Monday, April 26, 2010

ఇఐడి ఫ్యారీ చేతికి జిఎంఆర్ ఇండస్ట్రీస్

హైదరాబాద్(బిజినెస్ బ్యూరో): హైదరాబాదీ ఇన్‌ఫ్రా దిగ్గజం జిఎంఆర్ గ్రూప్ కంపెనీ జిఎంఆర్ ఇండస్ట్రీస్‌లో మెజారిటీ వాటాను తమిళనాడుకు చెందిన ప్రముఖ చక్కెర కంపెనీ ఇఐడి ప్యారీ చేజిక్కించుకుంది. మురుగప్ప గ్రూప్ సంస్థ అయిన ఇఐడి ప్యారీకి 65 శాతం వాటాలను విక్రయించాలని నిర్ణయించినట్లు జిఎంఆర్ గ్రూప్ ప్రకటించింది.

ఇన్‌ఫ్రా రంగంపైనే దృష్టి కేంద్రీకరించి ఇతర వ్యాపారాల నుంచి వైదొలగాలని జిఎంఆర్ గ్రూప్ ఇంతకుముందే నిర్ణయించుకుంది. ఈ వ్యూహంలో భాగంగానే జిఎంఆర్ ఇండస్ట్రీస్‌ను వదులుకోవడానికి ఇష్టపడినట్లు తెలుస్తోంది. చెన్నైలో కుదిరిన ఈ ఒప్పందంపై మురుగప్ప గ్రూప్ తరఫున ఇఐడి ప్యారీ చైర్మన్ ఎ వెల్లాయన్, జిఎంఆర్ హోల్డింగ్స్ తరఫున కె బాలసుబ్రహ్మణ్యం సంతకాలు చేశారు.

దేశీయ చక్కెర పరిశ్రమలో ఖ్యాతి గడించిన ఇఐడి ప్యారీ బయో పెస్టిసైడ్స్, సూక్ష్మ పోషకాల వ్యాపారాన్ని సైతం నిర్వహిస్తోంది. జిఎంఆర్ ఇండస్ట్రీస్‌కు ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటక రాష్ట్రాల్లో మూడు ఇంటిగ్రేటెడ్ చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. ఈ రెండు ప్లాంట్ల చెరుకు క్రషింగ్ వార్షిక సామర్థ్యం 11 వేల టిసిడిలు. అలాగే 46 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్, 95 కెఎల్‌పిడి డిస్టిలరీ సామర్థ్యం కంపెనీకి ఉంది.

ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో కంపెనీ షేరు 111.90 రూపాయల వద్ద కోట్ అవుతోంది. ఈ లెక్కన జిఎంఆర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 223 కోట్లు. ఇందులో 65 వాటాల విలువ 145 కోట్లు ఉండవచ్చు. మార్కెట్ రెగ్యులేటర్ సెబి టేకోవర్ మార్గదర్శకాల ప్రకారం ఓపెన్ మార్కెట్ నుంచి 20 శాతం వాటాలను ఇఐడి ప్యారీ కొనుగోలు చేయాల్సివుంటుంది.

ఓపెన్ ఆఫర్ తర్వాత జిఎంఆర్ ఇండస్ట్రీస్‌లో జిఎంఆర్ గ్రూప్ పాత్ర నామమాత్రమవుతుంది. దేశంలో ప్రముఖ చక్కెర కంపెనీల్లో ఇఐడి ప్యారీ ఒకటని, ఈ డీల్ ద్వారా సంస్థ షేర్‌హోల్డర్లు, రైతులు, ఉద్యోగులు ప్రయోజనం పొందుతారని తాము విశ్వసిస్తున్నట్లు జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లిఖార్జున రావు వ్యాఖ్యానించారు. జిఎంఆర్ ఇండస్ట్రీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా దక్షిణాది చక్కెర మార్కెట్‌లో తమ స్థానం పటిష్టమవుతుందని ఇఐడి ప్యారీ చైర్మన్ వెల్లాయన్ అభిప్రాయపడ్డారు.

అసలు విషయమేంటీ ?
దక్షిణ భారత దేశంలో జిఎంఆర్ అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. రహదారుల నిర్మాణం దగ్గరి నుంచి విద్యుదుత్పత్తి వరకూ.. చక్కెర ఫ్యాక్టరీల దగ్గరి నుంచి డిస్టిలరీల వరకు.. ఈ గ్రూప్ చేయని వ్యాపారం లేదు. న్యూఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లోనే గాకుండా విదేశాల్లోనూ విమానాశ్రయాలను నిర్మించిన ఘనత జిఎంఆర్‌కు ఉంది.

ఈస్థాయిలో విజయాలను సొంతం చేసుకున్న జిఎంఆర్ గ్రూప్ తన కార్యకలాపాలను ఇన్‌ఫ్రా రంగానికే పరిమితం చేసుకోవాలన్న ఆలోచన మొదలైంది. ప్రస్తుతం ఈ విభాగంలోనే గ్రూప్ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్‌నేమ్ సైతం ఇన్‌ఫ్రా రంగం నుంచే లభించింది. అందుకే ఎయిర్‌పోర్టులు, విద్యుదుత్పత్తి, రహదారుల నిర్మాణం, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దృష్టి కేంద్రీకరించింది.

అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ప్రారంభించింది. దీర్ఘకాలంలో భారీ లాభాలను సంపాదించిపెట్టే ఇన్‌ఫ్రా రంగంలో వీలైన మేరకు సొంత నిధులను ఇన్వెస్ట్ చేయాలనేది కంపెనీ వ్యూహం. దేశీయ ఇన్‌ఫ్రా దిగ్గజంగా ఖ్యాతి గడించాలనేది జిఎంఆర్ తాపత్రయం. దీనిలో భాగంగానే జిఎంఆర్ ఇండస్ట్రీస్ విక్రయం జరిగిందని ఎనలిస్టులు అంటున్నారు.