అత్యున్నత ప్రమాణాలు పాటించే సంస్థల్లో చదివే విద్యార్థులు ఉద్యోగాల సంక్షోభం, బూమ్‌ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, బిట్స్ లాంటి సంస్థలే దీనికి ఉదాహరణ. మనరాష్ట్రంలో ఐఐఐటీ, జేఎన్‌టీయూ హైదరాబాద్, ఆంధ్ర, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలు సంయుక్తంగా ప్రారంభించిన ఎం.ఎస్.ఐ.టి. కోర్సు కూడా ఈ కోవలోకి వస్తుంది. ప్రస్తుతం ఐఐఐటీ, జేఎన్‌టీయూ హైదరాబాద్ మాత్రమే ఈ కోర్సును నిర్వహిస్తున్నాయి. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక సంస్థ కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ సహకారంతో నిర్వహిస్తోన్న ఈ కోర్సులో అనేక ప్రత్యేకతలున్నాయి.ఉద్యోగ అవకాశాల పరంగా అత్యంత క్లిష్ట సమయంగా భావించిన గత మూడేళ్లలోనూ దాదాపు 100 శాతం ప్లేస్‌మెంట్లు సాధించిపెట్టిన కోర్సు... ఎం.ఎస్.ఐ.టి. (మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ). కోర్సు రూపకల్పన, బోధనలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు పాటిస్తోన్న ఈ కోర్సులో అనేక ప్రత్యేకతలున్నాయి. మొత్తం కోర్సులో 20 శాతం సిలబస్, సమయాన్ని సాఫ్ట్ స్కిల్స్‌కు కేటాయించడం అన్నిటికంటే ముఖ్యమైన ప్రత్యేకత. బీటెక్ తర్వాత... విదేశాల్లోని ఏదో ఒక సంస్థలో ఎం.ఎస్.లో చేరడం కంటే ఐఐఐటీ, జేఎన్‌టీయూల్లో ఎం.ఎస్.ఐ.టి. కోర్సు చేయడం మంచిదనడానికి ఇక్కడి ప్లేస్‌మెంట్లే సాక్ష్యం!
ఆచరణాత్మక దృక్పథం
ఎం.ఎస్.ఐ.టి. కోర్సు మొత్తాన్ని ఆచరణాత్మక దృక్పథంతో రూపొందించడం విశేషం. కోర్సులోని ప్రతి మాడ్యూల్‌ను ఒక ప్రాజెక్టుగా భావించి ఆచరించడం ద్వారా నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఉదాహరణకు ఒక విద్యార్థి డేటా స్ట్రక్చర్స్ మాడ్యూల్ చేస్తుంటే, దీనికి సంబంధించి ఒక ప్రాజెక్టు చేయడం ద్వారా ఈ భావనను నేర్చుకుంటాడు. తద్వారా ఆ భావనపై పూర్తి స్థాయిలో పట్టు ఏర్పడుతుంది.
* ఎం.ఎస్.ఐ.టి. ఫ్యాకల్టీ సభ్యులు ఏటా అమెరికాలోని సీఎంయూలో శిక్షణ పొందుతారు. మనదేశంలోని ఐఐటీలు, ఇతర యూనివర్సిటీల్లో బోధించే అధ్యాపకుల సహకారం కూడా శిక్షణలో ఉంటుంది.
* కంపెనీల ప్రతినిధులకు కూడా శిక్షణలో భాగస్వామ్యం ఉంటుంది. పెద్ద కంపెనీలకు చెందిన సీఈఓలు, పేరున్న విద్యాసంస్థల అధ్యాపకులతో సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు.
* ఆధునిక స్పెషలైజేషన్లను అందించడం ఎం.ఎస్.ఐ.టి. మరో ప్రత్యేకత. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ నెట్‌వర్క్స్ అండ్ సెక్యూరిటీ, ఈ-బిజినెస్ టెక్నాలజీస్, బయో ఇన్ఫర్మేటిక్స్ లాంటి స్పెషలైజేషన్లు ఈ కోర్సులో అందుబాటులో ఉన్నాయి.
* ప్రతిభావంతులైన విద్యార్థులకు టీచింగ్ అసిస్టెంట్‌షిప్ లభిస్తుంది. తద్వారా కొంత ఆర్థికభారం తగ్గే అవకాశం ఉంటుంది.
