Wednesday, April 21, 2010

ఎయిర్‌టెల్‌ సముద్రగర్భ కేబుల్‌

8 దేశాలను కలుపుతూ 12,091 కి.మీ. నిర్మాణం
కేంద్ర ప్రభుత్వ అంగీకారం
న్యూఢిల్లీ: భవిష్యత్తు అవసరాలు, బ్రాండ్‌బ్యాండ్‌లో అత్యధిక బ్యాండ్‌విడ్త్‌ కల్పించేలా 8 దేశాలను కలుపుతూ సముద్రం అడుగున ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ ఏర్పాటు చేయాలన్న భారతీ ఎయిర్‌టెల్‌ ఆకాంక్ష నెరవేరే మార్గం సుగమం అయ్యింది. తీర ప్రాంత నిబంధనల మండలికి సంబంధించిన ఆమోదాలను నిపుణులతో కూడా ఆమోదిత సంఘం ఇచ్చినట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఫ్రాన్స్‌లోని మార్సిలెస్‌ నుంచి కాటానియా (ఇటలీ), ట్రిపోలి (లెబనాన్‌), అలెగ్జాండ్రియా - సుజ్‌ (ఈజిప్ట్‌), జెడ్డా (సౌదీ అరేబియా), ఫూజైరా (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌), కరాచీ (పాకిస్థాన్‌) మీదుగా ముంబయిలోని జుహు బీచ్‌ వరకు 12,091 కిలోమీటర్ల పొడవునా సముద్రగర్భ కేబుల్‌ ఏర్పాటు చేయాలని ఎయిర్‌టెల్‌ ప్రతిపాదించింది. 8 దేశాల్లోని 9 అగ్రశ్రేణి టెలికం సంస్థల సహవ్యవస్థ పాలుపంచుకునే ఈ నెట్‌వర్క్‌లో 9 టెర్మినల్‌ స్టేషన్లుంటాయి.

ఈ పనుల్లో భాగంగా బీచ్‌ వినియోగంలో, ఫైబర్‌ ఆప్టికల్‌ కేబుల్‌ నిర్మాణంలో ఎటువంటి మార్పు ఉండకూడదని కేంద్ర సంఘం ఆదేశించింది. సముద్రం బయట కేబుల్‌ నిర్మాణ పనులకు కేవలం 4 రోజులు కేటాయించారు. కేబుల్‌ దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎయిర్‌టెల్‌కు సూచించారు.