దేశంలో ఏటా పోగుబడి 3,00,000 టన్నులు వాతావరణ కాలుష్య కారకాలను నియంత్రించే పద్ధతులే కొంగొత్త ఉపాధి - వ్యాపార అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఆసుపత్రి వ్యర్థాల ట్రీట్‌మెంట్లు ప్లాంట్లు కూడా అలాంటివే. దేశంలోని 84,000కు పైగా ఆస్పత్రుల్లో సొంతగా వ్యర్థాల నిర్మూలన ప్లాంట్లు కలిగినవి 170 మాత్రమే. కామన్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లనే అత్యధికులు వినియోగిస్తున్నారు. ఇలాంటివి ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంతో మరింత విస్తృతంగా నెలకొల్పాలని, సర్వే అనంతరం లక్నోలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఐఐఎం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
ట్రీట్‌మెంటు ప్లాంటు వ్యయం రూ.కోటి
పీపీపీ పద్ధతిలో ఏర్పాటుకు అవకాశం

మన రాష్ట్రంలోనే తొలి ప్లాంటు: 'జీవ, వైద్య సంబంధ వ్యర్థాలు' శాస్త్రీయంగా ఎలా ధ్వంసం చేయాలో వివరిస్తూ 1998లో 'పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ' నిబంధనలు రూపొందించింది. దేశంలోనే తొలిసారిగా 1999 జూన్‌లో మనరాష్ట్రంలోనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ -సేఫ్ ఎన్విరాన్ సాయంతో ఇన్‌సినరేటర్ యూనిట్ స్థాపించారు. అయితే 2003 ఫిబ్రవరిలో ఇది గుర్తింపు పొందింది. హైదరాబాద్‌లో 2000 మార్చిలో ఏర్పాటైన జి.జె. మల్టిక్లేవ్ ప్లాంటు తొలిసారిగా అధికారిక గుర్తింపు పొందింది. రాంకీ ఆధ్వర్యంలో ఆ సమయంలోనే మరో ప్లాంటు ఏర్పాటైంది.రాష్ట్రంలో ఇప్పటివరకు 14 ప్లాంట్లు పనిచేస్తుంటే, మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి.
ప్లాంటు కనీసం కోటి రూపాయలు: ఇన్‌సినరేటర్ ధరే రూ.25 లక్షల వరకు ఉంటుంది. మూడు, నాలుగేళ్లకు మించి మన్నదు. ఇతర పరికరాలు, భూమి సమకూర్చుకోడానికి ఒక్కో ప్లాంటుపై కనీసం రూ.కోటి అవుతుంది.
* గంటకు 200 కిలోల చొప్పున మెడికల్ వ్యర్థాలను భస్మీపటలం చేసే ఈ పరికరంలోని రెండు బర్నర్లకు 30 లీటర్ల డీజిల్ అవసరం. రోజుకు 5 గంటల చొప్పున వాడితే టన్ను వ్యర్థాలను బూడిద చేయవచ్చు. అత్యధిక ఉష్ణోగ్రత కోసం ముందుగా గంటసేపు ఇంధనాన్ని మండించాలి. లీటరు డీజిల్ ధర రూ.38. అంటే టన్ను వ్యర్థాల ధ్వంసానికి 180 లీటర్ల డీజిల్‌కు రూ.7000 వరకు అవుతుంది. సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులు అదనం. మొత్తం మీద కిలో వ్యర్థాల ధ్వంసానికి రూ.8 నుంచి రూ.10, అంటే టన్నుకు రూ.10,000 అవుతుంది. ఈ ఖర్చులకు మరికొంత కలుపుకొని ఆసుపత్రులనుంచి ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్వాహకులు రుసుం వసూలు చేస్తారు.
ట్రీట్‌మెంట్ ప్లాంటు ఏర్పాటుకు..: కిలోమీటరు పరిధిలో నివాసాలు, కాల్వలు, చెరువులు, నది ఉండకూడదు. స్థానిక సంస్థల అనుమతి పొందాక కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయాల్లో యంత్రాల స్థాపనకు అనుమతి (సీఎఫ్‌ఈ) కోసం దరఖాస్తు చేయాలి. అన్ని అనుమతులు పొందాక, యంత్రాలు స్థాపించి, అధికారుల పరిశీలన పూర్తయ్యాక, కార్యకలాపాలు ప్రారంభించేందుకు (సీఎఫ్‌ఓ) అనుమతి పొందాలి.
* వ్యర్థాల నిర్మూలనలో ప్రైవేటు సంస్థలు భాగస్వామ్యం వహిస్తే, వైద్య సంబంధ అంశాలపై ఆస్పత్రుల నిర్వాహకులు మరింతగా దృష్టి సారించగలుగుతారు.
ట్రీట్‌మెంట్ ప్లాంటుల్లో ..
ఇన్‌సినరేటర్: డీజిల్ ఇంధనంగా 850 - 1050 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువరిస్తుంది. పసుపు రంగు సంచుల్లో సేకరించిన వ్యర్థాలను వీటిలో భస్మం చేస్తారు.
ఆటోక్లేవ్: ఎరుపు/నీలం కవర్లలో పోగయ్యే వ్యర్థాలను క్రిమి రహితంగా మార్చి, గ్రాన్యూల్స్ తయారీకి వాడతారు.షడ్డర్స్: ఇన్‌ఫెక్షన్ రహిత వ్యర్థాలను ముక్కలుగా చేస్తారు.
షార్ప్‌పిట్: సూదుల వంటివి ఇందులో కప్పిపెడతారు.
సెక్యూర్డ్ ల్యాండ్‌ఫిల్: ఇన్‌సినరేటర్‌లో వెలువడే బూడిద, పనికిరాని మందులు, తదితరాలను భూమిలో లోతుగా జరిపే ఈ ప్రత్యేక కాంక్రీట్ నిర్మాణంలో పూడ్చిపెడతారు.
వ్యర్థాల సేకరణ ఇలా
పసుపు సంచులు: శరీరభాగాలు, లేబొరేటరీల వ్యర్థాలు, రక్తం -విసర్జితాలు తుడిచిన దూది వంటివి వేస్తారు.
ఎరుపు/నీలం సంచులు: సూది తొలగించిన సిరంజిలు, సిలైన్ సీసాలు, ట్యూబ్‌లు
ఆకుపచ్చ సంచులు: ఆహార పదార్థాలు, మందుల కవర్లు, ఇతర వ్యర్థాలు
తెలుపు డబ్బాలు: సూదులు, బ్లేడ్లు, గాజు


* ఇన్‌సినరేషన్ ప్లాంటు ప్రారంభ పెట్టుబడి, నిర్వహణ ఖర్చు అధికం, నిపుణుల కొరత
* ఆసుపత్రిలో వ్యర్థాల విభజన సక్రమంగా లేకపోవడం
* వ్యర్థాల సేకరణ, తరలింపునకు యంత్రాంగ లేమి