Thursday, April 29, 2010

అణువిద్యుత్‌కు ఐటి సహకారం

యుఎస్ కంపెనీతో ఇన్ఫోటెక్ ఒప్పందం

హైదరాబాద్ (బిజినెస్ బ్యూరో): ఇంజనీరింగ్ సేవల దిగ్గజం ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్ అణు ఇంజనీరింగ్ కార్యకలాపాల్లో సేవలు అందించడానికి అమెరికా కంపెనీ వెస్టింగ్‌హౌజ్ ఎలక్ట్రిక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ దిశగా యుఎస్ కంపెనీతో సమగ్రమైన ఒప్పందం కుదిరినట్లు ఇన్ఫోటెక్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ ఒప్పందంలో భాగంగా వెస్టింగ్ హౌజ్‌కు అంతర్జాతీయంగా ఉన్న వనరులను క్రోడీకరించి అణు విద్యుత్ వ్యాపారంలో మెరుగైన వృద్ధిని సాధించడానికి అవసరమైన సొల్యూషన్లను ఇన్ఫోటెక్ అందిస్తుంది. అలాగే ఇండియాలో వెస్టింగ్‌హౌజ్ నిర్మిస్తున్న అణు విద్యుత్ ప్లాంట్ కార్యకలాపాలకు సహకారం అందించనున్నట్లు ఇన్ఫోటెక్ తెలిపింది.

ఈ ఒప్పందం కంపెనీ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని, భారతీయ మార్కెట్లకు ప్రాధాన్యమిస్తున్నామనడానికి ఈ ఒప్పందమే నిదర్శనమని వెస్టింగ్ హౌజ్ ప్రెసిడెంట్, సిఇఒ ఆరిస్ కాండ్రిస్ వ్యాఖ్యానించారు.

అణు విద్యుత్ వెస్టింగ్‌హౌజ్ ఎలక్ట్రిక్ కంపెనీ తొషిబా కార్పొరేషన్ గ్రూప్ కంపెనీ. అణు విద్యుత్ ప్లాంట్లకు ప్రొడక్టులు, టెక్నాలజీలను కంపెనీ అందిస్తోందని ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రకటనలో వివరించింది.