Wednesday, April 21, 2010

సిమెంటుపై విదేశీ పెత్తనం!

దేశీయ పరిశ్రమలోకి వరుస కట్టిన బహుళజాతి కంపెనీలు
ఇప్పటికే మూడోవంతు వాటి చేతుల్లో గుత్తాధిపత్యం వైపుగా పరిస్థితులు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: దేశీయ సిమెంటు రంగంపై బహుళజాతి కంపెనీలు పెత్తనం చెలాయించే రోజులు రానున్నాయా? ఎంతటి ధరకైనా సిద్ధపడుతూ ఎడాపెడా దేశీయ సిమెంటు కంపెనీలను కొనేస్తున్న బహుళజాతి సంస్థలను చూస్తుంటే ఆ రోజులు రావటానికి ఎంతో కాలం పట్టకపోవచ్చనిపిస్తోంది. ఈ పరిణామం వెనుక పలు కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

మన దగ్గర ఆకర్షణీయ మార్కెట్‌
మౌలిక సదుపాయాల రంగానికి ఇటీవలి కాలంలో మన ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో సిమెంటు విక్రయాలు ఏటా కనీసం 10 శాతం పెరుగుతున్నాయి. సిమెంటు ఉత్పత్తిదార్లకు భవిష్యత్తులోనూ ఢోకాలేని పరిస్థితి ఉంది. ఇదే సమయంలో యూరప్‌, గల్ఫ్‌ తదితర ప్రాంతాల్లో సిమెంటు వినియోగం పడిపోతోంది. గల్ఫ్‌ దేశాల్లోనైతే సగానికి సగం తగ్గిపోయింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి సిమెంటు కంపెనీల దగ్గర చేతి నిండా సొమ్ముంది.. పెట్టుబడి పెట్టటానికి మంచి మార్కెట్‌ వాటికి కావాలి. ఆ సంస్థలకు ప్రస్తుత పరిస్థితుల్లో మనదేశం బంగారుబాతులాగా కనిపిస్తోంది. అందువల్లే దేశీయ సిమెంటు కంపెనీలను కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. భారత్‌లో పెట్టుబడి అంటే యూరప్‌లో పుష్కలంగా రుణం అందుబాటులోకి వస్తోంది. లాభాలను ఆర్జించే లక్ష్యంతోపాటు భారత్‌లో పెత్తనం సాధించి అటు సిమెంటు ధరలను, ఇటు సరఫరాలను నియంత్రించే అజెండా ఈ కంపెనీలకు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇన్నాళ్లూ భారతీయ సిమెంట్‌ మార్కెట్‌ ముఖ్యంగా దక్షిణాది మార్కెట్‌లో లాభాలు లేవని వాదిస్తూ వస్తున్న వర్గాలకు ఈ పరిణామం మింగుడుపడనిది.

