చిన్న పట్టణాల్లోనూ మొబైల్ నెట్‌పై ఆసక్తి టెలికాం రంగంలో 3జీ సేవలు అందుబాటులోకి వస్తే 'మొబైల్ ప్రపంచం' ఆవిష్కృతం అవుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో.. వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్, ఆధునిక హ్యండ్‌సెట్లు మొబైల్‌పై ఇంటర్నెట్ వాడకాన్ని పెంచవచ్చని యాహూ అంచనా వేస్తోంది. భవిష్యత్తులో మొబైల్ ఇంటర్నెట్ వృద్ధికి ఉన్న అవకాశాలు, అందుకు దోహదం చేసే అంశాలపై యాహూ! ఇండియా సీనియర్ డైరెక్టర్ (మార్కెటింగ్) నితిన్ మాథుర్ 'న్యూస్‌టుడే'కిచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..
న్యూస్‌టుడే ఇంటర్వ్యూలో యాహూ! ఇండియా సీనియర్ డైరెక్టర్ నితిన్ మాథుర్

మొబైల్ ఇంటర్నెట్ వాడకందార్లు మరింతగా పెరగడానికి ఇంకొంత సమయం పడుతుంది. అంటే దీనర్థం ప్రస్తుతం వృద్ధిరేటు తక్కువగా ఉందని కాదు. కొన్ని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో చందాదారుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇంటర్నెట్ విస్తృతికి భవిష్యత్తులో మొబైల్ కీలకం కానుంది. తగ్గే బ్రాడ్‌బ్యాండ్ వ్యయం, కొత్త ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ఐఎస్‌పీ) ప్రవేశం, ఇ-మెయిల్ వంటివి స్థానిక భాషల్లో ఇచ్చిపుచ్చుకోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి రావడం నెట్ వాడకాన్ని పెంచనున్నాయి.
? మొబైల్ నెట్ రుసుము ఎక్కువగా ఉండడంతోపాటు తక్కువ బ్రాడ్‌బ్యాండ్ వేగం మొదలైనవి చందాదారులను ఈ సేవలకు దూరంగా ఉంచుతున్నాయి. దీన్ని మీరు అంగీకరిస్తారా
నిజమే. అయితే.. ఈ పరిస్థితులు భవిష్యత్తులో మారతాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడుల మీద ఇది ఆధారపడి ఉంటుంది. 3జీ సేవలు అందుబాటులోకి వస్తే కనెక్టివిటీ బాగా మెరుగుపడుతుంది.
? 3జీ సాంకేతిక పరిజ్ఞానం మొబైల్ ఇంటర్నెట్ సేవల్లో ఎటువంటి మార్పులు తీసుకురానుంది
దేశంలో మొబైల్ ఇంటర్నెట్ వినియోగానికి 3జీ సేవలు గట్టి ఊతం ఇవ్వనున్నాయి. డేటా డౌన్‌లోడ్, నెట్ విహార (సర్ఫింగ్) వేగం ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే ఈ రెండు సమస్యలను అధిగమించవచ్చు. వేగం పెరిగితే.. నెట్‌విహారం, సామాజిక నెట్‌వర్కింగ్, కొత్త విషయాల అన్వేషణ (సెర్చ్)కు ల్యాప్‌టాప్/కంప్యూటర్ బదులు మొబైల్ ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తారు.
? మొబైల్ నెట్ వాడకాన్ని పెంచడంలో హ్యాండ్‌సెట్ల పాత్ర ఎంత వరకు ఉంది
ప్రస్తుతం చాలా తక్కువ ధరకే జీపీఆర్‌ఎస్ ఆధారిత హ్యాండ్‌సెట్లు అందుబాటులో ఉన్నాయి. సమీప భవిష్యత్తులో సార్ట్, టచ్‌స్క్రీన్ ఫోన్లు, పీడీఏల ధరలు ఇంకా తగ్గనున్నాయి. అనేక సదుపాయాలున్న ప్రారంభ స్థాయి మొబైల్ ధర రూ.1200కు దిగివచ్చింది. తగ్గే హ్యాండ్‌సెట్లు, డేటా వ్యయాలు మొబైల్ నెట్‌ను మారుమూల ప్రాంతాలకు సైతం అందుబాటులోకి తీసుకువస్తాయి.
? ఐడియాతో కలిసి మొబైల్ ఇంటర్నెట్‌పై ప్రయోగాత్మక అధ్యయనం ఉద్దేశం ఏమిటి
మొబైల్ నెట్ విభాగంలో యాహూ! ప్రధానమైన బ్రాండ్. హ్యాండ్‌సెట్ ద్వారా వినియోగదారుడు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వీలైనంతగా తెలుసుకోవాలన్నది మా ఉద్దేశం. మెయిల్, మెసేంజర్ వంటి వాటిని మొబైల్‌లో పొందడానికి వీలు కల్పిస్తున్నాం. ద్వితీయ శ్రేణి నగరాల్లో మొబైల్ నెట్ వాడకందార్ల ఇబ్బందులను తెలుసుకోవడానికి ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును (అధ్యయనాన్ని) చేపట్టాం. మొబైల్ నెట్ వినియోగ తీరును విశ్లేషించడానికి కూడా ఇది దోహదం చేస్తుంది. దీని ద్వారా మాకు మూడు విషయాలు తెలిశాయి. 1. చిన్న పట్టణాల్లో కూడా మొబైల్ నెట్ వినియోగానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.2. రుసుము, వాడకంపై అవగాహన లేకే ఈ సదుపాయానికి దూరంగా ఉంటున్నారు.3. యాహూ! మెసేంజర్, మెయిల్, క్రికెట్‌పై ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.