Wednesday, April 21, 2010

ఐస్‌లాండ్‌ ఉత్పాతం


వివిధ పరిశ్రమలపై ప్రభావం
ఎగుమతులకు అవరోధం
దీర్ఘకాలం కొనసాగితే కుదేలే
ఐస్‌లాండ్‌ ఉత్పాతం
ఐరోపాలోని ఐస్‌లాండ్‌ వద్ద ఐజాఫియాలాజోకుల్‌ అగ్నిపర్వతం బద్దలైంది. ఇది జరిగి కొన్ని రోజులే అయింది. దీని నుంచి వెలువడ్డ పొగ, రాతి ధూళి, సీసం, సల్ఫర్‌డయాక్సైడ్‌తో కూడిన మేఘాలు ఐరోపా దేశాలన్నింటిపైనా కమ్ముకుంటున్నాయి. బద్దలైన అగ్నిపర్వతం క్రమేణా ఆయా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపడం మొదలెట్టింది. ధూళి దెబ్బకు కొన్నివేల విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఫలితంగా విమానాలతో ముడిపడ్డ పలు పరిశ్రమలుపై ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడుతోంది.
ఇప్పుడిప్పుడే ఆర్థిక మాంద్యం నుంచి కోలుకుంటున్న ఐరోపాకు ఇది పులి మీద పుట్రే. ఇక పర్యాటకానికి మంచి సీజను కావడంతో భారత విమానయాన సంస్థలు లాభాలు పొందాలనుకుంటున్న ప్రయత్నాలకు ఇది గండి కొడుతోంది. మరో పక్క ఎగుమతులపై ప్రధానంగా ఆధారపడ్డ దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల ఆర్థిక వ్యవస్థలనూ ఇది కుదేలు చేస్తోంది. ఈ అగ్నిపర్వత ప్రభావం ఇలా కొనసాగితే మరో మాంద్యం తలెత్తుతుందేమో!
రోజుకు రూ.910 కోట్ల నష్టం
కాశంలో విస్తరిస్తున్న ఈ బూడిద మొదటగా ప్రభావం చూపుతోంది విమానయాన సంస్థలపైనే. సెప్టెంబరు 11 దాడుల తర్వాత ఆ స్థాయిలో అవి మళ్లీ ఇప్పుడే ఆందోళన చెందుతున్నాయి. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌(ఐఏటీఏ) అంచనాల ప్రకారం అన్ని విమానయాన సంస్థలు కలిపి సగటున రోజుకు 13 కోట్ల పౌండ్లు(దాదాపు రూ.910 కోట్లు) నష్టపోతున్నాయ్‌. ఒకవేళ ప్రస్తుత పరిస్థితి కొనసాగితే ఈ మొత్తం నష్టాలు బిలియన్ల కొద్దీ ఉండొచ్చని అంచనా. ఐరోపాలో 28,000 విమానాలు నడుస్తుండగా... వాటి సంఖ్య 11,000కు పరిమితమైంది. ఇక ట్రావెల్‌ ఏజెన్సీలూ భారీగానే నష్టపోయిన్నాయి. ఫస్ట్‌ఛాయిస్‌, థామస్‌కుక్‌ల యాజమాన్య సంస్థ, ఐరోపాలోనే అతిపెద్ద ట్రావెల్‌ ఆపరేటరైన టీయూఐ రోజుకు 5-6 మిలియన్‌ పౌండ్లు(రూ.35-42 కోట్లు)నష్టపోతోంది. సమస్య చాలా తీవ్రతరమైనదనీ.. విమానయాన సంస్థలకు ఆర్థిక సహాయం చేసే విషయమై ఆలోచిస్తామనీ స్వయానా బ్రిటన్‌ ప్రధాని గార్డన్‌ బ్రౌన్‌ పేర్కొనడం గమనార్హం.

భారత్‌పై
యిరిండియా, జెట్‌ఎయిర్‌వేస్‌, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లు నాలుగు రోజుల్లో 50 విమానాలను రద్దు చేసుకున్నాయి. ప్రస్తుత వేసవి కాలం టూరిస్టులకు మంచి సీజను. ఈ సమయంలో పర్యటకుల ద్వారా ఎక్కువ లాభాలు పొందాలనుకుంటున్న భారత కంపెనీలకు ఈ ఘటన నిరాశ కలిగించేదే.

