Monday, April 26, 2010

ప్రైవేటు కంటే పీఎస్‌యూలే నయం

పన్ను చెల్లింపుల తీరుపై కాగ్‌ నివేదిక
న్యూఢిల్లీ: ప్రైవేటు కంపెనీల కంటే ప్రభుత్వ సంస్థ(పీఎస్‌యూ)లే మెరుగ్గా పన్నులను చెల్లిస్తున్నట్లు కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదిక తేల్చి చెప్పింది. 2007-08 సంవత్సరంలో పీఎస్‌యూలు అత్యధికంగా 25.7 శాతం ఎఫెక్టివ్‌ పన్నురేటుతో ముందంజలో నిలవగా, ప్రైవేటు సంస్థలు 21.3 శాతం మేర చెల్లింపులు జరిపాయని కాగ్‌ ఇటీవల పార్లమెంటుకు ఇచ్చిన ఓ నివేదికలో వెల్లడించింది. చట్టబద్ధంగా చూస్తే కంపెనీలు వాటి లాభాల్లోని 33.9 శాతాన్ని కార్పొరేట్‌ పన్నుగా చెల్లించాల్సి ఉంది.. అయితే దీనిపై పలు మినహాయింపులు పొందిన అనంతరం చెల్లిస్తున్నదే ఎఫెక్టివ్‌ పన్ను రేటుగా పిలుస్తున్నారు. పీఎస్‌యూలు, ప్రైవేటు సంస్థలు చెల్లిస్తున్న పన్ను రేట్లలో తేడాలు చోటు చేసుకోవడానికి గల కారణాలపై దృష్టి సారించాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖను కాగ్‌ కోరింది. భారీ పీఎస్‌యూల కంటే ప్రైవేటు సంస్థలే సర్కారు నుంచి అత్యధిక పన్ను మినహాయింపులు పొందుతున్నట్లు కూడా నివేదిక పేర్కొంది. ఈ రెండు(ప్రభుత్వ,ప్రైవేటు) రంగాల మధ్య ఎఫెక్టివ్‌ పన్నురేటు చెల్లింపు విషయంలో ఏర్పడుతున్న లోటుపై కంపెనీల బోర్డు స్థాయిల్లో సమీక్షించాల్సిన అవసరముందని సూచించింది. చిన్న కంపెనీల కంటే పెద్ద కంపెనీలే భారీ పన్ను ప్రోత్సాహకాలను మూటకట్టుకుంటున్నట్లు వివరించింది. రూ.500 కోట్లు అంతకంటే ఎక్కువ పన్ను ముందస్తు లాభం(పీబీటీ) ఉండే కంపెనీల ఎఫెక్టివ్‌ పన్ను రేటు 21.9 శాతం కాగా రూ.కోటి మేర పీబీటీ ఉండే సంస్థల ఎఫెక్టివ్‌ పన్ను రేటు 24.1 శాతం ఉన్నట్లు వెల్లడించింది. 2008-09 సంవత్సరంలో జరిగిన మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లలో ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రల ఉమ్మడి వాటా 75 శాతం కాగా అంతక్రితం ఏడాదిలో ఇది 66 శాతంగానే ఉన్నట్లు కాగ్‌ నివేదిక అభిప్రాయపడింది.