
ద్రవ్య పరపతి విధానంలో వివిధ రంగాలకు రుణ వితరణ పెంచే దిశలో పలు నిర్ణయాలను ప్రకటించారు. మౌలికానికి పెద్ద పీట వేసి వాటికి మరింత రుణ సాయాన్ని అందించేందుకు బాట పరిచారు. ఫైనాన్షియల్ మార్కెట్లను మరింత విస్తృతపరిచే చొరవ తీసుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్యకలాపాలను నిర్వహించే వాతావరణాన్ని సృష్టించేందుకు యత్నించారు. ఈసారి ద్రవ్య విధానం దాదాపు అన్ని వర్గాలకు మెప్పించే దిశలో కొనసాగిందని చెప్పుకోవచ్చు.
ఖాతాదారులకు మెరుగైన సేవల కోసం
ఖాతాదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలను అందిస్తూ వారి సమస్యలను సకాలంలో పరిష్కరించే దిశలో గతంలో ఆర్‌బీఐ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. కొన్ని బ్యాంకులు రుణాలపై అధిక వడ్డీ వసూలు చేయడంతో పాటు ఇతరత్రా అనేక సేవలపై అధిక రుసుములు వసూలు చేస్తున్నాయి. చిన్న, సాధారణ ఖాతాదారుల సమస్యలను బ్యాంకులు పెద్దగా పట్టించుకోవడం లేదన్నదీ వాస్తవమే. ఈ నేపథ్యంలో చిన్నతరహా ఖాతాదారులు, పింఛనుదార్లు, రుణ గ్రహీతలు, రైతుల సమస్యల పరిష్కారానికి బ్యాంకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆర్‌బీఐ సూచించింది. అంతేకాక సరికొత్త మార్గదర్శకాలను రూపొందించేందుకు ఓ కమిటీని నియమించాలని నిర్ణయించింది.
ఎంఎస్‌ఎంఈలకు మరింత వూతం
లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) బ్యాంకు రుణాలు మరింత సులభంగా అందాలన్న లక్ష్యంతో ఆర్‌బీఐ ఈ రంగానికి సంబంధించిన రుణ విధానంలో కొన్ని మార్పులు చేసింది. ఇప్పటివరకూ ఈ రంగానికి రూ.5 లక్షల వరకు ఇచ్చే రుణాలకు ఎటువంటి పూచీకత్తు అవసరం లేదు. ఈ పరిమితిని రూ.10లక్షలకు పెంచడంతో పాటు ఎంఎస్‌ఎంఈలకు రుణాలనిచ్చే సమయంలో బ్యాంకులు గతంలో రుణవితరణ పెంచే దిశలో 'టాస్క్‌ఫోర్స్' చేసిన సిఫార్సులను దృష్టిలో పెట్టుకోవాలని కూడా ఆర్‌బీఐ సూచించింది. ఎంఎస్‌ఎంఈలకు బ్యాంకులు సరళంగా తక్కువ వడ్డీకే రుణాలు అందించేందుకు గతంలో పలు చర్యలు చేపట్టింది. పలు మార్గదర్శకాలను జారీ చేసింది. పలు కమిటీలను నియమించింది. తత్ఫలితంగా ఈ రంగానికి బ్యాంకు రుణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎంఎస్‌ఎంఈ రంగానికిచ్చే బ్యాంకు రుణాలు ప్రతి ఏటా 20% దాకా వృద్ధి చెందాలన్నది 'టాస్క్‌ఫోర్స్' సిఫార్సుల్లో ఒకటి. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఈ రంగానికి సరళ నిబంధనలతో రుణాలనందించడమే కాక రుణవితరణలో నిర్దేశిత లక్ష్యాలను చేరవలసిన అవసరం ఉంది. నిజానికి 2009-10లో కొన్ని ప్రముఖ వాణిజ్య బ్యాంకులు ఈ రంగానికిచ్చిన రుణాలు 20% కంటే అధికంగా వృద్ధి చెందాయి. ఆర్‌బీఐ తాజా సూచనలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రంగానికి రుణ సాయాన్ని బ్యాంకులు మరింత పెంచేందుకు దోహదం చేస్తాయి.
ఆర్థిక సంఘటిత లక్ష్యాలు సాధించేందుకు..
బ్యాంకులు ఆర్థిక సంఘటిత లక్ష్యాలను సాధించేందుకూ కీలక నిర్ణయాలను తీసుకుంది. ఆర్థిక సంఘటిత (ఫైనాన్షియల్ ఇంక్లూజన్) లక్ష్యాలను సాధించేందుకు గ్రామీణ సహకార బ్యాంకులు, ఇతరత్రా సంఘాలను కూడా భాగస్వాములుగా చేసే దిశలో చర్యలు ప్రారంభించింది. బ్యాంకులు ఆర్థిక సంఘటితం లక్ష్యాలను చేరేందుకు అవసరమైన వ్యాపార ప్రతినిధులను (బిజినెస్ కరస్పాండెంట్స్-బీసీ) నియమించే విధానంలో మరింత వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం నిర్దేశిత వ్యక్తులు, సంస్థలను మాత్రమే బీసీలుగా నియమించాల్సి ఉంది. తాజా నిబంధనల ప్రకారం బ్యాంకులు వాటి సాధ్యాసాధ్యాలకు అనుగుణంగా ఏ వ్యక్తులనైనా, సంస్థలనైనా బీసీలుగా నియమించుకోవచ్చు.
మరిన్ని బ్యాంకులకు చోటు
కొత్త ప్రైవేటు బ్యాంకుల లైసెన్సింగ్ విధానాన్ని రూపొందించే దిశలో ఆర్‌బీఐ అడుగులు వేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా దేశీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రైవేటు బ్యాంకుల లైసెన్సింగ్ విధాన ముసాయిదాను వచ్చే జులై నాటికి సిద్ధంచేసే ప్రయత్నాలు చేస్తోంది. అదేవిధంగా మరిన్ని విదేశీ బ్యాంకుల ప్రవేశానికి అనువైన వాతావరణాన్ని కల్పించే దిశలో త్వరలో మార్గదర్శకాలను రూపొందించనుంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా వచ్చే సెప్టెంబర్ నాటికి విదేశీ బ్యాంకుల విధి విధానాలపై నిర్ధిష్టమైన మార్గదర్శకాలను రూపొందించే దిశలో ఆర్‌బీఐ మరో ముందడుగు వేసింది. కొత్తగా పట్టణ సహకార బ్యాంకులకు లైసెన్సులు మంజూరు చేసే అంశాన్ని పరిశీలించి తగు విధి విధానాలను రూపొందించేందుకు ఓ కమిటీని నియమించింది.