 6 శాతానికి పరిమితం చేసింది. దీంతో బ్యాంకులు రిజర్వు బ్యాంకు వద్ద ఉంచాల్సిన మొత్తం మరో రూ. 12,500 కోట్లు పెరుగుతుంది. అంటే బ్యాంకుల వద్ద ఆ మేరకు నిధుల లభ్యత తగ్గుతుంది.
* సీఆర్‌ఆర్ పెంపు ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి రానుంది.
* రెపో, రివర్స్ రెపో రేట్లనూ 0.25 శాతం పెంచింది. తాజా పెంపుతో ఇవి వరుసగా 5.25 శాతం; 3.75 శాతానికి చేరాయి.
* బ్యాంకు రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ఇది యథాతథంగా 6 శాతం వద్దే ఉంది.
* 2010-11 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటు 8 శాతం ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం 5.5 శాతానికి దిగివస్తుందన్న ఇంకో అంచనా.
* 2009-10లో జీడీపీ వృద్ధి 7.2-7.5 శాతం ఉండొచ్చు.
* తదుపరి త్రైమాసిక సమీక్ష జులై 27న చేపడతారు.
* సెప్టెంబరు కల్లా విదేశీ బ్యాంకులపై చర్చా పత్రాన్ని విడుదల చేయాలని బ్యాంకు భావిస్తోంది.
'వచ్చే సమీక్ష (జులై 27) లోపే మళ్లీ చర్యలు చేపట్టే అవకాశాన్ని నేను కొట్టిపారేయలేను. పరిస్థితి ఎలా మారుతుందో మనకు తెలియదు. అయితే మధ్యంతర చర్యలు చేపట్టే ముందు చాలాసార్లు ఆలోచిస్తాం. ఒకేసారి పెంచడం కంటే అప్పుడప్పుడూ కొంత పెంచుతూ పోవడం మంచిదని నేను విశ్వసిస్తా. దేశ సూక్ష్మ ఆర్థిక పరిస్థితులను ముఖ్యంగా ధరల పరిస్థితిని మేం దగ్గరగా పరిశీలించడం కొనసాగిస్తాం. అవసరమైతే తదుపరి చర్యలనూ చేపడతాం. ప్రస్తుత చర్యలు వృద్ధికి విఘాతం కలిగించబోవు. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 8 శాతం ఉండొచ్చు. ద్రవ్యోల్బణమూ 5.5 శాతానికి పరిమితమవుతుంది. అయితే రుతుపవనాలపై అనిశ్చితి, వూగిసలాడుతున్న ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపనున్నాయి. ఆర్థిక వ్యవస్థలో డిమాండు ఎక్కువగా కనిపిస్తోంది. దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వృద్ధి స్థిరంగా ఉంది కాబట్టి ద్రవ్యోల్బణ కట్టడి దిశగా మా విధాన చర్యలు సాగాయి.' - దువ్వూరి సుబ్బారావు, రిజర్వు బ్యాంకు గవర్నరు |
'రిజర్వు బ్యాంకు కీలక రేట్ల పెంపు ద్రవ్య సరఫరాను కఠిన పరచి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను మరింత తగ్గిస్తుంది. నా శాఖ, నా అభిప్రాయం ప్రకారం 2010-11లో ద్రవ్యోల్బణం 5.5 శాతం(ఆర్‌బీఐ అంచనా) కంటే తక్కువే నమోదు కావొచ్చు. అది నాలుగు శాతానికి తగ్గిపోయినా ఆశ్చర్యం లేదు. రెపో, రివర్స్ రెపో, సీఆర్‌ఆర్‌లను పావు శాతం చొప్పున పెంచడమంటే పరిణతితో, సమతూక దృష్టితో మన ఆర్థికావసరాలను ఆర్‌బీఐ గమనించినట్లు కనిపిస్తోంది. ఈ చర్యలను పూర్తిగా సమర్థిస్తున్నా. భారత్ మళ్లీ వృద్ధి బాటలో పడింది కాబట్టి 'తటస్థ' విధాన రేట్లకు మళ్లీ తిరిగి వెళ్లే సమయం ఆసన్నమైంది. - ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర ఆర్థిక మంత్రి |
'ఇది(ఆర్‌బీఐ పరపతి విధానం) వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నేను అనుకోను. వృద్ధి రికవరీ ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తూ ఉంది. ఆర్‌బీఐ ప్రకటించిన (8 శాతం) వృద్ధి కంటే మరింత మెరుగ్గా నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. ద్రవ్యోల్బణం కూడా దిగివస్తుందని మా అంచనా.' -మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు |
ద్రవ్య సరఫరా తగినంత ఉండడం వల్ల స్వల్పకాలంలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం లేదని ఎస్‌బీఐ సహా ఇతర ప్రధాన బ్యాంకుల అధిపతులు పేర్కొన్నారు. ఆర్‌బీఐ పరపతి విధాన ప్రకటన అనంతరం వివిధ బ్యాంకు అధిపతులు ఏమన్నారంటే.. 'విధాన చర్యల వల్ల ద్రవ్య సరఫరా తగ్గుతుంది. అంటే కచ్చితంగా రేట్లు పెరుగుతాయ్. (రుణ) డిమాండు పెరిగితే గిరాకీ-సరఫరా మధ్యఅంతరం పెరుగుతుంది. అపుడు వడ్డీ రేట్లు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఆర్‌బీఐ ద్రవ్యోల్బణంపై ఆందోళన చెందుతోందని ప్రస్తుత చర్యల వల్ల అర్థమవుతోంది. ఈ చర్యల వల్ల ప్రస్తుతానికి వడ్డీ రేట్లలో మార్పు ఉండదు' -ఒ.పి. భట్, ఎస్‌బీఐ ఛైర్మన్ |
'ఈ ఏడాదిలో రుణ రేట్లు పెరుగుతాయ్. అయితే తక్షణం రేట్లపై ఎలాంటి ప్రభావం ఉండదు. -చందా కొచ్చర్, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈఓ |
| 'డిమాండు-సరఫరాపై రుణ రేట్లు ఆధారపడతాయ్. స్వల్పకాలంలో మాత్రం రేట్లలో మార్పు ఉండకపోవచ్చు. అయితే మా మార్జిన్లపై ఒత్తిడి కనిపిస్తోంది. -హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు |
'ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న రూ.1,00,000 కోట్లను దృష్టిలో ఉంచుకుంటే ఆర్‌బీఐ మరో పావు శాతం సీఆర్‌ఆర్‌ను పెంచినప్పటికీ పెద్ద ప్రభావం ఉండబోదు. వచ్చే ఆరు నెలల్లో కావలసినంత ద్రవ్య సరఫరా ఉంది. బ్యాంకులు ఈ ఆర్థిక సంవత్సరం కనీసం 20 శాతం రుణ వృద్ధిని సాధిస్తాయన్న విశ్వాసం ఉంది.' -ఎం.వి. నాయర్, యూనియన్ బ్యాంక్ ఛైర్మన్; ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఛైర్మన్ |





