Monday, April 26, 2010

ఇక చౌకగా చిత్తు

అందుబాటులోకి 35 యూపీ మద్యం
ఎక్సైజ్‌ అధికారుల ఆలోచన
ఆదాయం పెంచడమే లక్ష్యం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
దాయం పెంచుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న మన ఎక్సైజ్‌ అధికారులు 35 యూపీ మద్యంను మళ్లీ అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. దీనివల్ల మొత్తంగా అమ్మకాలు పెరిగి మరింత ఆదాయం సమకూరుతుందనేది వారి ఆలోచన. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయించినా, బెల్టు దుకాణాలు విచ్చలవిడిగా వెలసినా పట్టించుకోని అధికారులు.. ఇప్పుడు ఏకంగా తెరపైకి 35 యూపీ మద్యం ప్రతిపాదనను తేవడం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్డినరీ, మీడియం, ప్రీమియం బ్రాండ్ల మద్యం అమల్లో ఉంది. ఆర్డినరీ బ్రాండ్లను చీప్‌ లిక్కర్‌గా పరిగణిస్తారు. మొత్తం మద్యం విక్రయాల్లో ఆర్డినరీ బ్రాండ్ల అమ్మకాలదే అగ్రస్థానం.ప్రస్తుతం సీసా ఆర్డినరీ మద్యం ధర రూ.46. వ్యాపారులు మాత్రం రూ.55 నుంచి రూ.60 వరకూ అమ్ముతున్నారు. ఈ మద్యంలో 75 శాతం ఆల్కహాలిక్‌ మిశ్రమం ఉంటుంది. మిగిలిన 25 శాతంలో నీరు, ఇతర పదార్థాలు ఉంటాయి. అధికారులు ప్రతిపాదిస్తున్న 35 యూపీ మద్యంలో మాత్రం కేవలం 65 శాతం మాత్రమే ఆల్కహాలిక్‌ మిశ్రమం ఉంటుంది. ధరకూడా కొంత తగ్గొచ్చు. దీనివల్ల మద్యం ధరలు సాధారణ ప్రజలకు మరింతగా అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ధర తగ్గితే అమ్మకాలు పెరిగి ఖజానాకు మరింత ఆదాయం సమకూరుతుందనేది వారి వ్యూహం. తాజా ప్రతిపాదనపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతంలో 35 యూపీ మద్యం అందుబాటులో ఉండేది. ఈ రకం మద్యం అమ్మకాల వల్ల కంపెనీలు, వ్యాపారులు అధికంగా లాభపడ్డారని, పలు అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ప్రభుత్వం దీన్ని రద్దుచేసింది. మద్యం ధరలను తగ్గించేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. చీప్‌ లిక్కర్‌పై 85శాతం మేరకు ఎక్సైజ్‌ డ్యూటీ విధిస్తున్నారు. ప్రభుత్వం 70 శాతం అమ్మకం పన్ను విధిస్తోంది. వీటిని తగ్గిస్తే ధర అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వం పన్నులను తగ్గించేందుకు సిద్ధంగా లేదు. దీంతో 35 యూపీ మద్యాన్ని తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.