Wednesday, April 21, 2010

ఖాతాదారులపై నిర్లక్ష్యమేల?

రైతులు, పింఛన్‌దారులకు
అందించే సేవలపై ఓ కమిటీ: ఆర్‌బీఐ గవర్నర్‌
ముంబయి: ఖాతాదారులతో వాణిజ్య బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరుపైనా, అనుమతించిన దాని కన్నా అధిక వడ్డీ రేట్లను వారి వద్ద నుంచి వసూలు చేస్తుండడంపైనా ఆర్‌బీఐ అసంతృప్తిని వ్యక్తంచేసింది. బ్యాంకు కస్టమర్ల సేవలను పెంపొందించడంలో భాగంగా మంగళవారం కొన్ని సూచనలు చేసింది. 'బ్యాంకింగ్‌ అనేది ఒక ప్రత్యేక ప్రజోపయోగ సేవ. ఈ పరిశ్రమలో ఖాతాదారులకు సేవ చేయడానికి ప్రాముఖ్యం రాను రాను పెరిగిపోతోంది..' అని ఆర్‌బీఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ''ముఖ్యంగా కొన్ని రకాల రుణాలు, అడ్వాన్సులపై వడ్డీ రేట్లను భారీగా విధిస్తున్నట్లు ఆర్‌బీఐకి, బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ కార్యాలయాలకు బోలెడు ఫిర్యాదులు వస్తున్నాయ''ని ఆయన చెప్పారు. ఖాతాదారు సమస్యల పరిష్కారానికి బ్యాంకుల్లో వివిధ అంచెల యంత్రాంగం ఉన్నప్పటికీ అవి సమర్థంగా పనిచేస్తున్నాయా అనే విషయం తృప్తిని కలిగించేదిగా లేదన్నారు. ఖాతాదారులతో బ్యాంకుల సమంజసపూర్వకమైన వ్యవహార శైలికి సంబంధించి సుబ్బారావు కొన్ని చర్యలను ప్రతిపాదించారు. వాటిలో.. రిటైల్‌, చిన్న రుణ గ్రహీతలు, పింఛన్‌దారులు, రైతులకు అందించాల్సిన బ్యాంకింగ్‌ సేవలపై ఒక కమిటీ ఏర్పాటు, సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ఎలా పనిచేస్తోందో తెలియజెప్పే ఒక అధ్యయనం, ఫిర్యాదులను శీఘ్ర గతిన పరిష్కరించేందుకు అంతర్జాతీయ స్థాయి అనుభవాల నుంచి నేర్చుకోదగ్గ విషయాలు, ప్రతి ఆరు నెలలకోసారి బ్యాంకు బోర్డులు సమావేశమై సమీక్ష చేపట్టవలసిన అవసరం వంటివి ఉన్నాయి.

మొబైల్‌ పరిజ్ఞానం అండగా సుదూర ప్రాంతాల్లో బ్యాంకింగ్‌
మొబైల్‌ టెలిఫోన్లు విస్తరిస్తున్న తీరును ఆర్థిక సంఘటితం (ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌) లక్ష్య సాధనకు వినియోగించుకోవాలని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. బ్యాంకింగ్‌ సౌకర్యాలను సుదూర ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు చేరవేసేందుకు ఈ మార్గాన్ని (మొబైల్‌ టెలిఫోనీని) అనుసరించాలని వార్షిక ద్రవ్య విధానంలో ప్రస్తావించింది. అలాగే ప్ర్రైవేటు కంపెనీలు, బ్యాంకింగేతర ఫైనాన్స్‌ కంపెనీలకు బ్యాంకింగ్‌ లైసెన్సులను మంజూరు చేయడానికి ఉద్దేశించిన మార్గదర్శక సూత్రాల చర్చాపత్రాన్ని జులై నెలాఖరుకల్లా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.4.57 లక్షల కోట్ల మేరకు ప్రభుత్వం సమీకరించదలచిన అప్పుల (బారోయింగ్స్‌) నిర్వహణ బాధ్యత ఒక పెద్ద సవాలు కానుందని ఆర్‌బీఐ పేర్కొంది.