300 శాతం డివిడెండ్
నికర లాభంలో 21% వృద్ధి
బెంగళూరు: అగ్రశ్రేణి ఐటీ సంస్థల్లో ఒకటైన విప్రోకు లాభాలు పెరిగినా, స్టాక్ మార్కెట్లో నష్టాలు చవిచూడక తప్పలేదు. సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో దేశంలో మూడోస్థానంలో ఉన్న ఈ సంస్థ, 2009-10 ఆర్థిక సంవత్సరంలో నికరలాభం 18.49% వృద్ధి చెంది రూ.4593 కోట్లకు చేరింది. వాటాదార్ల వద్ద ఉన్న ప్రతి 3 షేర్లకు 2 బోనస్ షేర్లను ఇవ్వదలచినట్లు సంస్థ ప్రకటించింది. అంతేకాదు రూ.2 ముఖ విలువ కలిగిన షేరుపై రూ.6 (300%) డివిడెండ్‌నూ అందిస్తోంది. అయినా మిగతా టెక్నాలజీ షేర్లతో పాటు విప్రో స్క్రిప్ ధరా తగ్గింది. నాలుగో త్రైమాసికానికి: గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే, మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికానికి 21% వృద్ధితో రూ.1,209 కోట్ల నికర లాభాన్ని విప్రో ఆర్జించింది. ఇదే సమయంలో విక్రయాలపై నికర ఆదాయం రూ. 6451.4 కోట్ల నుంచి 8% వృద్ధితో రూ.6,982 కోట్లకు చేరింది. స్టాండలోన్ ప్రాతిపదికన నికరలాభం రూ.1236 కోట్లుగా సంస్థ ప్రకటించింది. ఇంతకుముందు ఇది 841.67 కోట్లు మాత్రమే.
పూర్తి ఏడాదికి..: 2009-10 ఏడాది మొత్తానికి సంస్థ ఆర్జించిన (కన్సాలిడేటెడ్) నికరలాభం రూ.4593 కోట్లు. 2008-09లో సంపాదించిన రూ.3876.27 కోట్ల కంటే ఇది 18.49% అధికం. అలాగే ఆదాయాలు 7.8% వృద్ధితో రూ. 27124 కోట్లకు చేరుకున్నాయి.
వచ్చే త్రైమాసిక అంచనాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 30తో ముగిసే తొలి త్రైమాసికంలో ఐటీ సేవలపై 1190 -1215 మిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జిస్తామని సంస్థ ఛైర్మన్ ప్రేమ్‌జీ ఆశాభావం వ్యక్తం చేశారు.
పెరిగిన ఖాతాదారులు: చివరి త్రైమాసికంలో 27 మంది, ఏడాది మొత్తంమీద 121 మంది కొత్త ఖాతాదార్లను సంపాదించినట్లు కంపెనీ వెల్లడించింది.
కొత్తగా 5325 ఉద్యోగాలు: విప్రో, అనుబంధ సంస్థలన్నిటిలో కలిపి గత మార్చి 31 నాటికి 1,08,071 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. చివరి త్రైమాసికంలోనే 5,325 మందిని కొత్తగా తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. అవసరాల కనుగుణంగా ఇంజినీర్లు, ఇతర సిబ్బందిని చేర్చుకుంటామని, అయితే అతిత్వరలోనే వేతనాలు పెంచే యోచనేదీ లేదని సంస్థ స్పష్టంచేసింది.
తగ్గిన షేరు ధర: ఆకర్షణీయ ఫలితాలు సాధించినా, మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో విప్రో స్క్రిప్ స్టాక్ మార్కెట్లో డీలా పడింది. బొంబాయి, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఈ షేరు ధర శుక్రవారం రూ.10కి పైగా నష్టపోయింది. బీఎస్‌ఈలో రూ.692.95 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో రూ.12.35 తగ్గి రూ.691.90 వద్ద ఈ షేరు స్థిరపడింది.
| 'ఈ త్రైమాసికం మాకు సంతృప్తినిచ్చింది. మాకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఫలితాలు సాధించాం. 1180 మిలియన్ డాలర్ల అంచనాలను సమీపించాం. వేతనాల్లో పెరుగుదల, రూపాయి మారకం విలువ అధికమైనా లాభాల్లో 60 బేసిస్ పాయింట్లు సాధించగలిగాం'.. విప్రో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ &సీఎఫ్‌ఓ సురేష్ సేనాపథి |
| 'విశాల దృక్పథంతో పరిశీలిస్తే, వృద్ధి పరంగా ఈ త్రైమాసికం మాకు గట్టి అండగా నిలిచింది. సవాళ్లుగా నిలిచిన టెక్నాలజీ, టెలికాం రంగాల్లో మంచి రికవరీనే సాధించాం. గత ఏడాది ఐటీకి కేటాయించిన మొత్తాలు కూడా ఖర్చు చేయలేదు. ఈసారి అందుకు భిన్నంగా ఉంటుంది. వ్యాపార వాతావరణం సాధారణ పరిస్థితులకు వచ్చిందనే భావిస్తున్నా'.. - ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ |