Wednesday, April 21, 2010

షాక్ కొట్టింది


పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు కరెంటు ఛార్జీల వడ్డన
యూనిట్‌కు 50 పైసల చొప్పున పెంపు
అధిక వినియోగవేళల్లో అదనపు ఛార్జీలు
ఎత్తిపోతల, రైల్వేకీ పెంపుదల
గృహ, వ్యవసాయ రంగాలకు మినహాయింపు
రూ.2278 కోట్లు ఆదాయ లక్ష్యం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
వూహించిందే జరిగింది. పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు సర్కారు కరెంటు షాక్‌ ఇచ్చింది. ఈ రంగాలకు యూనిట్‌కు 50 పైసల చొప్పున ఛార్జీలను పెంచాలని ప్రతిపాదించింది. ఇదిగాక పరిశ్రమలకు నిర్దేశిత సమయాల్లో వాడుకున్న కరెంట్‌కు అదనపు వడ్డింపునకు సిద్ధమైంది. ఈసారి ఎత్తిపోతల పథకాల్నీ వదల్లేదు. రైల్వేకు యూనిట్‌కు 80 పైసలు పెంచాలని ప్రతిపాదించింది. గృహ, వ్యవసాయ రంగాలకు మాత్రం మినహాయింపునిచ్చింది. ఛార్జీల పెంపు ద్వారా పరిశ్రమలు, వాణిజ్య, రైల్వే తదితర వినియోగదారుల నుంచి ఏటా రూ.2278 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. ఇందులో అధిక వినియోగ వేళల్లో అదనపు ఛార్జీల ద్వారా 350కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు మంగళవారం రాత్రి 10 గంటల తర్వాత రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి పెంపు ప్రతిపాదనలు సమర్పించాయి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత కరెంటు ఛార్జీలు పెరగనున్నాయి. 2002లో చివరిసారిగా ఛార్జీల్ని పెంచారు.

నాలుగు డిస్కంల రెవెన్యూలోటు రూ.10,120 కోట్లకు చేరుకుంది. ఇందులో ఛార్జీల పెంపు ద్వారా రూ.2278 కోట్లు ఆదాయం వస్తుందని అంచనావేశాయి. మిగతా రూ.7842 కోట్లను ప్రభుత్వం భరిస్తుందా లేదా..! అనేది స్పష్టత లేదు. ఈఆర్‌సీ విచారణ సందర్భంగా ఈ విషయం వెల్లడయ్యే అవకాశాలున్నాయి. డిస్కంల ప్రతిపాదనలపై అభ్యంతరాలు, విజ్ఞప్తులు స్వీకరించిన అనంతరం తుది ఆదేశాలు జారీచేయడానికి ఏపీఈఆర్‌సీ 90 రోజులు సమయం తీసుకుంటుంది.

రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య వర్గాల వినియోగం ఏటా 20 వేల మిలియన్‌ యూనిట్లపైన ఉంటుంది. యూనిట్‌కు 50 పైసల చొప్పున పెంచితే ఈ రంగాల నుంచి 2 వేల కోట్ల రూపాయలకు పైగా అదనపు ఆదాయం సమకూరుతుంది. తొలిసారిగా కరెంటు అధికంగా వినియోగించే వేళల్లో యూనిట్‌కి అదనంగా వసూలుచేయడానికి ప్రభుత్వం మొగ్గుచూపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యూనిట్‌కి 75 పైసలు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు యూనిట్‌కు రూ.1 అదనంగా వసూలుచేయడానికి ప్రతిపాదించాయి. నిర్దేశిత సమయాల్లో విద్యుత్‌ వాడకం నుంచి 350 నుంచి 400 కోట్ల రూపాయల మేర రాబట్టవచ్చని భావిస్తున్నారు. వినియోగ వేళల వారీగా మీటరు రీడింగ్‌ నమోదుచేయడానికి ప్రత్యేక మీటర్లు(ఏబీటీ-ఎవైలబిలిటీ బేస్డ్‌ టారిఫ్‌) బిగిస్తారు. ఈ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా 8 వేల పరిశ్రమలపై పడనుంది. చిన్నతరహా పరిశ్రమలకు మాత్రం యూనిట్‌కి 50 పైసలు చొప్పున పెంచనుంది. ఫెర్రో అల్లాయ్స్‌ విద్యుత్‌ ఛార్జీని రూ.2.40 నుంచి రూ.2.90 చేయాలని ప్రతిపాదించారు.

