
ఇటీవల ఢిల్లీలోని మాయాపురిలో కోబాల్ట్-60 అనే రేడియోధార్మిక పదార్థం.. తుక్కు సామానులో వెలుగుచూడడం ఈ-వ్యర్థాలపై మనం దృష్టిసారించేలా చేసింది. ఇలాంటి చెత్తను అక్రమంగా రీసైకిల్ చేయడం వల్ల పర్యావరణానికి, ఆరోగ్యానికి పెను నష్టం కలుగుతోందని కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా గుర్తించింది. ఈ-వ్యర్థాల నిర్వహణ, పారేయడానికి గట్టి నిబంధనలను మే 15లోగా తెస్తామని తొలిసారిగా తెలిపింది. ఈ మేరకు సోమవారం రాజ్యసభలో కేంద్ర పర్యావరణ మంత్రి జైరామ్ రమేశ్ ఒక ప్రకటన చేశారు.
![]() |
* 2005లో 1.47 లక్షల టన్నుల ఈ-వ్యర్థాలు భారత్‌లో ఉత్పత్తయ్యాయి. 2012 నాటికి ఇది 8 లక్షల టన్నులకు చేరుతుందని అంచనా. ఇందులో 50వేల టన్నుల ఈ-వ్యర్థాలను దేశంలోకి దిగుమతి చేసుకోవడమో.. డంప్ చేయడమో జరుగుతోంది. * అమెరికాలో ఏటా 3 కోట్ల కంప్యూటర్లను త్యజిస్తున్నారు. ఇందులో చాలా వరకూ భారత్, చైనాల్లోనే డంప్ చేస్తున్నారు. ఒకరకంగా మన దేశం.. వారికి డంపింగ్ కేంద్రంగా మారిపోతోంది. * ఈ వ్యర్థాల రీసైక్లింగ్ భారత్, చైనా, బంగ్లాదేశ్‌లో లాభదాయక పరిశ్రమగా వర్థిల్లుతోంది. దీంతో అనేక చోట్ల నుంచి ఇక్కడకొస్తున్నాయి. * ఒక్క బెంగళూరు నగరంలోనే ఏటా 30వేల కంప్యూటర్లు తుక్కుగా మారిపోతున్నాయి. * 2007తో పోలిస్తే.. 2020 నాటికి పాత కంప్యూటర్ల ద్వారా వచ్చే ఈ-వ్యర్థాలు దక్షిణాఫ్రికా, చైనాల్లో 400 శాతం మేర పెరుగుతాయని ఐరాస పర్యావరణ సంస్థ (యుఎన్‌ఈపీ) అంచనా. భారత్‌లో 500 శాతం పెరుగుతాయని పేర్కొంది. * దాతృత్వ కార్యక్రమాల పేరుతో.. వాడేసిన కంప్యూటర్ల దిగుమతికి అనుమతినివ్వడం కూడా ఈ- వ్యర్థాలు పేరుకుపోవడానికి కారణమవుతోంది. * 'ఈ-వేస్ట్ గైడ్' సర్వే ప్రకారం.. భారత్‌లో మహారాష్ట్ర తరువాత ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ-వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తవుతున్నాయి. హైదరాబాద్‌లో సరైన ఈ-వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలేదు. * భారత్‌లో ఏటా 1700 టన్నుల వ్యర్థాలు సెల్‌ఫోన్ల నుంచే వస్తున్నాయి. |
* ఎలక్ట్రానిక్ పరికరాలను భాగాలుగా విడదీసి.. పనికొచ్చే భాగాలను రోడ్ల వెంబడి అమ్మే వస్తువుల కోసం విక్రయిస్తున్నారు. మిగతా భాగాలను తగలబెట్టడమో.. పాతిపెట్టడమో చేస్తున్నారు. ఈ రెండు విధానాల వల్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని జరుగుతుంది. భూమిలో పాతిపెట్టినప్పుడు విషతుల్యమైన రసాయనాలు భూగర్భజలాల్లో కలుస్తాయి. * ఎలాంటి రక్షణ లేకుండానే మహిళలు, పిల్లలు ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. *దాదాపు 85 నుంచి 90 శాతం మేర రీసైక్లింగ్ ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్, ముంబయిలోని ధారవి మురికివాడలు, ఢిల్లీలోని సీలాంపురి వంటి చోట్ల అసంఘటితంగా సాగుతోంది. * ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో హానికరమైన పాదరసం, సీసం, పీవీసీ పూత పూసిన రాగి తీగలు ఉంటున్నాయి. వీటివల్ల మొదట ఈ రీసైక్లింగ్ పరిశ్రమల్లో పనిచేసేవారికే హానికరం. * ఐరోపాలోనైతే హానికారక పదార్థాలను నాశనం చేసే ప్రక్రియ యంత్రాల ద్వారానే సాగాలి. వర్ధమాన దేశాల్లో ఇలాంటి నియంత్రణలు ఉండవు. |
|
|
సీసం: టీవీలు, కంప్యూటర్ మోనిటర్లలో ఇది ఉంటుంది. అధిక మోతాదులో సీసం ప్రభావానికి గురైతే.. వాంతులు, విరేచనాలు, మూర్ఛ రావడం, కోమా చివరకు మరణం సంభవిస్తాయి. క్యాడ్మియం: సెమీ కండక్టర్ చిప్‌లు, క్యాథోడ్ రే ట్యూబ్ (సీఆర్‌టీ)ల్లో దీన్ని వినియోగిస్తారు. క్యాడ్మియంను పీలిస్తే ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతింటాయి. కొన్ని కేసుల్లో మరణాలూ సంభవిస్తాయి. పాదరసం: ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే పాదరసంలో 22 శాతాన్ని ఎలక్ట్రానిక్ పరిశ్రమే వినియోగిస్తోంది. ఇది మెదడు, మూత్రపిండాలు వంటి అవయవాలను తీవ్రస్థాయిలో దెబ్బతీస్తుంది. బేరియం: సీఆర్‌టీ స్క్రీన్ ప్యానెళ్లలో రేడియోధార్మికత నుంచి ప్రజలను రక్షించేందుకు బేరియంను వాడతారు. గుండె, కాలేయం వంటి అవయవాలకు హానికలిగిస్తుంది. బెరీలియం: ఈ లోహం తేలిగ్గా, దృఢంగా ఉంటుంది. విద్యుత్‌ను బాగా గ్రహించేదీన్ని పరిశ్రమలో విరివిగా వాడతారు. ఇది ఊపిరితిత్తుల కేన్సర్‌కు కారణమవుతుంది. పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ): ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే ప్లాస్టిక్‌లో పీవీసీనే ఎక్కువగా ఉంటుంది. వీటిని మండించడం వల్ల వెలువడే డైఆక్సిన్లు రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి. |
* తక్కువ విషతుల్య పదార్థాలు ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి. సులువుగా అప్‌గ్రేడ్ చేసుకోదగిన వస్తువును ఎంచుకోవాలి. కొత్త కంప్యూటర్‌ను కొనడానికి బదులు.. ఉన్నదాన్ని ఆధునికీకరించే అవకాశాన్ని పరిశీలించాలి. విడదీయడం కూడా సులువుగా ఉండాలి. సదరు ఎలక్ట్రానిక్ పరికరం ఆయువు తీరాక దాన్ని వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చిన కంపెనీల వస్తువులను కొనుగోలు చేయాలి. |