Tuesday, April 20, 2010

28 కోట్ల పెట్టుబడి.. 2,300 కోట్ల రాబడి!... జగన్‌కు జాక్‌పాట్

భారతి సిమెంట్స్‌లో ఫ్రాన్స్ సంస్థకు మెజార్టీ వాటా
రూ. 2,346 కోట్లకు 51% విక్రయం?

(ఆన్‌లైన్ బిజినెస్ బ్యూరో)రాష్ట్రానికి చెందిన భారతి సిమెంట్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన బహుళ జాతి సంస్థ వికాట్ మెజార్టీ వాటాలను కొనుగోలు చేసింది. భారతి సిమెంట్స్‌లో 51 శాతం వాటా కొనుగోలుకు సంబంధించి కంపెనీ ప్రమోటర్లు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర వాటాదారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు పారిస్‌లో విడుదల చేసిన ప్రకటనలో వికాట్ వెల్లడించింది. కడప జిల్లాలోని భారతి సిమెంట్స్ ప్లాంట్ సామర్థ్యం ప్రస్తుతం 25 లక్షల టన్నులుండగా.. ఈ ఏడాది ఆఖరు నాటికి మరో 25 లక్షల టన్నుల సామర్థ్యాన్ని జోడిస్తున్నారు.

ఈ మొత్తం 50 లక్షల టన్నుల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని.. టన్నుకు 200 డాలర్ల రేటుతో భారతి సిమెంట్ వ్యాపార విలువను మదింపు చేసినట్టుగా తెలిసింది. ఈ లెక్కతో భారతి సిమెంట్ మొత్తం విలువ 100 కోట్ల డాలర్లకు (రూ.4,600 కోట్లు) చేరుతుంది. 51% వాటాకు 2,346 కోట్ల రూపాయలను వికాట్ చెల్లిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు అమ్మిన వాటా మొత్తం జగన్ గ్రూప్‌నకు ఉన్న షేర్ నుంచేనని తెలుస్తోంది.

జాక్‌పాట్ డీల్
అతి తక్కువ సొంత ఇన్వెస్ట్‌మెంట్‌తో భారతి సిమెంట్స్‌ను ప్రమోట్ చేసిన జగన్‌కు.. ఈ డీల్ జాక్‌పాట్ అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. భారతిలో 82 శాతం వాటా కోసం జగన్‌మోహన్‌రెడ్డి గ్రూప్ నికరంగా ఇన్వెస్ట్ చేసిన మొత్తం 45 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ వాటా విలువ ఇప్పుడు 3,700 కోట్ల రూపాయలు. 51 శాతం వాటా కోసం ఆయన ఇన్వెస్ట్ చేసిన మొత్తం సుమారు 28 కోట్ల రూపాయలు అవుతుందనుకున్నా.. ఇప్పుడు లభిస్తున్న 2,300 కోట్ల రూపాయలు దానికి అనేక రెట్లు ఎక్కువ.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార పలుకుబడిని ఉపయోగించి ఈ కంపెనీకి భారీ ఎత్తున ఈక్విటీని, రుణాలను జగన్‌మోహన్‌రెడ్డి సమీకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. భారతి సిమెంట్స్ ఈక్విటీ 5.5 కోట్ల షేర్లుగా ఉంది. జగన్, ఆయన కంపెనీలు 10 రూపాయల ముఖ విలువకే 4.5 కోట్ల భారతి సిమెంట్స్ వాటాలను (82% వాటా) తీసుకున్నారు. మిగతా కోటి షేర్లను దాల్మియా సిమెంట్, ఇండియా సిమెంట్స్ వంటి సంస్థలు, మాట్రిక్స్ ప్రసాద్ వంటి మరికొందరు వ్యాపార ప్రముఖులు.. ఒక్కో షేరుకు 94-175 రూపాయల రేటుతో కొనుగోలు చేయడం గమనార్హం.

దాల్మియా సిమెంట్స్ మాత్రం తర్వాత ఓ 2 లక్షల షేర్లను 1,440 రూపాయల రేటుతో కొనుగోలు చేసింది. భారతి ఈక్విటీలో 4.5 కోట్ల షేర్లకు జగన్ గ్రూప్ ఇన్వెస్ట్ చేసిన మొత్తం 45 కోట్ల రూపాయలు కాగా.. కోటి లోపుగా ఉన్న షేర్లకు పైన పేర్కొన్న కార్పొరేట్ సంస్థలు 140 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేశాయి!

