ఐదు కంపెనీలతో చర్చలు
అధికారిక ప్రకటన త్వరలో
ఆదిలాబాద్ - న్యూస్‌టుడే

1998లో సిమెంట్ ఉత్పత్తి నిలిపివేత: ఆదిలాబాద్‌లోని సీసీఐ కర్మాగారం 1982లో ఉత్పత్తి ట్రయల్ రన్ ప్రారంభించింది. 1992-93 వరకు లాభాల బాటలో నడిచి ప్రభుత్వం వర్కింగ్ క్యాపిటల్‌ను ఇవ్వకపోవడంతో నష్టాలు చవిచూసింది. దీనితో 1996 ఆగస్టులో కర్మాగారాన్ని 'ఖాయిలా'గా ప్రకటించి బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్, ఫైనాన్షియల్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ (బీఐఎఫ్‌ఆర్)కు నివేదించారు. కేంద్రం నుంచి సరైన సాయం అందక, పెరిగిపోతున్న బకాయిల నేపథ్యంలో 1998 నుంచి సిమెంటు ఉత్పత్తి నిలిపివేశారు. అప్పటి కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి సంతోష్ మోహన్‌దేవ్ సొంత రాష్ట్రం అస్సాంలోని భోకాజాన్ యూనిట్‌ను పునరుద్ధరించారు. ఆదిలాబాద్ యూనిట్‌ను మాత్రం మూసివేసేయాలని ఉత్తర్వు జారీ అయింది. దీంతో ఇందులో ప్రత్యక్షంగా పనిచేసే 1,800 మంది కార్మికులు స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకుని స్వస్థలాలకు వెళ్లిపోయారు. అత్యవసర విధులు నిర్వర్తించే సుమారు 100 మంది కార్మికులు మాత్రం ఫ్యాక్టరీని ఎప్పటికైనా పునరుద్ధరించకపోతారా అని ఆశ పెట్టుకుని ఉన్నారు. పరోక్షంగా ఆధారపడ్డ 3,000 మంది తలో దిక్కుకు అయ్యారు. ఫ్యాక్టరీ మూసివేత ఉత్తర్వుపై కార్మిక సంఘం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తే స్టే లభించింది. 2005లో హోల్‌టెక్ కన్సల్టెంట్ న్యూఢిల్లీ సంస్థ ఫ్యాక్టరీని సందర్శించింది. బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి, ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 1200 టన్నుల నుంచి 1600 టన్నులకు పెంచితే లాభాల్లో నడపవచ్చని హోల్‌టెక్ తన నివేదికలో పేర్కొంది. ఆ నివేదికను ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుత పరిస్థితులలో నివేదికకు బూజు దులిపారు. మరోసారి అధ్యయనానికి మే నెల 2న ఫ్యాక్టరీని సందర్శించనున్నారు.
విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ స్పందన: ఆదిలాబాద్ సీసీఐ కార్మిక సంఘం (ఏఐటీయూసీ) నాయకులు ఎస్.విలాస్, టి.ఆశన్న, బి.జనార్ధన్ తదితరులు ఎంపీ రాథోడ్ రమేష్ నేతృత్వంలో ఈ నెల 8న ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ను కలిశారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని, వర్కింగ్ క్యాపిటల్‌గా రూ.70 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సావధానంగా విన్న మంత్రి సానుకూలంగా స్పందించారు. తన అత్తగారి జిల్లా అయిన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక ఫ్యాక్టరీని తెరిపించేటట్లు కృషి చేస్తానన్నారట. (ఆదిలాబాద్ మొట్టమొదటి జడ్‌పీ ఛైర్మన్ రంగారావు పల్సీకర్ సొంత కూతురిని విలాస్‌రావు దేశ్‌ముఖ్ పెళ్లి చేసుకున్నారు.) 9నాడు సీసీఐ ఉన్నతాధికార్లతో సమావేశం నిర్వహించారు. యూనిట్ వల్ల మొత్తంమీద సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశం ఉండవచ్చు.
సున్నపురాయికి కొదువ లేదు: ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీకి అపారమైన సున్నపురాయి వనరులున్నాయి. ప్రస్తుతం ఫ్యాక్టరీ 200 ఎకరాల్లో ఉండగా.. మరో 600 ఎకరాల సున్నపురాయి గనులు ఉన్నాయి. ఇదీగాక 2,000 ఎకరాల సున్నపురాయి ప్రాంతాన్ని లీజుకు తీసుకున్నారు. వీటిని ఉపయోగించుకుంటే కనీసం 100 సంవత్సరాల వరకు ఎలాంటి ఢోకా ఉండదు. ఫ్యాక్టరీ నడపడానికి అనుకూలంగా హైటెన్షన్ విద్యుత్తు కనెక్షన్ ఉంది. 6.6 కేవీ హెచ్‌టీ జనరేటర్ ఉంది. 1 కేవీ సామర్థ్యంతో పనిచేసే నాలుగు ఎల్‌టీ జనరేటర్లు ఉన్నాయి. గ్యాస్ ఆధారిత విద్యుత్తును అందుకునే వెసులుబాటు ఉండటం ఈ ఫ్యాక్టరీకి అనుకూలించే మరో అంశం.
బీఐఎఫ్‌ఆర్ చెప్పింది ఇదీ: ఆదిలాబాద్‌తో పాటు తాండూరు (రంగారెడ్డి), ఎర్రగుంట్ల (కడప), నయాగావ్, అకల్‌తారా, మాండార్ (మధ్య ప్రదేశ్), భోకాజాన్ (అస్సాం), రాజ్‌బన్ (హిమాచల్ ప్రదేశ్), ఢిల్లీ గ్రైండింగ్ యూనిట్, చర్కీ దాద్రీ (హర్యానా) ఫ్యాక్టరీల పునరుద్ధరణకూ కేంద్రం ప్రతిపాదనలను కోరింది. బీఐఎఫ్‌ఆర్.. ఎర్రగుంట్ల, చర్కీ దాద్రీ, మాండార్ కర్మాగారాలను మూసివేయాలని, మిగతా కర్మాగారాలను పునరుద్ధరించేందుకు చక్కని అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం తాండూర్ యూనిట్ ప్రభుత్వ అధీనంలో నడుస్తుండగా, ఎర్రగుంట్ల యూనిట్ ప్రైవేట్‌పరం అయింది.