Friday, April 23, 2010

పెట్టుబడులకు కరెంట్ షాక్!

పరిశ్రమలు వెనక్కి పోయే ప్రమాదం

హైదరాబాద్ (ఆన్‌లైన్): రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయంటే ప్రధాన కారణం ఇక్కడ సులభంగా భూమి లభించడం, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే విద్యుత్ రేట్లు తక్కువగా ఉండటమే. ఇటీవల వరకూ దేశ, విదేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనువైన కేంద్రంగా మార్కెట్ చేసే సమయంలో ప్రభుత్వ పెద్దల మొదలు... ఉన్నతాధికారుల వరకూ ఇవే విషయాలను ప్రధానంగా ప్రస్తావించేవారు. కానీ సర్కారు తాజాగా పరిశ్రమలే లక్ష్యంగా విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఎపిఇఆర్‌సికి సమర్పించడంతో పారిశ్రామిక పెట్టుబడులపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

చిన్నతరహా పరిశ్రమల నుంచి భారీ పరిశ్రమల వరకూ అందరికీ విద్యుత్ 'షాక్' ఇవ్వడంతో రాబోయే రోజుల్లో ఈ ప్రభావం పెట్టుబడులపై ఉంటుందని చెబుతున్నారు. హెచ్‌టి లైన్ల ద్వారా భారీ పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్ ఛార్జీలను 132 కేవీ, ఆపై లైన్లలో ప్రస్తుత చార్జి యూనిట్‌కు రూ. 2.70 ఉండగా... 50 పైసలు పెంచి రూ. 3.20 చేశారు. పీక్ అవర్స్‌లో దీనికి మరో రూపాయి జత చేసి రూ. 4.20వసూలు చేస్తారు. 33 కేవీ, ఆపై లైన్ల ద్వారా సరఫరా చేసే విద్యుత్ చార్జీలను రూ. 2.95 నుంచి రూ. 3.45కు పెంచారు.

పీక్ అవర్స్‌లో ఇది రూ. 4.45 అవుతుంది. సాయంత్రం 6-10 సమయాన్ని పీక్ అవర్స్‌గా పరిగణిస్తారు. విద్యుత్ చార్జీలు పెంచడం ఒకెత్తు అయితే రాష్ట్రంలో తొలిసారి 'పీక్ అవర్స్' విధానాన్ని ప్రవేశపెట్టి ఇబ్బడిముబ్బడిగా బాదడంపై పరిశ్రమ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రానికొచ్చే పెట్టుబడులు తగ్గుతున్నాయి. కొత్తవి రాకపోగా సర్కారుతో ఎంవోయూలు కుదుర్చుకున్న పలు భారీ పరిశ్రమలు జెండా ఎత్తేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్ చార్జీల పెంపు పెట్టుబడి ప్రతిపాదనలపై ప్రతికూల ప్రభావం చూపక తప్పదంటున్నారు.పరిశ్రమలకు విద్యుత్ చార్జీలను ఇంత భారీగా పెంచడానికి ఇది అనువైన సమయం కాదని ఆంధ్రప్రదేశ్ చిన్నతరహా పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు ఎ. విజయ్‌కుమార్ 'ఆన్‌లైన్'తో వ్యాఖ్యానించారు.

ఇటీవలే తెలంగాణ ఉద్యమంతో ఒక నెల, విద్యుత్ కోతలతో మరో నెల, మాంద్యం కారణంగా ఏడాది పాటు పరిశ్రమ ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు ఇలా చార్జీలు పెంచడం సరికాదన్నారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే చిన్నతరహా పరిశ్రమలకూ మినహాయింపు ఇవ్వకపోవడం సరికాదంటున్నాయి.

అయితే, ఇప్పుడు పెంచిన చార్జీలు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువేనని విద్యుత్ శాఖ చెబుతోంది. చార్జీల పెంపును పొరుగు రాష్ట్రాలతో పోల్చిచూపడం సరికాదని, తమిళనాడు ప్రభుత్వం విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచే కొనుగోలు చేసి అక్కడి పరిశ్రమలకు కోత లేకుండా చేసిందని.. ఇక్కడ అలాంటి పరిస్థితి ఎక్కడ ఉందని పరిశ్రమ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

పరిశ్రమల శాఖ కొత్తగా ప్రకటించే పారిశ్రామిక విధానంలో కూడా భారీ పరిశ్రమలకు కల్పించే విద్యుత్ సబ్సిడీకి కోత పెట్టే ఆలోచనలో ఉంది. తమిళనాడు తరహాలోనే చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మాత్రం విద్యుత్ చార్జీల్లో 20శాతం రిబేట్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. వాస్తవానికి పారిశ్రామిక విధానంపై మంగళవారం సీఎం అధ్యక్షతన పరిశ్రమల శాఖ సమీక్షా సమావేశం జరగాల్సి ఉన్నా... ఇది వాయిదా పడింది.