Monday, April 26, 2010

చిన్నబోయిన పెట్టుబడులు!

ఆరేళ్లలో రూ. 37 వేల కోట్లే సమీకరణ
అనేక సంస్థల బురిడీ
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఆరు సంవత్సరాల్లో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు సాధించిన పెట్టుబడులు ఎంతో తెలుసా... కేవలం రూ.37,569 కోట్లు మాత్రమే. 698 భారీ పరిశ్రమలు, 17,425 చిన్న తరహా పరిశ్రమలు, 106 సెజ్‌లకు సంబంధించి ఈ పెట్టుబడులు సమకూరాయి. పరిశ్రమలశాఖ, ప్రభుత్వ హడావుడి చూస్తే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సమకూరుతాయనిపించింది. చివరకు పెట్టుబడులు చూస్తే చిన్నబోయాయి.! రాష్ట్ర పారిశ్రామికశాఖ తాజా నివేదికలో ఈ అసలు విషయం వెలుగుచూసింది. ''రాష్ట్రంలో ఒక్క 2006లోనే 93వేల కోట్లరూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు అందాయి'' అంటూ 2007-08 బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి రోశయ్య ఘనంగా ప్రకటించారు. ఒక్క సంవత్సరమే అన్ని పెట్టుబడులు వస్తే ఇక 2010 వరకూ లక్షకోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రావాలి. కాని వాస్తవం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గధామం అంటూ ఊదరగొడుతున్న ప్రచారంలోని డొల్లతనమూ బయటపడింది. సెజ్‌లు, భారీ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రూ.29,297 కోట్లు. చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి రూ.8272 కోట్లు పెట్టుబడులు మిగిలినట్లు పరిశ్రమలశాఖ తేల్చింది.

కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు
2005 పారిశ్రామిక విధానంలో భారీ ఎత్తున పెట్టుబడుల సేకరణను ప్రధానాంశంగా ఎంచుకోవడంతో దేశ, విదేశీ సంస్థల నుంచి ప్రతిపాదనలు వెల్లువెత్తాయి. వచ్చిన వారందరితో ఒప్పందాలు చేసుకుని భూ కేటాయింపులూ చేపట్టింది. రాయితీలను ప్రకటించింది. పెట్టుబడుల సమీకరణ సమయంలోనే ఆ సంస్థల బండారం బయటపడింది. భారీ పెట్టుబడులు తెస్తామన్న సంస్థలు భాగస్వాములు దొరకడం లేదని... బ్యాంకులు ముందుకు రావడం లేదని...ఆర్థికమాంద్యమని ఇప్పుడు సాకులు చెబుతున్నాయి.

ఉదంతాలెన్నో...!
* రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో ఒడిస్సీ సైన్స్‌ సిటీని ఏర్పాటు చేస్తామని జురాంగ్‌ కన్సార్టియం కంపెనీతో ప్రభుత్వం అట్టహాసంగా ఒప్పందం కుదుర్చుకుంది. భూసేకరణ చేపట్టింది. ఆకంపెనీ చేతులెత్తేయడంతో రూపాయి పెట్టుబడి రాలేదు.
* రూ. 40 వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ లక్ష్యం చేపట్టిన ఫ్యాబ్‌సిటీలో ఇప్పటికి రూ. 500 కోట్ల పెట్టుబడితో ఒక్కపరిశ్రమే ప్రారంభమైంది.
* రాష్ట్రం నుంచి 106 సెజ్‌లు అనుమతులు పొందాయి. ఒక్కో సెజ్‌లో వేయి కోట్ల పెట్టుబడి పెట్టినా రూ. లక్ష కోట్లు సమకూరేవి. అది జరగలేదు. సెజ్‌ల ద్వారా ప్రభుత్వం రూ.75 వేల కోట్ల పెట్టుబడులను అంచనా వేయగా ఇప్పటికి రూ.పది వేల కోట్లే సమకూరింది.

కోరినంత గడువు:ఒప్పందాల ప్రకారం పెట్టుబడులకు ముందుకొచ్చిన కంపెనీలు ఆరు నెలల నుంచి ఏడాది లోపు వాటి ఆర్థిక సామర్థ్యం నిరూపించుకోవాల్సి ఉంది. చాలా కంపెనీలు ఇది చేయలేదు. నిబంధనల ప్రకారం ఒప్పందాన్ని పాటించని సంస్థల భూకేటాయింపులను రద్దు చేయాలి. ఆ సంస్థలకు ప్రభుత్వం ఏళ్ల తరబడి గడువు పొడగిస్తోంది. పదే పదే గడువు పొడగించినా అనేక సంస్థలలో స్పందన లేదు. దీంతో వాటికి పరిశ్రమల శాఖ నోటీసులు ఇచ్చింది. నోటీసులకు సైతం గడువును పొడిగిస్తోంది. ప్రభుత్వం గత ఆరేళ్లలో ఇప్పటి వరకు ఒక్క సంస్థ నుంచి భూములను వెనక్కి తీసుకున్న దాఖలాలు లేవు. ఫ్యాబ్‌సిటీలో ఒక సంస్థ నుంచి భూమి స్వాధీనానికి పూనుకోగా సదరు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ ఆగింది. నెల్లూరు జిల్లాలో కపారో సంస్థకిచ్చిన భూములను వెనక్కి తీసుకునేందుకు నిర్ణయించినా దానిపై ఉత్తర్వులకు వెనుకాడుతోంది.