Thursday, April 22, 2010

యులిప్‌ల వివాదం త్వరలో పరిష్కారం

ముంబై, ఏప్రిల్ 22 : యులిప్‌ల వివాదాన్ని అత్యున్నత స్థాయి సమన్వయ కమిటీ (హెచ్ఎల్‌సిసి) స్థాయిలో పరిష్కరించుకోవడానికి ఐఆర్‌డిఎ, సెబి పరస్పరం అంగీకరించాయని తెలిసింది. ఈ వివాదం చిలికిచిలికి గాలివానగా మారకముందే (హెచ్ఎల్‌సిసి) స్థాయిలో సమస్య పరిష్కారానికి ఉభయపక్షాలు అంగీకరించినట్టు ఆర్‌బిఐ వెల్లడించింది. ఫైనాన్షియల్, కాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థల సారధులతో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో ఏర్పాటైన హెఎల్‌సిసి అంతర్ నియంత్రణ సంస్థగా వ్యవహరిస్తుంది. యులిప్‌ల వ్యవహారం హెచ్ఎల్‌సిసి ఎజెండాలో యులిప్‌ల వ్యవహారం గత కొద్దికాలంగా ఉందని ఆర్‌బిఐ గవర్నర్ సుబ్బారావు వెల్లడించారు. ద్వైపాక్షికంగా సమస్య పరిష్కారానికి సెబి-ఐఆర్‌డిఎ అంగీరించినట్టు ఆయన వెల్లడించారు.

హెచ్ఎల్‌సిసికి సుబ్బారావు చైర్మన్‌గా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం బీమా కంపెనీలు యులిప్ స్కీమ్‌ల ద్వారా నిధుల సమీకరించడాన్ని సెబి నిషేధించడం దీనిని ఐఆర్‌డిఎ తిరస్కరించడం చేయడం తెలిసిందే. ఇదిలా ఉండగా యులిప్‌లపై వివాదం వల్ల ఇన్వెస్టర్లకు మార్కెట్లపై విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి సాల్మన్ ఖుర్షీద్ ఖండించారు.

వివాదాన్ని ఏదో ఒక సంస్థ పక్షాన కోర్టులు పరిష్కరిస్తాయని ఆయన చెప్పారు. ఇన్వెస్టర్లు విశ్వాసం కోల్పోవల్సిన అవసరం లేదనీ అంతిమంగాఅయితే సెబి లేదా ఐఆర్‌డిఎకు యులిప్‌ల పర్యవేక్షణ బాధ్యతను కోర్టులు అప్పగిస్తాయని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థికరంగంలో నియంత్రణ వ్యవస్థలు కొత్తవి కావడంతో ఇలాంటి వివాదాలు సాధారణమేనన్నారు.