వాణిజ్య రంగానికి భారీగా ఛార్జీలు పెంచడానికి ప్రతిపాదించిన ప్రభుత్వంఇప్పటి వరకూ ఉన్న రెండు స్లాబ్‌లను మూడుస్లాబ్‌లుగా మార్చింది. నెలకు 100 యూనిట్లులోపు కరెంటు వాడుకునే వాణిజ్య వినియోగదారులకు మినహాయింపు ఇచ్చింది. కానీ నేడు చిన్నపాటి దుకాణాల్లోనూ నెలకు వంద యూనిట్ల పైనే కరెంటు కాలుతోంది. ఈ లెక్కన వాణిజ్య రంగంలో అందరికీ వడ్డింపు తప్పదు. ప్రస్తుత విధానంలో 50 యూనిట్లు మించి వాడుకునే వినియోగదారులంతా ఒకే స్లాబ్‌లో ఉన్నారు. ప్రతిపాదించిన విధానంలో 51 నుంచి 100 యూనిట్లు ఒక స్లాబ్‌గా, 100కి మించి వాడుకునే వినియోగదారులు మూడోస్లాబ్‌గా పేర్కొన్నారు.

సమయ పాలన..
సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్‌ వినియోగం ఎక్కువ. దీన్నే 'పీక్‌లోడ్‌'గా భావిస్తున్నారు. ఈ సమయంలో పారిశ్రామిక, వాణిజ్య వర్గాల వినియోగం తగ్గిస్తే గృహావసరాలకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని ప్రభుత్వం అభిప్రాయముంది. విద్యుత్‌ రంగంలో 'టైం ఆఫ్‌ ది డే' పాటించాలనే చర్చ ఎప్పట్నుంచో జరుగుతూ వస్తున్నప్పటికీ ఆచరణలోకి రాలేదు. తొలిసారిగా ప్రభుత్వం ఈ పద్ధతిని ఆచరణలోకి తీసుకువస్తోంది. సాయంత్రమేగాక ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాడే విద్యుత్‌కు అదనపు ఛార్జీనివసూలు చేయాలని ప్రతిపాదించారు. ఒక రకంగా ఈ సమయంలో విద్యుత్‌ వినియోగం తక్కువ. అలాంటి సందర్భంలో విద్యుత్‌ వాడకాన్ని ప్రోత్సహించాలి. అయితే వ్యవసాయ రంగానికి విద్యుత్‌ సరఫరాను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
ఎత్తిపోతలకు ఝలక్‌
వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలపై వడ్డించడానికి సిద్ధమైంది. ఒకేసారి యూనిట్‌కు 50 పైసల చొప్పున పెంచబోతున్నారు. ప్రస్తుతం యూనిట్‌ ధర రూ.2.36 పైసలు కాగా పెంపుదలతో రూ.2.86 పైసలు అవుతుంది. నిర్వహణ భారంతో ఇప్పటికే ఎత్తిపోతల పథకాలు ఆటుపోట్లకు గురవుతున్న తరుణంలో తాజా నిర్ణయం రైతులకు శరాఘాతం. ఎత్తిపోతల పథకాలకు ప్రస్తుతం కరెంటు బిల్లులు ప్రభుత్వమే భరిస్తోంది. పెంచిన ఛార్జీకి అనుగుణంగా రాయితీ పెంచాల్సి ఉంది.
* ప్రస్తుతం రైల్వేకి యూనిట్‌కి రూ.3.95 వసూలు చేస్తుండగా కొత్త ప్రతిపాదనల్లో యూనిట్‌కి రూ.4.75 చొప్పున పెంచనున్నారు.
ప్రోత్సాహకాలకు కత్తెర
ప్రోత్సాహకాలకూ కోత పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పరిశ్రమలకు కేటాయించిన కోటాలో 50 శాతం కరెంటు వాడుకుంటే కొంతమేర ప్రోత్సాహకాలు, అంతకంటే ఎక్కువ కరెంటు వినియోగిస్తే మరింత మొత్తం ప్రోత్సాహకంగా అందిస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో కరెంటు వినియోగం పెంచేందుకు ఈ ప్రోత్సాహకాలు అమలుచేస్తున్నాయి. కొత్త ప్రతిపాదనల్లో ప్రోత్సాహకాలు తొలగించినట్లు తెలిసింది. ఈ మొత్తం రూ.200కోట్ల మేరకు ఉంటుందని అంచనా.