Wednesday, April 21, 2010

లక్ష్యాన్ని చేరని ప్రత్యక్ష పన్ను వసూళ్లు

రూ.3.75 లక్షల కోట్లకు పరిమితం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న విధంగా రూ.3.87 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. రూ.12,000 కోట్ల లోటుతో రూ.3.75 లక్షల కోట్లకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు పరిమితమయ్యాయి. మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లల్లో.. దాదాపు రూ.2.44 లక్షల కోట్లు ఒక్క కార్పొరేట్‌ ఆదాయపు పన్నుల నుంచే సమకూరడం గమనార్హం. ఇవి గతేడాది కార్పొరేట్‌ ఆదాయపు పన్ను వసూళ్ల లక్ష్యంతో పోల్చుకుంటే రూ.11,000 కోట్లు (రూ.2.55 లక్షల కోట్లు) తక్కువ. ఎంతో కీలకమైన ఈ విభాగంలో వసూళ్లు క్షీణించడమే సర్కారు పన్ను వసూళ్ల లక్ష్యం నీరుగారడానికి కారణమైందని ఆర్థిక శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా వ్యక్తిగత ఆదాయపు పన్నుల ద్వారా రూ.1.31 లక్షల కోట్లు; సెక్యూరిటీల బదిలీ పన్ను ద్వారా రూ.7,568 కోట్లు; సంపద పన్ను ద్వారా రూ.498 కోట్లు సర్కారు ఖజానాకు జమయ్యాయి. అంతక్రితం ఏడాది(2008-09)తో పోల్చుకుంటే గత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ ఆదాయపు పన్ను, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 13.1 శాతం మేర మెరుగుపడినట్లు అభిజ్ఞవర్గాల అంచనా. ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ప్రకటించిన 2010-11 బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని అంతకుముందు నాటి రూ.3.70 లక్షల కోట్ల నుంచి రూ.3.87 లక్షల కోట్లకు సవరించిన సంగతి తెలిసిందే.

2010-11 సీజన్‌లో రికార్డు స్థాయి
పత్తి దిగుబడులు!
న్యూఢిల్లీ: భారత్‌లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయితే 2010-11 సీజన్‌లో పత్తి దిగుబడి 6 శాతానికి పైగా వృద్ధి చెంది 25 మిలియన్‌ బేళ్ల రికార్డు స్థాయికి తాకొచ్చని అమెరికా వ్యవసాయ శాఖ(యూఎస్‌డీఏ) అంచనా వేసింది. మరోవైపు ప్రస్తుత మార్కెటింగ్‌ సీజన్‌ (2009-10)లో పత్తి దిగుబడి 23.5 మిలియన్‌ బేళ్లుగా నమోదుకావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (మార్కెటింగ్‌ సీజన్‌ ఆగస్టులో మొదలై జులైతో ముగుస్తుంది. 1 బేల్‌ = 170 కిలో గ్రాములు.) భారత్‌లో రికార్డు స్థాయిలో పత్తి సాగు విస్తీర్ణం వృద్ధి చెంది, దిగుబడి పెరగొచ్చనే అంచనాల నేపథ్యంలో యూఎస్‌డీఏ విడుదల చేసిన ఓ నివేదికలోస ఈ విషయాలను ప్రస్తావించారు. సకాలంలో తగినన్ని వర్షాలు కురిస్తే పత్తి సాగు విస్తీర్ణం ప్రస్తుతమున్న 10.23 మిలియన్‌ హెక్టార్ల నుంచి 10.30 మి.హెక్టార్లకు స్వల్పంగా పెరగొచ్చని నివేదిక పేర్కొంది.

ఫిలిప్స్‌ టీవీల విక్రయం వీడియోకాన్‌ చేతికి
న్యూఢిల్లీ: భారత్‌లో ఫిలిప్స్‌ టీవీలను ఇకపై వీడియోకాన్‌ విక్రయిస్తుంది. అంతే కాదు తయారీ, పంపిణీ, విక్రయానంతర సేవలను సైతం వీడియోకాన్‌ అందిస్తుంది. ఈ మేరకు కంపెనీతో నెదర్లాండ్స్‌ వినియోగదారు వస్తువుల దిగ్గజం ఫిలిప్స్‌ ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం అంతర్జాతీయంగా ఫిలిప్స్‌పాటిస్తున్న ప్రమాణాలు, ప్రత్యేకతలతోనే వీడియోకాన్‌ టీవీలను తయారుచేసి ఫిలిప్స్‌ బ్రాండ్‌తో విక్రయిస్తుందని ఫిలిప్స్‌ ఇండియా సీఈఓ మురళి శివరామన్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచి దీన్ని(టీవీ విభాగం) మళ్లీ లాభాల బాట పట్టించడం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన వివరించారు. అమెరికాలో తమ టీవీ వ్యాపారం కోసం గతంలో జపాన్‌ కంపెనీకి చెందిన ఫునాయ్‌తోనూ ఇదే తరహా ఒప్పందాన్ని కుదుర్చుకుని విజయవంతమైంది. అదే ఆలోచనను భారత్‌లోనూ అమలు చేసి లాభాలు పొందాలన్నది ఫిలిప్స్‌ ఆలోచన.

ఇతర వాల్‌స్ట్రీట్‌ దిగ్గజాలపైనా
ఎస్‌ఈసీ దర్యాప్తు ప్రారంభం
న్యూయార్క్‌: అమెరికా మార్కెట్‌ నియంత్రణ సంస్థ ఎస్‌ఈసీ తాజాగా ఇతర వాల్‌స్ట్రీట్‌ దిగ్గజ సంస్థలపైనా దర్యాప్తు మొదలుపెట్టింది. మదుపర్లను మోసపుచ్చే విధంగా కొన్ని బ్యాంకులు ఇతర తనఖా ఒప్పందాలు జరిపాయామోనన్న దిశగా ఎస్‌ఈసీ దర్యాప్తు చేస్తున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. కీలకాంశాలను దాచిపెట్టి మదుపర్లకు 1 బిలియన్‌ డాలర్ల మేర నష్టం తెచ్చిపెట్టిందని గోల్డ్‌మాన్‌ శాక్స్‌పై ఎస్‌ఈసీ శుక్రవారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ పత్రిక కథనం ప్రకారం డాయిష్‌ బ్యాంకు, యూబీఎస్‌, మెరిల్‌ లించ్‌లకు తనఖా ఒప్పందాలున్నాయి. అయితే ఎస్‌ఈసీ ఏ ఒప్పందాలపై దర్యాప్తు చేస్తోందన్న విషయం తెలియదని ఆ కథనం తెలిపింది. ఎవరైనా క్లయింటుకు ప్రయోజనం కలిగించేలా ఒప్పందం కుదిరిందా లేదా అన్న విషయంతోనే సరిపుచ్చకుండా వక్రీకరణ జరిగిందా అన్న కోణంలో నియంత్రణ సంస్థ పరిశీలన జరుపుతుందా అన్న విషయంపై ఏ సంస్థలు దర్యాప్తు కిందకు వస్తాయన్న విషయం ఆధారపడి ఉంటుంది. కొన్నేళ్ల క్రితం గృహ మార్కెట్‌ బలహీనమవుతున్న సమయంలో కొన్ని దిగ్గజ కంపెనీలు క్లయింట్లకు ప్రయోజనం కలిగించేలా కొన్ని ఉత్పత్తులను ఏర్పాటు చేశాయి. ఇది గృహ సంక్షోభానికి కారణమైందన్న విషయం తెలిసిందే.