Thursday, April 29, 2010

'సోయా'కు గడ్డుకాలం!

పెరిగిన పోటీ
అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన ధర
ఆదిలాబాద్‌- న్యూస్‌టుడే
ఇప్పటివరకు అంతర్జాతీయ విపణిలో తనకంటూ ఒక పట్టును నిరూపించుకుంటున్న సోయా పరిశ్రమ అమెరికా, బ్రెజిల్‌ల ధాటికి విలవిలలాడేటట్లుంది. సబ్బులు, ఖాద్య తైలాలు, కోళ్ల ఫారాలకు కావలసిన దాణాలకు ముడిపదార్థమైన సోయా పంట దిగుబడి తగ్గినా ధరలు పెరగకుండా మరింత తగ్గుతుండటం అటు రైతుల్లో, ఇటు సోయా కర్మాగారాల యాజమాన్యాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా 2009 ఖరీఫ్‌లో దాదాపు 1.90 లక్షల హెక్టార్లలో సోయా సాగయితే అందులో ఆదిలాబాద్‌లోనే 1.25 లక్షల హెక్టార్లు ఉంది. నిజామాబాద్‌లో మరో 50,000 హెక్టార్ల వరకు సాగయ్యింది. గత మూడేళ్లుగా సోయా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అది కూడా ఆదిలాబాద్‌ జిల్లాలోనే ఎక్కువగా కనపడుతోంది. ఈ మధ్య కాలంలో నిజామాబాద్‌ తదితర జిల్లాలో ప్రజలు సోయా సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. రెండేళ్ల కిందట సోయా క్వింటాలుకు గరిష్ఠంగా రూ.2,600 వరకు ధర పలికింది. ఈసారి తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితులతో 70 శాతం వరకు ఆదిలాబాద్‌లో సోయా పంట తుడుచిపెట్టుకుపోయింది. 2009 ఖరీఫ్‌ మొదట్లో క్వింటాలు సోయా ధర రూ.2,200 వరకు ఉండగా, నెమ్మదిగా తగ్గుతూ ప్రస్తుతం రూ.1,950కి చేరుకుంది.

ఎగుమతులపై ప్రభావం: మొదటి నుంచి భారత్‌ నుంచి సోయా నూనె, కేక్‌ (డీవోసీ)ల ఎగుమతి ఎక్కువగా బంగ్లాదేశ్‌, ఇండోనేషియా, యూరప్‌లోని కొన్ని దేశాలకు ఉండేది. అయితే సోయా ఎగుమతుల లాభాలను గరిష్ఠంగా ఆర్జించే ఉద్దేశంతో ఆమెరికా, బ్రెజిల్‌లు సోయా సాగుపై ప్రత్యేకంగా దృష్టి సారించి భారీగా సాగు చేయడంతో అంతర్జాతీయ విపణిలో సోయా ఉత్పత్తుల ధరలు గణనీయంగా పడిపోయాయి. రెండేళ్ల క్రితం సోయా క్రూడాయిల్‌ (రిఫైన్డ్‌ చేయనిది) 10 కిలోల ధర రూ.660 ఉండగా, ప్రస్తుతం రూ.400కు పడిపోయింది. ఇక కోళ్ల ఫారాల్లో దాణాగా ఉపయోగించే డీఓసీ (డీఆయిల్డ్‌ కేక్‌) రెండేళ్ల కిందట క్వింటాలుకు రూ.2,600 ఉండగా, ప్రస్తుతం రూ.1,700 వరకు ఉంది.

దెబ్బ మీద దెబ్బ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సోయా పరిశ్రమకు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా పరిణమించేటట్లుంది. హెచ్‌టీ విద్యుత్తును వినియోగిస్తోన్న సోయా పరిశ్రమలు యూనిట్‌ విద్యుత్తుకు రూ.3.25 వంతున చెల్లిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో యూనిట్‌కు రూ.3.75 చెల్లించవలసివస్తుంది.

మరింత ఇబ్బందికరమే: ఆదిలాబాద్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గాదె వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ అమెరికా, బ్రెజిల్‌ల వల్ల ఎగుమతుల్లో తగ్గుదల కనపడుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని సోయా ఉత్పత్తులను స్థానికంగానే అమ్ముకోవాల్సి వస్తోందని, తాజాగా విద్యుత్తు ఛార్జీలను పెంచడంతో పరిశ్రమ మరింత ఇబ్బందిపడాల్సి ఉంటుందని చెప్పారు. సోయా ఉత్పత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అంతర్జాతీయంగా పోటీని తట్టుకుని విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించవచ్చని తెలిపారు.

ప్రధాన కేంద్రం ఆదిలాబాద్‌
రాష్ట్రంలో సోయా పరిశ్రమకు ప్రధాన కేంద్రం ఆదిలాబాద్‌ జిల్లా. మొత్తం 3 కర్మాగారాలు రోజుకు 1,600 టన్నుల సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌లో 200 టన్నుల సామర్థ్యం కల మరో పరిశ్రమ ఉంది. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే మహారాష్ట్రలో దాదాపు 60 వరకు సోయా పరిశ్రమలు, మధ్య ప్రదేశ్‌లో పదుల సంఖ్యలో సోయా పరిశ్రమలు ఉన్నాయి.

సబ్బుల తయారీలో కీలకం
క క్వింటాలు సోయా పంట నుంచి 17 శాతం క్రూడాయిల్‌, 82 శాతం డీఆయిల్డ్‌ కేక్‌- డీఓసీ ఉత్పత్తి అవుతాయి. తరుగుదల ఒక శాతమే ఉంటుంది. 100 కిలోల క్రూడాయిల్‌ను రీఫైన్‌ చేస్తే 95 కేజీల ఎడిబుల్‌ ఆయిల్‌ వస్తుంది. దీనిని వంటనూనెగా, ఇతరత్రా ఆహార పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు. మరో 5 కిలోలు చిక్కగా ఉండే మడ్డి లాంటి పదార్థం సబ్బుల తయారీకి కీలకం.