Thursday, April 22, 2010

7,650 కోట్లు 'బూడిద' పాలు

వారం వ్యవధిలో విమాన సంస్థల నష్టం
బెర్లిన్‌: ఐస్‌ల్యాండ్‌లో అగ్నిపర్వతం బద్దలవడంతో వెల్లువెత్తిన బూడిద ఈ వారం రోజుల్లో విమాన సంస్థలకు 1.7 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.7,650 కోట్లు) నష్టాన్ని మిగిల్చింది. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌(ఐఏటీఏ) అధిపతి జియోవాని బిసిగ్నాని ఇక్కడి విలేకర్లతో ఈ విషయం చెప్పారు. ఆదాయం లేకుండా గడిపిన వారం ఇదేనని పైగా అది వ్యయాలనూ ఆపలేకపోయిందని ఆయన అన్నారు. ప్రయాణికులకు వసతి, ఆహార, ప్రత్యామ్నాయ రవాణా వంటి వాటిని కల్పించడానికి అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అంతక్రితం అంచనా వేసినట్లు రోజుకు 200 మిలియన్‌ డాలర్లు కాకుండా రోజుకు 400 మిలియన్‌ డాలర్ల దాకా సంస్థలు నష్టపోవలసి వచ్చిందని వివరించారు. ఐరోపా దేశాల ప్రభుత్వాలు విమాన సంస్థలను ప్రకృతి బాధితులుగా పరిగణించి సహాయం చేయాల్సి ఉందని తెలిపారు. సెప్టెంబరు 11, 2001 దాడుల తర్వాతి పరిస్థితికి ఇప్పటికీ తేడా ఉందని.. ఆ సమయంలో ప్రభుత్వాలు సంస్థలకు సహాయ ప్యాకేజీలు ప్రకటించాయని అన్నారు. 'నష్టం ఎంతన్నది ఇంకా అంచనా వేయలేదు. అయితే అది తక్కువగా ఏమీ ఉండబోద'ని ఐరోపాలో అతిపెద్ద విమాన సంస్థ లుఫ్తాన్సా అంటోంది. గత వారం రోజుల్లో లక్షల కొద్దీ ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోగా.. ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర నష్టం కలిగిన విషయం తెలిసిందే.