Thursday, April 22, 2010

నష్టాల ఊబీలో బీఎస్‌ఎన్‌ఎల్‌

న్యూఢిల్లీ: ఒకవైపు ప్రైవేట్‌ రంగం నుండి తీవ్రమైన పోటీ, నిర్వహణలో వైఫల్యం, యాజమాన్యం, ఉద్యోగుల మధ్య విబేధాలు వెరసి ప్రభుత్వ రంగం లోని భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌) నష్టాల ఊబిలో కూరుకు పోతోంది. 2009-10 ఆర్ధిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.3,641 కోట్ల నష్టాన్ని మూట కట్టుకోవచ్చునని పార్లమెంటరీ ప్యానల్‌ పేర్కొంది. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆర్ధిక పరిస్థితిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ బుధవారం పార్లమెంట్‌కు తన నివేదికను అందచేసింది.

2007 జూలై నుండి సంస్థకు చెందిన నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లించరావడమే ప్రధానంగా రూ.3,600 నష్టానికి కారణమని నివేదిక పేర్కొంది. పోటీ కార ణంగా ట్యారిఫ్‌లు తగ్గించడం, లైసెన్స్‌ రూపేణా వచ్చే ఆదాయం క్షీణించడం, బేసిక్‌ ఫోన్ల ఆదాయం కోల్పోవడం వంటి కారణాలు బిఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాల పాలు కావడానికి కారణమైంది. సంస్థ నష్టాల పాలు కావడంపై సిఎండి కులదీప్‌ గోయ ల్‌ ఎటువంటి వ్యాఖ్యానం చేయలేదు. ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి సంస్థ అధికారికంగా ఆర్ధిక ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. నష్టాల పాలు అవడానికి సంస్థ చెబుతున్న కారణాలను పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఒప్పుకోవడం లేదు. ప్రైవేట్‌ సంస్థలకు కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నప్పటికి అవి లాభాలు ఎలా ఆర్జించగలుగుతున్నాయని కమిటీ ప్రశ్నిస్తోంది. 2007- 0 8 సంవత్సరానికి సంస్థ రూ. 3,009 కోట్ల నికర లాభం ఆర్జించగా 2008-09 నాటికి 575 కోట్లకు పడిపోయింది.

ఇంతటి నిరాశజన కమైన ఫలితాలు రావడానికి సంస్థ పనితీరే కారణమని స్టాండింగ్‌ కమిటీ మండి పడుతోంది. మొబైల్‌, వైర్‌లైన్‌, ఫోన్లు సరెండర్‌ చేసిన ఖాతాదారుల నుండి సంస్థకు రావాల్సిన బకాయిలు అలాగే పేరుకొని పోయాయి. ఆ మొత్తం రూ. 4,087 కోట్లు ఉంటుందని కమిటీ పేర్కొంది. అలాగే గత ఆర్ధిక సంవత్సరంలో 29 లక్షల ఫిక్స్‌డ్‌ ఫోన్లు, 35 లక్షల విల్‌, జిఎస్‌ఎం ఫోన్లను వినియోగదారులు సరెండర్‌ చేశారు. సంస్థ ఇటీవల 3జీ సేవలు ప్రారంభించినప్పటికి, ఖాతాదారు లను పెద్ద ఎత్తున ఆకర్షించడంలో సంస్థ విఫలమైందని కమిటీ పేర్కొంది. ప్రైవేట్‌ ఆపరేటర్ల కంటే ముందుగానే సంస్థ 3జీ సేవలు ప్రారంభించినప్పటికి ఖాతాదారులను ఆకట్టుకుని వ్యాపారాన్ని పెంచుకోవడంలో మాత్రం వెనుకపడి పోయిందని నివేదిక విమర్శించింది.