పర్యాటకానికి రూ.45,000 కోట్ల చిల్లు!
ప్రపంచ జీడీపీలో 5 శాతం వాటా ప్రయాణం, పర్యాటకానిదే. అందులోనూ ఐరోపా వేసవి పర్యాటకానికి పెట్టింది పేరు కాబట్టి వారానికి కనీసం రూ.22,500-45,000 కోట్ల(5-10 బిలియన్‌ డాలర్లు) మేర నష్టం వాటిల్లుతుందని అంచనా. ఇక ఇప్పటికే సంక్షోభం బారిన పడ్డ గ్రీస్‌ దేశం ఎక్కువగా ఆధారపడుతోంది పర్యాటకంపైనే. ఈ పరిస్థితుల్లో ఈ దేశానికి ఇది గొడ్డలిపెట్టే.

ఆఫ్రికా ద.అమెరికా పైనా..
విమాన రవాణా ఆపరేటర్లు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. మేఘాలు కమ్ముకోని దక్షిణ ఐరోపా విమానాశ్రయాల వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే అసలు సమస్యంతా ఆహార, పువ్వుల వంటి త్వరగా పాడయ్యే వస్తువులతోనే. ఆఫ్రికా, కరేబియన్‌ దేశాల నుంచి వచ్చే ఈ తరహా ఎగుమతులు ఎక్కువగా నష్టపోతున్నాయి. కెన్యా రైతులు ఐరోపాకు పంపాల్సిన ఆహార, పుష్పాల నిల్వలను సముద్రంలో బలవంతంగా ముంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక కెన్యా పత్రిక ప్రకారం రోజుకు 3.8 మిలియన్‌ డాలర్లను ఆ దేశం నష్టపోతోంది. ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి దేశాల్లోని వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థలదీ ఇదే దారి. మరో పక్క జస్ట్‌-ఇన్‌-టైమ్‌(చెప్పిన సమయానికే డెలివరీ) కార్యకలాపాలు ఎక్కువగా చేసే ఆపరేటర్లపైనా ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. సరకు డెలివరీ చేయలేక అందుకు తగ్గ ప్రతిఫలం ముట్టకపోగా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఫెడెక్స్‌, డీహెచ్‌ఎల్‌, టీఎన్‌టీ వంటి ప్రధాన కొరియర్‌ కంపెనీలు తమ సేవల్లో అంతరాయం ఏర్పడుతోందని.. తద్వారా నష్టపోతున్నామని చెబుతున్నాయి. విమాన రవాణాపై ఎక్కువగా ఆధారపడే ఫార్మా కంపెనీలకూ ఇది కష్ట సమయమే. ప్రస్తుతానికి ఎలాంటి మందుల కొరతా లేదని అవి చెబుతున్నా.. నెలల పాటు కొనసాగితే ఐరోపా ఫార్మా రంగం కుదేలయ్యే ప్రమాదం ఉంది.

వృద్ధికి విఘాతం
స్వల్పకాలానికి మొత్తం మీద ఆర్థిక వ్యవస్థపై ఈ ధవళనీడల ప్రభావం చాలా తక్కువే ఉండొచ్చని అంచనా. అయితే ఇప్పుడిప్పుడే మాంద్యం నుంచి బయటకొస్తున్న ఐరోపా దేశాల్లో ఈ పరిస్థితి కొనసాగితే 1-2 శాతం మేర వృద్ధి క్షీణించే అవకాశాలను కొట్టిపారేయలేం. అంటే చాలావరకు ఐరోపా దేశాలు ఈ ఏడాది ఎటువంటి వృద్ధినీ నమోదు చేయవన్నమాట. అయితే సమస్య ఎన్ని రోజులుంటుందన్న విషయం ఎవరికీ తెలియడం లేదు. భూగర్భ శాస్త్రవేత్తలతో సహా!!!!!