కంపెనీల రాక మొదలైందిలా: సిమెంటు రంగంలోకి విదేశీ కంపెనీల రాక లఫర్జీతో మొదలైంది. టాటా, రేమండ్స్‌ యూనిట్లను అప్పట్లో లఫర్జీ కొనుగోలు చేయడం పెద్ద సంచలనం. ఆ తర్వాత హోల్సిమ్‌ అనే కంపెనీ దేశీయ దిగ్గజాలైన ఏసీసీ, గుజరాత్‌ అంబుజాలను సొంతం చేసుకుంది. మైసూర్‌ సిమెంట్‌ కంపెనీని హైడల్‌బర్డ్‌, మన రాష్ట్రానికి చెందిన మైహోమ్‌ సంస్థను ఐరిష్‌ సంస్థ సిఆర్‌హెచ్‌ దక్కించుకున్నాయి. ఫ్రాన్స్‌ కంపెనీ వైక్యాట్‌ కొద్దికాలం క్రితం రాష్ట్రానికి చెందిన సాగర్‌ సిమెంట్స్‌లో స్వల్పవాటా కొనుగోలు చేసింది. ఆ సంస్థతో కలిసి కర్ణాటకలో 5.5 మిలియన్‌ టన్నుల సామర్థ్యమున్న యూనిట్‌ను నెలకొల్పుతోంది. ఇదే కంపెనీ ఇప్పుడు భారతి సిమెంట్‌ కంపెనీలో మెజార్టీ వాటాను సొంతం చేసుకుంది. మనదేశంలో ప్రస్తుతమున్న మొత్తం సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 240 మిలియన్‌ టన్నులు. దీంట్లో మూడోవంతు (దాదాపు 75 మిలియన్‌ టన్నులు) విదేశీ కంపెనీల చేతిలో ఉంది. ఒక్క హోల్సిమ్‌కే 50 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఉండటం గమనార్హం. వివిధ దేశాల్లో ఆ కంపెనీకున్న మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 210 మిలియన్‌ టన్నులు (అంటే మన దేశంలోని యావత్‌ సిమెంటు పరిశ్రమకు దాదాపుగా సమానం ఈ సంస్థ). ఇలాంటి భారీ విదేశీ సంస్థలతో ఒక మోస్తరుగానైనా సరితూగగల సత్తా ప్రస్తుతం ఆదిత్యబిర్లా గ్రూపునకు మాత్రమే ఉంది. ఈ గ్రూపు (గ్రాసిం, అల్ట్రాటెక్‌) సామర్థ్యం దాదాపు 50 మిలియన్‌ టన్నులు. బహుళజాతి కంపెనీల ప్రవేశం వల్ల వినియోగదారులు ఇబ్బంది పడే పరిస్థితులు రావచ్చని సంబంధిత వర్గాలంటున్నాయి. గుత్తాధిపత్యంతో సిమెంటు ధరలను ఈ కంపెనీలు నిర్దేశించే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే సిమెంటు ధర సామాన్యుడికి అందుబాటులో లేనంతగా పెరిగిపోయింది. డిమాండ్‌-సరఫరాలను బట్టి ధర హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పుడే ఇలా ఉంటే కంపెనీల గుత్తాధిపత్యం తర్వాత పరిస్థితి మరింత తీవ్రమవుతుందని పేర్కొంటున్నారు. దేశీయ సిమెంటు కంపెనీలు ఎదగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు అనుసరిస్తున్న విధానాల వల్లే ఇటువంటి ఆందోళనకరమైన పరిస్థితి తలెత్తిందని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. 'రుణం కోసం బ్యాంకుల దగ్గరికెళ్తే అస్సలు పట్టించుకోవడంలేదు. అనేక బాధలు పడుతూ కంపెనీలను నడపలేక వాటిని అమ్ముకోవటానికి సిద్ధపడుతున్నాం' అంటూ ఒక సంస్థ ప్రతినిధి చెప్పిన మాటలు రాష్ట్రంలోని సిమెంటు రంగం పరిస్థితులను తెలియజేస్తున్నాయి.

బహుళజాతి వాటా
దేశీయ సిమెంట్‌ పరిశ్రమ మొత్తం వార్షిక సామర్థ్యం 240 మిలియన్‌ టన్నులైతే దీంట్లో సుమారు మూడోవంతు బహుళజాతి కంపెనీల చేతుల్లో ఉంది. ఆ వివరాలు:

హోల్సిమ్‌ - 50 మిలియన్‌ టన్నులు
(వచ్చే అయిదేళ్లలో ఇది 60 మిలియన్‌ టన్నులకు పెరుగుతుంది)
వైక్యాట్‌ - 10.5 మిలియన్‌ టన్నులు
లఫర్జీ - 6.55 మిలియన్‌ టన్నులు
సిఆర్‌హెచ్‌ - 4.2 మిలియన్‌ టన్నులు
హైడల్‌ బర్గ్‌ - 3.1 మిలియన్‌ టన్నులు