Monday, April 19, 2010

సముద్రమే వ్యవసాయ క్షేత్రం!

విలువైన వాణిజ్య మొక్కల పెంపకం
ఆహార పదార్థాలు, సౌందర్య సాధనాల్లో వాడకం
ఔషధాల తయారీలోనూ కీలకం
మండపం (తమిళనాడు)
'న్యూస్‌టుడే' ప్రత్యేక ప్రతినిధి
పొలాల్లో నాట్లు వేయడం, అంటుకట్టడం, మొక్కలు పెంచడం మనకు తెలిసిన వ్యవసాయ కార్యకలాపాలు. కానీ వారికి నీలి సముద్రమే సాగు క్షేత్రం. సముద్రంలోనే మొక్కలు వేస్తారు. పెంచి పెద్ద చేసి, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఆశ్చర్యంగా ఉందా.. మరో వింత ఏంటంటే ఆ మొక్క నుంచి తీసిన 'కరేగీనన్‌' అనే పదార్థాన్ని మనం తాగే శీతల పానీయాలు, చాకొలెట్‌ మిల్క్‌, తినే ఐస్‌క్రీమ్‌లు, జెల్లీలు.. ఇలా అనేక పదార్థాల్లో వాడతారు. అంతే కాదు.. టూత్‌పేస్టులు, సౌందర్య సాధనాలు, ఔషధాల తయారీలోనూ ఈ పదార్థానిదే కీలక పాత్ర. ఈ సీ వీడ్‌ పేరు 'కప్పాఫైకస్‌అల్వారెఝి'. ఈ మొక్కలు పెరిగేందుకు కెరటాలు లేని, స్వచ్ఛమైన, తక్కువ లోతు ఉన్న నీళ్లు కావాలి. అప్పుడే సూర్యరశ్మి నీటి లోపలికి చొచ్చుకుని వెళుతుంది. తమిళ నాడులోని కొన్ని తీర ప్రాంతాలు దీనికి అనుకూలంగా ఉండడంతో అక్కడ ఎక్కువ పెరుగుతోంది. తమిళ నాడులో రామనాథపురం జిల్లా రామేశ్వరం, మండపం ప్రాంతాలతో పాటు, తొండి, పుదుకొట్టాయ్‌, ట్యూటికొరిన్‌, కన్యాకుమారి వంటివి ఈ సీ వీడ్‌ పెంపకానికి అనువైనవి. ఈ మొక్కలతో ఏటా భారీ వ్యాపారం జరుగుతోంది. మన రాష్ట్రంలో ఒంగోలు, విశాఖలోని లాసన్స్‌ బే వంటి చోట్ల వీటిని పెంచే ప్రయత్నాలు జరిగాయి. కానీ, అవి అంతగా విజయవంతం కాలేదు.

45 రోజుల్లో పంట
రెడ్‌ ఆల్గే జాతికి చెందింది కప్పాఫైకస్‌అల్వారెఝి. జెల్లింగ్‌, పదార్థాన్ని గట్టి పరచడం (థికెనింగ్‌), స్టెబిలైజింగ్‌ ఏజెంట్‌గా దీన్ని వాడుతారు. దీన్ని పండించే విధానం ఎంతో ఆసక్తికరం. వెదురుతో చేసిన 12 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నలుచదరపు చట్రాలు (ర్యాఫ్ట్‌లు) దీనికి వాడతారు. కప్పాఫైకస్‌ మొక్కను చిన్న ముక్కలుగా చేసి తీగకు తోరణాలుగా కడతారు. ఇలాంటి తోరణాలు ఒక్కో చట్రానికి 20 వేలాడదీస్తారు. ప్రతీ చట్టానికి 4-5 కిలోల మొక్కలు కట్టి సముద్రంలో వదిలివేస్తే 45 రోజుల్లో అది పెరిగి 35-40 కిలోలు అవుతుంది.

పెద్ద పెట్టుబడి అక్కర్లేదు
రామనాథపురం జిల్లాలోని రామేశ్వరం, వేదాలయం ప్రాంతంలోనే సుమారు 1500 మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో 500 నుంచి 1,000 చట్రాలు కలిగిన రైతులు కూడా ఉన్నారు. ఒక్కో చట్రం ఏర్పాటుకు రూ.1,000 ఖర్చు అవుతుంది. తరువాత పెద్దగా పెట్టుబడి ఉండదు. ఈ మొక్కలకు నీళ్లు పెట్టడం, ఎరువులు వేయడం వంటి పని ఉండదు.

పచ్చిమొక్కలకు రూ.2, ఎండు మొక్కలకు రూ.17
ఒకప్పుడు పెప్సీ కంపెనీ ఒక్కటే ఈ మొక్కలను కొనుగోలు చేసేది. అందుకే ఇక్కడ ఈ మొక్కకు 'పెప్సీ పాసి' (పెప్సీ నాచు) అన్న పేరు స్థిరపడిపోయింది. కానీ ఇప్పుడు మరికొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ మొక్కను కొనుగోలు చేస్తున్నాయి. పచ్చి మొక్కలను కిలో రూ.2కు కొంటున్నారు. ఎండబెట్టిన మొక్కలకు కిలోకు రూ.17 చెల్లిస్తున్నారు. 10 కిలోల పచ్చి మొక్కలు ఎండబెడితే ఒక కిలో ఎండు మొక్కలు వస్తాయి.