Monday, April 26, 2010

విమానాల కొనుగోలుకు ఎయిరిండియా రూ.4,435 కోట్ల సమీకరణ!

న్యూఢిల్లీ: ఎయిరిండియా ఈ ఆర్థిక సంవత్సరంలో విమానాల కొనుగోలు, తదితర కార్యకలాపాల నిర్వహణ కోసం సంస్థాగత వనరులు, రుణాల ద్వారా రూ.4,435 కోట్లను సమీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ నిధుల్లో రూ.41,97.80 కోట్లను విమానాల కొనుగోలుపైనా, మిగతారూ.237 కోట్లను సంస్థకు చెందిన భవన నిర్మాణాలు, కంప్యూటరీకరణ, బుకింగ్‌ కార్యాలయాల విస్తరణలకు వెచ్చించనున్నట్లు అభిజ్ఞవర్గాల సమాచారం. కొత్తగా ఖరీదు చేయనున్న విమానాల్లో.. నాలుగు 'బోయింగ్‌ 777-300(విస్తరించిన శ్రేణి)'లతో పాటు ఒక ఎయిర్‌బస్‌ ఎ-321 ఉండొచ్చని ఆ వర్గాలు అంచనావేస్తున్నాయి. మరో ఎ-321ను కొనుగోలు చేసినట్లయితే ఎయిరిండియా వద్దనున్న మొత్తం ఎయిర్‌బస్‌ విమానాల సంఖ్య 42కు చేరుతుందని సమాచార వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా వార్షిక ప్రణాళిక వ్యయం విలువ రూ.5,634.80 కోట్లు. ఇందులో రూ.1,200 కోట్లను ఈక్విటీ రూపంలో అందించేందుకు సర్కారు ఇప్పటికే అంగీకరించగా మిగతా నిధులను అంతర్గత వనరులు, రుణ మార్గాల ద్వారా సమీకరించేందుకు సంస్థ సన్నద్ధమవుతున్న సంగతి విదితమే.