Thursday, April 29, 2010

మౌలికం ముందుకే...

మార్చిలో వృద్ధి 7.2%
పారిశ్రామిక ప్రగతిపై ఆశలు
న్యూఢిల్లీ: మౌలిక రంగ పరిశ్రమలు మార్చిలో ఆశాజనకమైన వృద్ధిని కనబర్చాయి.. కిందటేడాది ఇదే కాలంలో కేవలం 3.3 శాతంగా ఉన్న మౌలిక వృద్ధిరేటు ఈసారి ఏకంగా 7.2 శాతానికి పెరగడం గమనార్హం. పారిశ్రామిక రంగ రికవరీ వేగంగా చోటు చేసుకుంటోందనేందుకు ఇదొక నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మౌలిక రంగం తాజా పనితీరు మార్చి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సానుకూలంగా ఉంటాయనే సంకేతాలను పంపుతోందని వారు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి నెలలో 4.7 శాతం వృద్ధిరేటుకు పరిమితమైన ముడి చమురు, పెట్రోలియం రిపైనరీ ఉత్పత్తులు, బొగ్గు, విద్యుత్తు, సిమెంటు, ఫినిష్‌డ్‌ ఉక్కు పరిశ్రమలు మార్చిలో గణనీయమైన పురోగతిని కనబర్చాయి. మొత్తం పారిశ్రామికోత్పత్తిలో మౌలిక రంగాల సమీకృత వెయిటేజీ 26.7 శాతం. 2009 ఏప్రిల్‌ - 2010 మార్చికాలంలో వీటి వృద్ధిరేటు 5.5 శాతానికి చేరగా, కిందటేడాది ఇదేకాలంలో దీని విలువ 3 శాతంగా ఉన్నట్లు ఓ అధికారిక ప్రకటన తెలిపింది.

మౌలిక పరిశ్రమల వృద్ధి తీరిదీ..: ఫినిష్‌డ్‌ ఉక్కు పరిశ్రమ 9.2శాతం వృద్ధితో మౌలిక విభాగంలో ముందంజ వేసింది. కిందటేడాది ఇదే మార్చిలో ఈ పరిశ్రమ 1.8 శాతం ప్రతికూల వృద్ధిని చవిచూసింది.

* బొగ్గు, విద్యుదుత్పత్తి, సిమెంటు రంగాలన్నీ 7.8 శాతం చొప్పున వృద్ధిని కనబర్చాయి. 2009 మార్చిలో ఇవన్నీ వరుసగా.. 5.3 శాతం, 6.3%, 10.1% మేర రాణించాయి.

* ముడి చమురు ఉత్పత్తి 3.5 శాతం మెరుగుపడింది.. గతేడాది ఇదే కాలంలో 2.3 శాతం ప్రతికూలంగా నమోదైంది.

* పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తుల పరిశ్రమ 0.4 శాతం ప్రతికూల వృద్ధిరేటుకు క్షీణించింది. 2009 మార్చిలో ఇది 3.3 శాతంగా ఉంది.