Thursday, April 29, 2010

బ్యాంకు ఉద్యోగుల వేతనాలు 17.5% పెంపు

కుదిరిన వేతన సవరణ ఒప్పందం
ముంబయి: బ్యాంకు ఉద్యోగులకు తీపికబురు. సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఉద్యోగుల వేతనాలు 17.5 శాతం మేర పెరగనున్నాయి. ఈ మేరకు భారతీయ బ్యాంకుల అసోషియేషన్‌(ఐబీఏ), 9 బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. వేతన సవరణ ఒప్పందంపై ఉద్యోగులు, ఐబీఏ ప్రతినిధులు మంగళవారం సంతకాలు చేశారు. 26 ప్రభుత్వరంగ బ్యాంకులు, 12 ప్రైవేటురంగ బ్యాంకులు, ఎనిమిది విదేశీ బ్యాంకులు ఈ ఒప్పందం పరిధిలోకి వస్తాయి. సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు, అధికారులకు లబ్ధి చేకూరనుంది. వేతనాల పెంపువల్ల బ్యాంకులపై ఏటా రూ.4,816 వేల కోట్ల భారం పడనుంది. 2007 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలను ఒకేసారి చెల్లిస్తారు.'వేతనాల పెంపు నవంబరు 1, 2007 నుంచి వర్తిస్తుంది. ఇంటి అద్దెతోపాటు ఇతర అలవెన్సులు పెరుగుతాయి. ఈ ఒప్పందం ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది. 1995లో పెన్షన్‌ పథకంలో చేరని ఉద్యోగుల కోసం ప్రస్తుత ఒప్పందం సువర్ణ అవకాశాన్ని కల్పించింది. ఈ పథకంలో చేరనప్పటికీ భవిష్యనిధికి సొమ్మును చెల్లిస్తున్న ఉద్యోగులు తిరిగి ఇందులో చేరేందుకు వీలు కల్పించింది' అని ఐబీఏ డిప్యూటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉన్నికృష్ణన్‌ తెలిపారు.