బహుళజాతి కంపెనీల్లో ప్లేస్‌మెంట్లు
ఎం.ఎస్.ఐ.టి. ప్రారంభించినప్పటి నుంచి విద్యార్థులందరికీ మంచి కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తుండటం విశేషం. అనేక బహుళజాతి కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్లను నిర్వహిస్తున్నాయి. అనేక కంపెనీలు ఇంటర్న్‌షిప్ అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి. గత రెండు, మూడేళ్లలో టీసీఎస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, ఇన్ఫోసిస్, ఒరాకిల్, విప్రో, క్యాప్ జెమిని, ఏటీ అండ్ టీ, డెల్, క్యాపిటల్ ఐక్యూ, ఎరిసెంట్, సీఎస్‌సీ, ఏడీపీ, డెలాయిట్, యాహూ, సీఏ, కన్వర్జీస్, పాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్, తదితర కంపెనీల్లో ఎం.ఎస్.ఐ.టి. విద్యార్థులకు ఉద్యోగాలు లభించినట్లు కోర్సు డీన్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాసరావు చెప్పారు.
ప్రవేశ పరీక్ష ఇలా?
ఎం.ఎస్.ఐ.టి. ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. ఎంపిక చేసిన ఇంటర్నెట్ కేంద్రాలకు వెళ్లి అభ్యర్థులు పరీక్ష రాయాలి. మొత్తం ఎంట్రన్స్ ప్రక్రియలో మూడు దశలుంటాయి...
1. మొదటి దశలో Graduate Aptitude Test (GAT) ఉంటుంది. దీన్ని హైదరాబాద్, వరంగల్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఇది ఆన్‌లైన్ పరీక్ష. రెండున్నర గంటల వ్యవధిలో 100 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.
2. GATలో ఉత్తీర్ణులైనవారికి లిజనింగ్ కాంప్రహెన్షన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కనీస ఉత్తీర్ణత మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఇందులో కనీస మార్కులు సాధించినవారికి అదేరోజు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
3. పై రెండు దశలు విజయవంతంగా అధిగమించినవారిని ప్రిపరేటరీ కోర్సుకు అనుమతిస్తారు. ఈ కోర్సు వ్యవధి 8 వారాలు. అభ్యర్థి ఐటీ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఇందులో శిక్షణ ఉంటుంది. దీన్ని కూడా విజయవంతంగా పూర్తిచేస్తే ఎం.ఎస్.ఐ.టి. కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.
ఈ అభ్యర్థులకు మినహాయింపు...
కింది అర్హతలున్నట్లయితే ఎం.ఎస్.ఐ.టి. ప్రవేశ పరీక్ష మొదటి దశ నుంచి మినహాయింపు లభిస్తుంది. నేరుగా రెండో దశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు...
* జీఆర్‌ఈ వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాల్లో 1100పైగా స్కోరు, ఎనలిటికల్ రైటింగ్‌లో 3.5 స్కోరు ఉండాలి. జులై 2007 తర్వాత జీఆర్‌ఈ రాసిన అభ్యర్థులే అర్హులు.
* టోఫెల్ స్కోరు 213/300 (సీబీటీ) లేదా 79/120 (ఐబీటీ) ఉన్న అభ్యర్థులు రెండో దశ పరీక్ష నుంచి మినహాయింపు పొందవచ్చు. జులై 2008 తర్వాత టోఫెల్ రాసిన అభ్యర్థులే దీనికి అర్హులు.
ఫీజులు, రుణసౌకర్యం
ఎం.ఎస్.ఐ.టి. కోర్సు వ్యవధి రెండేళ్లు. రెండేళ్లకుగాను ఫీజులు మొత్తం రూ. 2,80,000 అవుతుంది. ఫీజు ఎక్కువగానే ఉన్నప్పటికీ... ఇందులో ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ బ్యాంకుల నుంచి విద్యారుణం లభించే అవకాశం ఉంటుంది. కోర్సు రెండో ఏడాదిలో ప్రతిభ గల విద్యార్థులకు టీచింగ్ అసిస్టెంట్‌షిప్ రూపంలో స్టయిపెండ్ కూడా ఇస్తారు.
ఎం.ఎస్.ఐ.టి. ఫీజులు ఇలా ఉన్నాయి...
