Wednesday, April 21, 2010

సమగ్ర విధానంలో ప్రధాన ఎజెండా ద్రవ్యోల్బణం

రిజర్వ్ బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మంగళవారం నాడు ప్రకటించిన 2010-11 వార్షిక ద్రవ్యపరపతి విధానం కాలమానపరిస్థితులకు అనుగుణంగా ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలకు సంబంధించిన దాదాపు అన్ని పార్శ్వాలను కొత్త విధానం పరామర్శించింది. ఆ రకంగా ఈ విధానం సమగ్రతను సంతరించుకున్నదని చెప్పాలి. హోల్‌సేల్ ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం 9.9 శాతంతో రెండంకెల స్థాయిని తాకడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సహజంగానే రిజర్వ్ బ్యాంకు తన దృష్టిని ప్రధానంగా ఈ అంశంపైనే సారించింది.

ఇన్నిరోజుల వరకు ఆహార ఉత్పత్తుల ధరల కారణంగా అంటే సప్లయ్ సైడ్ అవరోధాల కారణంగా పెరుగుతూ వస్తున్న ద్రవ్యోల్బణం ఇప్పుడు డిమాండ్ ఉద్దీపణ కారణంగా పుంజుకుంటున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వినియోగదారుల ధరల సూచిలో పెరుగుదల, పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి ఇందుకు స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నాయి.

ఈ నేపథ్యంలో డిమాండ్‌కు కళ్లెం వేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి ఆర్‌బిఐ ప్రయత్నించింది. సిఆర్ఆర్ 0.25 శాతం పెంచడం వల్ల బ్యాంకింగ్ రంగం నుంచి 12,500 కోట్ల రూపాయలు తగ్గిపోతాయి. రివర్స్ రెపో మరో 0.25 శాతం పెంచడం వల్ల వడ్డీరేట్లు పెరిగి క్రెడిట్ ఆఫ్ టేక్ తగ్గే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం అదుపుతో పాటు నియంత్రణాపరమైన అనేక అంశాలను ఆర్‌బిఐ కొత్త విధానంలో ప్రస్తావించింది.



వడ్డీరేట్లకు సంబంధించి ప్రస్తుతం బ్యాంకులు అనుసరిస్తున్న బిపిఎల్ఆర్ విధానం స్థానంలో బేస్ రేట్ విధానం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్‌బిఐ ప్రకటించింది. దీనివల్ల రుణపరపతికి సంబంధించి బ్యాంకుల విధానంలో పారదర్శకత ఏర్పడుతుంది. ఏడాది పరిమితిలోపు ఎన్‌సిడిల జారీకి జూన్ ఆఖరులోగా మార్గదర్శకాలు జారీ చేయనున్నట్టుగా తెలిపింది. 5, 2 సంవత్సరాల కాలపరిమితి గల వడ్డీరేటు డెరివేటివ్స్ ప్రవేశపెట్టనున్నట్టుగా వెల్లడించింది.

ఇన్‌ఫ్రా కంపెనీలు జారీ చేసే ఏడేళ్ల కాలపరిమితి గల నాన్ ఎస్ఎల్ఆర్ బాండ్స్‌ను బ్యాంకులు ఇకపై హెల్డ్ టు మెచ్యూరిటి విభాగంలో వర్గీకరించే వెసులుబాటును కల్పించింది. ఈ చర్యలు బాండ్ల మార్కెట్ విస్త­ృతికి దోహదం చేసే అవకాశం ఉంది. చిన్న పరిశ్రమలకు సంబంధించి కూడా ఆర్‌బిఐ కొత్త విధానం ప్రశంసనీయమైన చర్యలు తీసుకున్నది. పది లక్షల రూపాయల రుణాల వరకు పూచీ లేకుండానే తీసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రతి బ్యాంకు కూడా ఇకపై ఎస్ఎంఇ విభాగంలో 20 శాతం పరపతి వృద్ధిని చూపించాల్సి ఉంటుంది.

సమ్మిళిత వృద్ధిలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలను భాగస్వామ్యం చేసేందుకు ప్రత్యేక కమిటీని వేయాలని నిర్ణయించారు. 2000 జనాభా ఉన్న ప్రతిగ్రామానికి విధిగాబ్యాంకింగ్ సేవలను అందించాలని సూచించారు. అర్బన్ సహకార బ్యాంకులకు మళ్లీ లైసెన్స్‌లు ఇచ్చే దిశగా విధివిధానాలు కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. సమర్ధంగా నడిచే అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకులు ఆఫ్ సైట్ ఎటిఎంలను ఏర్పాటు చేసుకోవడానికి స్వేచ్ఛనిచ్చారు. అదేవిధంగా ఇన్‌ఫ్రా రంగానికి ప్రభుత్వం చెల్లించే యాన్యుటీని సెక్యూరిటీగా స్వీకరించేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది.

ఇన్‌ఫ్రా రంగానికి పరిపతికి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఎన్‌పిఎ ప్రొవిజనింగ్ నిబంధనను 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. 2011 ఏప్రిల్ ఒకటి నుంచి ఐఎఫ్ఆర్ఎస్ సంబంధించి బ్యాంకింగ్ రంగంలో తలత్తే పర్యవసానాలను అధ్యయనం చేయడానికి కమిటీని వేయాలని నిర్ణయించడం హర్షణీయం. లీడ్ బ్యాంకు స్కీమ్‌పై అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

రుణ గ్రహీతల వ్యాపారాలను స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి సెక్యూరిటైజేషన్ కంపెనీలకు ఏప్రిల్‌లోగా మార్గదర్శకాలను విడుదల చేస్తారు. సెక్యూరిటైజెషన్ కంపెనీల స్వాధీనంలో ఆస్తులను ఎన్‌పిఎలుగా పరిగణించడానికి గడువును అయిదు నుంచి ఎనిమిదేళ్లకు పొడగించారు.కొత్త బ్యాంకింగ్ లైసెన్స్‌ల జారీకి సంబంధించిన చర్చాపత్రాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దేశంలో బ్యాంకింగ్ సంస్థలు భిన్నరంగాల్లోకి విస్తరిస్తున్న నేపథ్యంలో హోల్డింగ్ కంపెనీల ఏర్పాటు దిశగా తగిన సిఫారసుల కోసం వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

విదేశీ బ్యాంకులు పూర్తి స్థాయి అనుబంధ సంస్థ ద్వారా ఆపరేట్ చేయాలా లేక బ్రాంచ్ నెట్‌వర్క్ ద్వారానా అన్న విషయం తెల్చేందుకు సెప్టెంబర్‌కల్లా చర్చా పత్రాన్ని ఉంచుతారు. సందర్భాన్ని బట్టి కాకుండా ఒకే సారి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్స్‌కు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్రంగా దృష్టి సారించిన కారణంగా దువ్వూరి ప్రకటించిన విధానం పరిపూర్ణతను సంతరించుకున్నది.