కొత్త కార్ల తయారీ బాటలో.. 'న్యూస్‌టుడే' ఇంటర్వ్యూలో మారుతీ సుజుకీ ఇండియా మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇంజినీరింగ్) ఐ.వి.రావు

న్యూస్‌టుడే: కొన్ని మారుతీ మోడల్ కార్ల కోసం ఇప్పటికీ వినియోగదార్లు బుక్ చేసుకొని ఎదురుచూడాల్సి వస్తోంది. ఇలా ఎంత కాలం.. కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం ఎప్పుడు పెరుగుతుంది
ఐ.వి.రావు: మూడు నాలుగు మోడళ్లలో డిమాండ్‌కు అనుగుణంగా కార్లను అందించలేకపోతున్నందువల్లే ఈ సమస్య. నిజానికి గురుగావ్‌లోని యూనిట్లు సామర్థ్యానికి మించి ఉత్పత్తి చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ ఏడాదిలో డిమాండ్ మేరకు కార్లు తయారు చేయాలంటే ప్రత్యామ్నాయ ఆలోచన తప్పదు. అందువల్ల ఉత్పత్తి కార్యకలాపాలను హేతుబద్ధం చేయడంపై దృష్టి సారించాం. తద్వారా మరో 70,000 లేదా 80,000 కార్లను అదనంగా తయారుచేయగలం. మానేసర్‌లో 2.5 లక్షల కార్ల తయారీ సామర్థ్యం ఉన్న కొత్త ప్లాంట్ నిర్మాణం వచ్చే ఏడాది చివర్లో పూర్తి కానుంది. దీని వల్ల డిమాండ్‌ను కొంతవరకు తీర్చగలుగుతాం.
?ఆర్ & డీ విభాగాన్ని బలోపేతం చేసే దిశగా కంపెనీ ప్రణాళికలు..
ఈ విభాగంలో మాకు 900 మందికి పైగా ఇంజినీర్లు ఉన్నారు.. కొత్తగా కూడా తీసుకుంటున్నాం. ఇటీవల బ్రిటిషు, శ్రీలంక డిజైనర్లు కొందరిని నియమించాం. ప్రస్తుత కార్ల ప్లాట్‌ఫామ్‌లపై కొత్త కార్లను అభివృద్ధి చేయడం ఎలా అనే అంశంపై ప్రధానంగా ఆర్ &డీ విభాగం దృష్టి సారిస్తోంది. తత్ఫలితంగా తక్కువ సమయంలో కొత్త కార్లను రూపొందించడం సాధ్యపడుతుంది. మరో రెండేళ్లకల్లా కొంత ప్రగతిని సాధించాలనేది లక్ష్యం. మారుతీ సుజుకీ ఇండియా బలం ఏ2 విభాగంలోని ఆరు మోడళ్ల కార్లు అనే విషయం తెలిసిందే. అందువల్ల సహజంగానే ఈ విభాగంలోని కార్ల ప్లాట్‌ఫామ్‌ల మీద కొత్త కార్లు అభివృద్ధి చేసేందుకు మాకు ఆసక్తి ఉంటుంది. ఇదే కాకుండా రోహతక్‌లో అధునాతన టెస్ట్ ట్రాక్‌ను నిర్మిస్తున్నాం. ఇది అందుబాటులోకి వస్తే, మా నూతన కార్ల తయారీ ప్రయోగాలు ఇంకా వేగవంతం అవుతాయి.
?ఆ టెస్ట్ ట్రాక్ విశిష్టతలు
గురుగావ్‌కు 80 కిలో మీటర్ల దూరంలోని రోహతక్‌లో 600 ఎకరాల స్థలంలో టెస్ట్ ట్రాక్‌ను రూ.1,000 కోట్ల సొంత నిధులతో నిర్మిస్తున్నాం. దీని పక్కనే వెండార్ల యూనిట్ల కోసం మరో 100 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. ఈ టెస్ట్ ట్రాక్‌లో 7 కి.మీ. హైస్పీడ్ ట్రాక్‌తో పాటు మొత్తం 52 రకాలైన రోడ్లు నిర్మిస్తాం. భారతీయ మార్కెట్ పరిస్థితులకు తోడు దక్షిణాసియా దేశాల్లోని పరిస్థితులకు అనుగుణంగా కార్ల డిజైన్లను పరిశీలిస్తాం.
?బీఎస్-4 నిబంధనలు వచ్చాక మహా నగరాల్లో మారుతీ 800 కారు విక్రయాలు నిలిపివేశారు. మిగతా మోడళ్ల సంగతో
జిప్సీ, ఆల్టోలు తప్పించి మిగతా కార్లన్నీ బీఎస్-4 నిబంధనలకు అనుగుణమైన ఇంజిన్‌లున్నవే. జిప్సీ, ఆల్టో ఇంజిన్‌లనూ ఆధునికీరిస్తున్నాం. ఈ పని రెండు మూడు నెలల్లో పూర్తి అవుతుంది.
?అత్యాధునిక ప్రీమియం కారు మోడల్ కిజాషీని ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. దీన్ని భారతీయ మార్కెట్‌లోకి ఎపుడు తీసుకువస్తారు
ఈ ఏడాది చివర్లో.
?భారత వాహన రంగం 2 మిలియన్ కార్ల వార్షిక అమ్మకాలకు చేరువగా ఉంది. ఈ మైలురాయిని చేరడం ఈ ఏడాది సాధ్యపడుతుందా
సాధ్యపడవచ్చు. మా వరకు స్థిరమైన వృద్ధి ఉంటుంది. మా కంపెనీకి భారత మార్కెట్‌లో ఉన్న 54 శాతం వాటాను కాపాడుకుంటాం.