ప్రాజెక్టు వ్యయం 1,400 కోట్లు
భారతి సిమెంట్ తొలిదశపై ఇప్పటి వరకు 700 కోట్ల రూపాయలను వెచ్చించారు. కొత్తగా మరో 700 కోట్ల రూపాయలను రెండో దశ విస్తరణపై వెచ్చిస్తున్నట్టు ఆ సంస్థ గతంలో ప్రకటించింది. భారతి సిమెంట్స్ కోసం ప్రభుత్వం లక్ష రూపాయలకు ఎకరం చొప్పున మొత్తం 487 ఎకరాలను కేటాయించింది. 1,400 ఎకరాల్లో విస్తరించి ఉన్న నాణ్యమైన సున్నపురాయి గనుల లీజునూ ప్రభుత్వం నుంచి భారతి సిమెంట్స్ పొందింది. ఉత్పత్తి ప్రారంభించి ఏడాది కూడా తిరక్కముందే భారతి భారీ వాల్యుయేషన్ సంపాదించడం గమనార్హం.

వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న నాణ్యమైన సున్నపురాయి గనుల లీజు, ఉత్పత్తి కేంద్రం నుంచి బయట మార్కెట్లకు రైల్వే కనెక్టివిటీ ఉండటం, భారతి సిమెంట్స్ ఉపయోగిస్తున్న టెక్నాలజీ.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే వికాట్ భారీ విలువ ఇచ్చి ఉంటుందని ఒక పరిశీలకుడు వ్యాఖ్యానించారు. గతంలో రాష్ట్రానికి చెందిన 'మై హోమ్ సిమెంట్స్'లో ఐర్లాండ్ కంపెనీ సీఆర్‌హెచ్ 50 శాతం వాటా తీసుకున్నప్పుడు కూడా టన్ను 213 డాలర్ల రేటుతో విలువ మదింపు వేశారు. ఇప్పుడు కూడా అదే ప్రమాణంగా తీసుకున్నారని ఆయన అన్నారు.

అయితే మై హోమ్ సిమెంట్ వాటాల విక్రయ సమయంలో సిమెంట్ రంగం అసాధారణ బూమ్‌లో ఉంది. ఇప్పుడు డజన్ల సంఖ్యలో కంపెనీలు విస్తరణ చేపట్టిన కారణంగా స్థాపిత సామర్థ్యం అనేక రెట్లు పెరిగింది. వాల్యుయేషన్స్ బాగా తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టులు, పాత సంస్థలు చేపట్టిన విస్తరణల వల్ల రాష్ట్రంలో సిమెంట్‌కు భారీ మిగులు ఏర్పడే పరిస్థితి ఉన్న తరుణంలో అత్యధిక స్థాయి వాల్యుయేషన్ లభించడం ఆశ్చర్యమని వారు అంటున్నారు.

దేశీ సిమెంట్ మార్కెట్‌పై పట్టు బిగిస్తున్న వికాట్
దాదాపు 11 దేశాల్లో కార్యకలాపాలు విస్తరించి ఉన్న వికాట్ కొన్నేళ్లుగా దేశీయ సిమెంట్ మార్కెట్‌లో చురుగ్గా ఉంది. రాష్ట్రానికి చెందిన సాగర్ సిమెంట్స్‌లో 6.7% వాటాను కొనుగోలు చేయడంతో పాటు.. కర్ణాటకలోని గుల్బర్గాలో సాగర్ సిమెంట్స్‌తో కలిసి జాయింట్ వెంచర్‌గా (సాగర్-వికాట్ సిమెంట్స్) 55 లక్షల టన్నుల సామర్థ్యం గల సిమెంట్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఈ సిమెంట్ కంపెనీలో వికాట్‌దే మెజార్టీ వాటా. భారతి సిమెంట్స్‌లో మెజార్టీ వాటా దరిమిలా దక్షిణాది సిమెంట్ మార్కెట్‌పై వికాట్ పట్టు పెరిగినట్లే!