Monday, April 19, 2010

మదుపర్లను మోసం చేసింది

* ఎస్‌ఈసీ తాజా ఆరోపణలు
* అలా చేయలేదన్న గోల్డ్‌మాన్‌ శాక్స్‌
న్యూయార్క్‌: అమెరికా బ్యాంకింగ్‌ దిగ్గజంమరో మారు తప్పు చేయలేదంటూ చెప్పుకొచ్చింది. తాజాగా అమెరికా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ కమిషన్‌(ఎస్‌ఈసీ) బ్యాంకుపై ఆరోపణలు చేయడంతో ఆత్మరక్షణలో పడిపోయింది. ఎస్‌ఈసీ ఆరోపణలను ఖండించింది.

ఎస్‌ఈసీ ఆరోపణలివీ:నివాస గృహ తనఖా ఉత్పత్తులకు చెందిన వివరాలను తప్పుగా ఇవ్వడంతో పాటు కీలక అంశాలను దాచి పెట్టడం ద్వారా మదుపర్లను మోసం చేసిందని బ్యాంకుపై ఎస్‌ఈసీ గత శుక్రవారం పేర్కొంది. కొల్లేటరైజ్డ్‌ డెట్‌ ఆబ్లిగేషన్‌(సీడీఓ)లను అధిక సంఖ్యలో విక్రయించడం ద్వారా పరోక్షంగా ఆర్థిక మాంద్యానికి బ్యాంకు కారణమైనట్లు ఆరోపణలున్నాయి. మదపర్లు 1 బిలియన్‌ డాలర్లకు పైగా పోగొట్టుకున్నట్లు ఎస్‌ఈసీ తన ఫిర్యాదులో పేర్కొంది.

బ్యాంకు వివరణ ఇది:కేవలం ఒక లావాదేవీ విషయంలో ఎస్‌ఈసీ తీసుకున్న చర్యలపై గోల్డ్‌మాన్‌ శాక్స్‌ అసంతృప్తిని వెళ్లగక్కింది. ఆ ఒప్పందం వల్ల బ్యాంకు కూడా నష్టపోయిందని వివరించింది. 'స్వయంగా గోల్డ్‌మాన్‌ శాక్స్‌ కూడా 90 మిలియన్‌ డాలర్లకు పైగా నష్టపోయింది. మా ఫీజు 15 మిలియన్‌ డాలర్లు. డబ్బు పోయేలా మేం పోర్ట్‌ఫోలియోను తయారుచేయలేద'ంటూ ఒక ప్రకటన చేసింది. ఎస్‌ఈసీ ఆరోపణలపై మా వాదనను గట్టిగా వినిపిస్తామని అందులో పేర్కొంది.