Wednesday, April 21, 2010

41వేల మందికి 'విమాన' వేదన!

విమానాశ్రయాల్లోనే పడిగాపులు
ఐరోపా విమానాల రద్దు ఫలితం
న్యూఢిల్లీ: ఐస్‌లాండ్‌లో అగ్ని పర్వతం పేలి ఏర్పడిన బూడిద మేఘాల కారణంగా ఐరోపా దేశాలు, అమెరికాకు వెళ్లే విమానాలు రద్దుకావడంతో మన దేశంలో 41వేల మంది అష్టకష్టాల పాలవుతున్నారు. ఆయా దేశాలకు వెళ్లే వీలులేక విమానాశ్రయాల్లోనే పడిగాపులు పడుతున్నారు. ముంబయి, ఢిల్లీల్లో మొత్తం 41.435 మంది చిక్కుకుపోయారని, వీరికోసం పౌర విమానయానశాఖ సంయుక్త కార్యదర్శి ప్రశాంత్‌ షుకుల్‌ ఆధ్వర్యంలో కంట్రోలు రూంను ఏర్పాటు చేశామని ఆ శాఖ కార్యదర్శి మాధవన్‌ నంబియార్‌ సోమవారమిక్కడ తెలిపారు. ఎథెన్స్‌, ఈజిప్టు మీదుగా ఎయిర్‌ ఇండియా, జెట్‌ ఎయిర్‌వేస్‌లు అమెరికాకు విమానాలను ప్రారంభించాయని, అయినా పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని టిక్కెట్టు ధరలను పెంచొద్దని విమానయాన సంస్థలను ఆదేశించామని వెల్లడించారు. ప్రయాణికులు ఎథెన్స్‌లో దిగి రైలు మార్గంద్వారానైనా ఐరోపా దేశాలకు వెళ్లేందుకు వీలుగా గ్రీస్‌ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని చెప్పారు. ఎయిర్‌ ఇండియాకు చెందిన ఐదు విమానాలు లండన్‌, షికాగో, ఫ్రాంక్‌ఫర్డ్‌, న్యూయార్క్‌లలో చిక్కుకున్నాయని వివరించారు.
తగ్గుముఖం పట్టిన బూడిద...
రేయవిక్‌: అగ్ని పర్వతం విరజిమ్మిన బూడిద సోమవారంనాటికి తగ్గుముఖం పట్టింది. మొదట 11 కిలోమీటర్ల ఎత్తుదాకా విస్తరించిన బూడిద మేఘాలు ప్రస్తుతం 2 కిలోమీటర్ల ఎత్తుదాకా మాత్రమే ఉన్నాయి. బూడిద పరిమాణం కూడా భారీగా తగ్గిపోయింది. శనివారంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి చాలా మెరుగైందని ఐస్‌లాండ్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు సోమవారమూ ఐరోపాలో విమానాలు పైకి ఎగురలేదు. ఒక్క ఆస్ట్రియా మాత్రమే విమానాశ్రయాలను తెరచింది. మిగతా దేశాలేవీ విమానాలను తిప్పలేదు. ఐరోపా వైమానిక నియంత్రణ సంస్థతో సోమవారం సాయంత్రం ఆయా దేశాల రవాణా మంత్రులు సమావేశమయ్యారు. ఆ తర్వాత 9వేలదాకా విమానాలను తిప్పాలని నిర్ణయించారు. ఇది మొత్తం విమానాల్లో 30శాతంతో సమానం. గత గురువారం నుంచి ఇప్పటిదాకా మొత్తం 63వేల విమాన సర్వీసులు రద్దయ్యాయి.