Wednesday, April 21, 2010

ఫాకర్‌లో ఎల్ఎన్ మిట్టల్ పెట్టుబడి? వాటాల కొనుగోలుకు ఆసక్తి

ఒరిస్సాతో పాటు మన రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ప్లాంట్లు కలిగి ఉన్న ఫెర్రో అల్లాయిస్ కార్పొరేషన్ (ఫాకర్)లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు ఎల్ఎన్ మిట్టల్‌కు చెందిన కంపెనీ ఆర్సెలార్ మిట్టల్ ఆసక్తి కనబరుస్తోంది. ఆరు నెలల క్రితం స్పెషాల్టీ స్టీల్ ఉత్పత్తి కంపెనీ ఉత్తమ్ గాల్వాలో వాటాలు కొనుగోలు చేసిన ఆర్సెలార్ మిట్టల్.. తాజాగా ఫెర్రో అల్లాయిస్ ఉత్పత్తి కంపెనీ ఫాకర్‌లో వాటాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు తెలిసింది. ఫాకర్ ప్రమోటర్లు విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి తమ వ్యాపారాన్ని విస్తరిస్తూ... అందుకుగాను అవసరమైన నిధులలో కొంత భాగాన్ని సమకూర్చుకునేందుకు ఫాకర్‌లో కొంత ఈక్విటీని విక్రయించాలన్న ఆలోచనలో ఉన్నారు.

ఫాకర్‌కు ఒరిస్సాలో క్రోమ్ మైనింగ్ వ్యాపారం కూడా ఉంది. ఫాకర్ లో వాటాలు కొనుగోలుకు ఆర్సెలార్ మిట్టల్ కంపెనీ ఆసక్తితో ఉంది, కంపెనీ విలువను నిపుణులు అంచనా కడుతున్నారని తెలిసింది. ఫాకర్ షేరు ప్రస్తుత రేటు ప్రకారం ఆ కంపెనీ విలువ 435 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఫాకర్ 500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప«థకాలు సిద్ధం చేసుకుంటోంది. అందుకు అయ్యే వ్యయంలో కొంత మొత్తాన్ని సమకూర్చుకునేందుకు కంపెనీలో కొంత వాటాను విక్రయించాలనకుంటోంది. కంపెనీ విలువను అంచనా కట్టే పనిని ప్రముఖ ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్‌కు అప్పగించింది.