Saturday, April 24, 2010

ఆర్ఐఎల్ లాభం రూ. 4,710 కోట్లు

2 లక్షల కోట్లు దాటిన టర్నోవర్

ముంబై : దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి 4,710 కోట్ల రూపాయల నికరలాభాన్ని ప్రకటించింది. అంతకు క్రితం ఏడాది ఇదే కాలం లాభంతో (3,955 కోట్ల రూపాయలు) పోల్చితే ఇది 30 శాతం అధికం. అంతేకాకుండా తొలిసారిగా 2009-10 ఆర్థిక సంవత్సరంలో 35 శాతం వృద్ధితో 2,00,400 కోట్ల రూపాయల టర్నోవర్‌ను కంపెనీ సాధించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ టర్నోవర్ 1,53,138 కోట్ల రూపాయలుగా నమోదైంది.

సంవత్సరానికి నికరలాభం ఆరు శాతం వృద్ధితో 16,236 కోట్ల రూపాయలుగా నమోదైంది. కేజీ డి-6 బ్లాక్ నుంచి ఉత్పత్తి పెరగడంవల్ల నాలుగో త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్ రెండింతలకు పైగా పెరిగి 60,267 కోట్ల రూపాయలకు చేరింది. రోజుకు 60 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేయడంతో దేశంలోనే అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తి కంపెనీగా ఆర్ఐఎల్ అవతరించింది.

గ్యాస్ విక్రయాల ద్వారా కంపెనీ రాబడి దాదాపు ఐదు రెట్లు పెరిగి 4,318 కోట్ల రూపాయలకు ఎగబాకింది. మొత్తంలో పన్నుకు ముందు లాభాలు 29.2 శాతంగా ఉన్నాయి. రిఫైనింగ్ నుంచి ప్రీ టాక్స్ లాభాలు 5.2 శాతానికి తగ్గి 1,986 కోట్ల రూపాయలకు చేరినట్లు కంపెనీ పేర్కొంది.

2009-10 సంవత్సరంలో పెట్రో కెమికల్స్ సెగ్మెంట్‌లో 55,251 కోట్ల రూపాయల రాబడిపై ప్రీ టాక్స్ 8,581 కోట్ల రూపాయలుగా నమోదైందని రిలయన్స్ పేర్కొంది. కాగా మొత్తం సంవత్సరానికి 15,898 కోట్ల రూపాయల నికరలాభం నమోదైందని, ఇది అంతకు క్రితం ఏడాది ఇదే కాలంతో (15,296 కోట్ల రూపాయలు) పోల్చితే నాలుగు శాతం అధికమని కంపెనీ పేర్కొంది.

స్టాండ్ఎలోన్ ప్రాతిపదికన నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికరలాభం 3,627 కోట్ల రూపాయల (2008-09) నుంచి 4,710 కోట్ల రూపాయలకు పెరిగింది. మొత్తం ఆదాయం రెండు రెట్లకు పైగా పెరిగి 26,793 కోట్ల రూపాయల నుంచి 60,267 కోట్ల రూపాయలకు ఎగబాకింది. ఇదిలా ఉండగా పది రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుపై 7 రూపాయల డివిడెండ్‌ను ఆర్ఐఎల్ ప్రకటించింది.