* 8 వారాల ప్రిపరేటరీ కోర్సుకు రూ.15,000
* మొదటి సంవత్సరం రూ.1,10,000
* ల్యాప్‌టాప్ ఫీజు రూ.30,000 (కోర్సు పూర్తయ్యాక ల్యాప్‌టాప్ విద్యార్థికి ఇస్తారు)
* రెండో ఏడాది ఫీజు రూ.1,25,000
ఆన్‌లైన్ దరఖాస్తులు మాత్రమే...
ఎం.ఎస్.ఐ.టి. కోర్సుకు కింది డిగ్రీలున్న అభ్యర్థులు అర్హులు.
* బి.టెక్./ బి.ఇ. (అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులు) లేదా వీటికి సమానమైన డిగ్రీ, లేదా
* కంప్యూటర్ సైన్స్/ మేథమేటిక్స్/ స్టాటిస్టిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్, లేదా
* ఎంసీఏ
ఎం.ఎస్.ఐ.టి. కోర్సుకు ఆన్‌లైన్ పద్ధతిలో మాత్రమే దరఖాస్తు చేసుకునే వీలుంది. www.msitprogram.net వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేటప్పుడు ఇవి అవసరమవుతాయి...
* పదో తరగతి మార్కుల జాబితా కాపీ
* 'సి.ఐ.హెచ్.ఎల్.' పేరు మీద హైదరాబాద్‌లో చెల్లేవిధంగా రూ.500ల డి.డి.
* రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు
* ఇ-మెయిల్ ఐడీ
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత ఒక ఐడీ ఇస్తారు. డి.డి. వెనుక ఆన్‌లైన్ ఐడీ, పేరు, చిరునామా, ఫోన్ నెంబరు రాసి 'The Dean, Consortium of Institutions of Higher Learning, IIIT Campus, Gachibowli, Hyderabad - 500032.' అడ్రస్‌కు పంపించాలి.
* దరఖాస్తులు చేరడానికి చివరితేదీ: 17 మే 2010.
* హాల్ టికెట్లను ఈ-మెయిల్ ద్వారా పంపిస్తారు లేదా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: 95537 05134, 95537 05130
*email: enquiries2010@ msitprogram.net
వాక్-ఇన్ ఎంట్రన్స్
ఎం.ఎస్.ఐ.టి.లో చేరాలనుకునే విద్యార్థులు తమకు వీలైన సమయంలో ఎంట్రన్స్ రాసే విధంగా 'వాక్ ఇన్ ఎంట్రన్స్' సౌలభ్యం ఉంది. ఏప్రిల్ 12 నుంచి మే 25 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌లో మాత్రమే ఈ సౌలభ్యం ఉంది. ప్రతి గురు, శుక్ర, శని, ఆది వారాల్లో ఈ ఎంట్రన్స్ పరీక్ష రాయవచ్చు. 'సి.ఐ.హెచ్.ఎల్.' పేరు మీద రూ.500 డి.డి., పదో తరగతి సర్టిఫికెట్ కాపీ, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో నేరుగా హాజరుకావచ్చు. ప్రస్తుతం వాక్ ఇన్ ఎంట్రన్స్ కేంద్రం హైదరాబాద్‌లో మాత్రమే ఉంది. దీని చిరునామా...
Eduquity Career Technology Private Limited, 4th floor, My Home Sarovar Plaza, Adjacent to Mediciti Hospital, Secretariat Road, Saifabad, Hyderabad. Phone: 040- 23243010.
వాక్ ఇన్ ఎంట్రన్స్ రాసే అభ్యర్థులు అవసరమనుకుంటే మామూలు ఆన్‌లైన్ ఎంట్రన్స్ (గ్యాట్)కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెంటిలో ఎందులో ఎక్కువ స్కోరు వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. వాక్ ఇన్ ఎంట్రన్స్‌లోనూ, మామూలు ఎంట్రన్స్‌లోనూ ప్రశ్నపత్రం స్థాయి ఒకే విధంగా ఉంటుంది.


* జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ), హైదరాబాద్: 150 * ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్: 30 * ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం: 30 * శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి: 30 |
![]() - ప్రొఫెసర్ ఎం. శ్రీనివాసరావు, డీన్, ఎం.ఎస్.ఐ.టి. ప్రోగ్రామ్ |
![]() - విద్యాసాగర్, ఎం.ఎస్.ఐ.టి., ఐఐఐటీ |

జేఎన్‌టీయూ హైదరాబాద్