Monday, April 26, 2010

సబ్‌-ప్రైమ్‌ 'లాభాల'పై చంకలు గుద్దుకొన్న గోల్డ్‌మన్‌!

ఇ-మెయిల్‌లు చెప్పిన సత్యమిది..
సెనేట్‌ బృందం వెల్లడి
వాషింగ్టన్‌: తనఖా లావాదేవీలు (మార్టగేజెస్‌) అమాంతం విఫలం అవుతున్నందువల్ల 'పెద్ద మొత్తంలో సొమ్ములు వచ్చిపడతాయ'ని గోల్డ్‌మన్‌ శాక్స్‌ గ్రూప్‌ ఇంక్‌ అధికారులు 2007లోనే పరస్పరం తెలియజెప్పుకొన్నారని సెనేట్‌ బృందమొకటి బయటపెట్టింది. అధికారులు ఒకరు మరొకరికి పంపించుకొన్న ఇ-మెయిల్‌లలో ఈ మేరకు సమాచారం ఉందంటూ ఆ లేఖలను ఈ బృందం విడుదల చేసింది. సబ్‌-ప్రైమ్‌ సంక్షోభం కారణంగా2008 అక్టోబరులో లేమాన్‌ బ్రదర్స్‌ చేతులు ఎత్తేడయంతో, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆర్థిక సంక్షోభానికి గురయిన సంగతి విదితమే. 'తనఖా సమస్యను తప్పించలేకపోయామనుకోండి.. మనం కూడా నష్టాలు చవిచూశాం. అయితే ఆ తరువాత నష్టపోయిందానికన్నా మరెంతో షార్ట్‌ల వల్ల సంపాయించుకోగలిగాం' అని గోల్డ్‌మన్‌ శాక్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ లాయిడ్‌ బ్లాంక్‌ఫీన్‌ 2007 నవంబరులో ఒక ఇ-మెయిల్‌లో వ్యాఖ్యానించారట. 2007 అక్టోబరులోనే గోల్డ్‌మన్‌ శాక్స్‌ మరో ఎగ్జిక్యూటివ్‌ డోనాల్డ్‌ ముల్లెన్‌ కొల్లేటరల్‌ డెట్‌ ఆబ్లిగేషన్‌ (సీడీఓ)లలో సెకండ్‌- లీన్‌ లావాదేవీల పతనం గురించి తన విశ్లేషణను కొన్ని ఇ-మెయిల్‌లలో పొందుపరుస్తూ 'మనకు భారీ సొమ్మే దక్కేటట్లు ఉంది' అని వ్యాఖ్యానించారట. సంక్షోభంలో గోల్డ్‌మన్‌ శాక్స్‌ పోషించిన పాత్రను గురించి బ్లాంక్‌ఫీన్‌ను, ఇతర అధికారులను 'సెనేట్‌ పర్మనెంట్‌ సబ్‌కమిటీ ఆన్‌ ఇన్వెస్టిగేషన్స్‌' మంగళవారం విచారించనుంది. సీడీఓ మార్కెటింగ్‌ తతంగంలో గోల్డ్‌మన్‌ శాక్స్‌పై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజి కమిషన్‌ దావా వేసిన విషయం విదితమే.