ముంబయి: విదేశీ సంస్థాగత మదుపుదారులు (ఎఫ్‌ఐఐలు) భారత దేశంలో తమ పెట్టుబడి స్వరూపాన్ని గురించి మరింత సమాచారాన్ని వెల్లడి చేయాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆదేశించింది. ఫిక్కీ ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ జరిగిన క్యాపిటల్ మార్కెట్ సమావేశానికి సెబీ ఛైర్మన్ సి.బి.భావే హాజరైన సందర్భంగా విలేకరులకు ఈ సంగతిని చెప్పారు. సెబీ ఇప్పటికే.. ఈ నెల 7న లేదా అంతక్రితం నమోదు అయిన ఎఫ్‌ఐఐలను అవి మల్టి-క్లాస్ షేర్ మెహికిలేనా కాదా తెలపాలని అడగడం గమనార్హం. అలాగే, అవి ప్రొటెక్టెడ్ సెల్ కంపెనీ (పీసీసీ)లుగా ఏర్పాటైనవా, లేక సెగ్రిగేటెడ్ పోర్ట్‌ఫోలియో కంపెనీ (ఎస్‌పీసీ)లా అనేది కూడా స్పష్టం చేయాలంది. కాగా, ప్రస్తుతం కేపిటల్ మార్కెట్ల విస్తరణపై తాము (సెబీ) దృష్టి సారించామని, అయితే ఈ ప్రక్రియలో తాము సమన్వయకర్తలుగా వ్యవహరించదలచామని భావే వివరించారు. మార్కెట్ల విస్తరణ అనేది ఒక క్రమ పద్ధతిలో, సమర్థమైన రీతిలో సాగేటట్టు తాము చూడవలసి ఉందని ఆయన అన్నారు. లావాదేవీల ఖర్చులు తగ్గించాలి: కేపిటల్ మార్కెట్లు వృద్ధి చెందాలంటే అనేక విధాలైన లావాదేవీ ఖర్చులను తగ్గించుకోవలసిన అవసరం ఉందని సెబీ ఛైర్మన్ చెప్పారు. ట్రేడింగ్ పరిమాణం భారీగా ఉన్నప్పటికీ లావాదేవీల మొత్తం (టికెట్-సైజ్) స్వల్పంగానే ఉంటున్నట్లు, దీని ఫలితంగా వ్యయాలపై ఒత్తిడి పెరుగుతున్నట్లు భావే గుర్తు చేశారు. మార్కెట్లలో షేర్ల లావాదేవీల తాలూకు బ్రోకరేజి వ్యయాలను తగ్గించే పద్ధతులపై తాము కసరత్తు జరుపుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. ''లావాదేవీల వ్యయాలు మూడు విధాలు.. మొదటిది బ్రోకరేజి, రెండోది పన్నులు, మూడోది ఇంపాక్ట్ కాస్ట్‌లు. వ్యయ నియంత్రణ జరగాలి. ఈ విషయాన్ని మార్కెట్ పార్టిసిపెంట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్లు గుర్తు పెట్టుకోవాలి. గత రెండేళ్లలో సెబీ వివిధ మార్కెట్ మధ్యవర్తులకు రుసుము తగ్గించింది. బ్రోకరేజి వ్యయాలపై దృష్టి సారించాల్సి ఉంది'' అని భావే చెప్పుకొచ్చారు.