
తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన ప్రహ్లాద్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ను చెన్నై లయోలా కళాశాలలో పూర్తిచేశారు. అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చదివారు. అనంతరం హార్వార్డ్ బిజినెస్ స్కూల్‌లో డాక్టరేట్ చేశాక మిషిగాన్ యూనివర్సిటీలోని రాస్ బిజినెస్ స్కూల్‌లో కార్పొరేట్ వ్యూహాల ప్రొఫెసర్‌గా చేరారు. 'సీకే'గా ప్రసిద్ధులైన ప్రహ్లాద్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ఎన్నో పుస్తకాలు రచించారు. ఆయన రచనలు 'ది ఫార్చ్యూన్ అట్ ది బాటమ్ ఆఫ్ ది పిరమిడ్, ఎరాడికేటింగ్ పావర్టీ థ్రూ ప్రాఫిట్' ఎంతో ప్రసిద్ధి పొందాయి. 'ది ఫార్చ్యూన్ ఆఫ్ కాంపిటీషన్, కో క్రియేటింగ్ వ్యాల్యూ విత్ కస్టమర్స్, ది మల్టీ నేషనల్ మిషన్, బ్యాలన్సింగ్ గ్లోబల్ ఇంటెగ్రేషన్ విత్ లోకల్ రెస్పాన్సివ్‌నెస్' వంటివి ఆయన ఇతర రచనలు. విద్య, సాహిత్య సంబంధ అంశాల్లో సేవలకు గాను 2009లో భారత ప్రభుత్వం సీకేను 'పద్మ భూషణ్'తో సత్కరించింది.
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలున్న భారత్ వంటి దేశాల్లో సామాజికంగా అట్టడుగు వర్గాలను చేరేందుకు ఏ వ్యాపారానికైనా ఎక్కువ సమయం పడుతుంది. సీకే రచన 'ది ఫార్చ్యూన్ అట్ ది బాటమ్ ఆఫ్ ది పిరమిడ్' ఈ అంశాలన్నిటినీ సమగ్రంగా కళ్లకు కట్టింది. హిందుస్థాన్ యూనిలీవర్, టీవీఎస్ క్యాపిటల్, ఇండస్ ఎంటర్‌ప్రైజెస్, వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ వంటి జాతీయ, అంతర్జాతీయ కంపెనీ డైరెక్టర్ల బోర్డులో సీకే సభ్యులు.
కార్పొరేట్ ప్రపంచం సంతాపం
ప్రహ్లాద్ మృతిపై భారతీయ కార్పొరేట్ రంగం ఘన నివాళులు అర్పించింది. ఎంతో దార్శనికత, నిబద్ధత కలిగిన మేనేజ్‌మెంట్ గురును కోల్పోయామని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ నివాళులు అర్పించారు. దేశాభివృద్ధిలో ఆయన తనవంతు పాత్ర పోషించారని పేర్కొన్నారు. తమ కంపెనీ బోర్డులో పదేళ్ల పాలు సీకే విలువైన సేవలు అందించారని, ఆయన మరణం వ్యక్తిగతంగా మంచి స్నేహితుణ్ని దూరం చేసిందని హెచ్‌యూఎల్ ఛైర్మన్ హరీష్ మన్‌వానీ తెలిపారు. యదార్థ దృక్పథంతో వ్యవహరించే ప్రహ్లాద్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి కట్టుబడి పనిచేశారని కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వైస్‌ఛైర్మన్ టి.లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. అత్యంత సహాయకారిని కోల్పోయామని టీవీఎస్ క్యాపిటల్ పేర్కొంది.