Monday, April 26, 2010

రిలయన్స్‌కు 4,710 కోట్ల లాభం

30 శాతం వృద్ధి
అంచనాలతో పోలిస్తే తక్కువ..
ఇక ముందు పెరగొచ్చు: విశ్లేషకులు
రూ.2లక్షల కోట్లు మించిన ఆదాయం
''కంపెనీకి మరింత విలువను సంతరించడం కోసం భారత దేశం లోపల, వెలుపల వృద్ధి అవకాశాలను వెతికే కృషిని కొనసాగిస్తూనే ఉంటాం''.
- (ఒక ప్రకటనలో) రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీ
ముంబయి: ఇంధన రంగ దిగ్గజమైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) గత ఆర్థిక సంవత్సరం 2009-10 నాలుగో త్రైమాసికానికి లాభంలో 30 శాతం వృద్ధిని కనబరచింది. జనవరి- మార్చి మధ్య కాలంలో రూ.4,710 కోట్ల నికర లాభాన్ని ఈ సంస్థ ఆర్జించింది. అంత క్రితం సంవత్సరమైన 2008-09 జనవరి- మార్చి మధ్య కంపెనీ నికర లాభం రూ.3,955 కోట్లు ఉన్నట్లు ఆర్‌ఐఎల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక్క నాలుగో త్రైమాసిక (స్టాండలోన్‌) ఆదాయం అంత క్రితం సంవత్సరంలోని ఇదే కాలంతో పోలిస్తే రెండింతల కన్నా ఎక్కువగా రూ.26,793 కోట్ల నుంచి రూ.60,267 కోట్లకు చేరింది. అయినప్పటికీ అంచనాలతో పోలిస్తే ఇది తక్కువగానే కనపడుతుండటం గమనార్హం. దేశ తూర్పు కోస్తా తీరంలోని కృష్ణా- గోదావరి (కేజీ) బేసిన్‌లో నుంచి అధిక గ్యాస్‌ ఉత్పత్తిని కంపెనీ సాధిస్తున్నా, ఆ ఘనతను చమురు శుద్ధి వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లభించని మార్జిన్‌లు (లాభాలు) తక్కువ చేసేశాయి. చమురు రిఫైనింగ్‌ వ్యాపారంలో మార్జిన్‌ గత త్రైమాసికంలో పీపా ఒక్కింటికి 7.5 డాలర్లుగా (రూ.330) లెక్క తేలింది. మార్కెట్‌ పరిశీలక వర్గాలు మాత్రం ఇది 8.3 డాలర్లుగా (రూ.365.20) ఉండవచ్చని తలపోశాయి. కిందటి ఏడాది కంపెనీలోకి విలీనం చేసుకున్న రిలయన్స్‌ పెట్రోలియమ్‌ గణాంకాలను కూడా కలిపి గణాంకాలను సవరించి ప్రకటించారు.

ప్రతి ఈక్విటీ షేరుకు రూ.7 డివిడెండ్‌
ఇక పూర్తి సంవత్సరానికి కంపెనీ నికర లాభం రూ.16,236 కోట్లు, మొత్తం ఆదాయం రూ.2,00,400 కోట్లు ఉంది. వార్షిక లాభంలో వృద్ధి 6 శాతం, మొత్తం ఆదాయంలో వృద్ధి 37 శాతం నమోదు అయ్యాయి. పది రూపాయల విలువైన ఈక్విటీ షేర్‌కు రూ.7 డివిడెండ్‌ను ప్రకటించారు.

అయితే విశ్లేషకులు మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకొనే కొద్దీ సంస్థ మార్జిన్‌లు ఎగబాకగలవని భావిస్తున్నారు. రిలయన్స్‌ బంగాళాఖాతంలో కేజీ బేసిన్‌లో ఉన్న తన డీ6 క్షేత్రంలో రోజుకు 80 మిలియన్‌ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంఎంఎస్‌సీఎండీ) సహజ వాయువు గరిష్ఠ స్థాయి ఉత్పత్తిని ఇంకా చేరలేకపోతోంది. అయితే ఖాతాదారు సంస్థలు వాటికి జరిగిన కేటాయింపుల మేరకు గ్యాస్‌ను కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం, గొట్టపు మార్గాల కొరత ఇందుకు కారణమైనట్లు తెలుస్తోంది. కానీ, ప్రస్తుతం ఈ క్షేత్రం నుంచి ఉత్పత్తి అవుతున్న 69 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ కూడా కంపెనీ ఫలితాలకు ఉత్తేజాన్ని ఇచ్చేదిగానే పరిగణించాలని మార్కెట్‌ పండితులు అంటున్నారు.

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ విదేశాల్లో కీలక కంపెనీల కొనుగోళ్ల కోసం అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎంతవరకు పురోగతి సాధిస్తారన్న అంశంపైనే కంపెనీ భావి దృక్పథం ఆధారపడి ఉంది. అమెరికాలో విస్తారమైన సహజ వాయువు నిక్షేపాలు ఉన్న ప్రాంతాల్లో ఒకచోట అట్లాస్‌ ఎనర్జీతో కలసి సంయుక్త సంస్థను ఏర్పాటు చేసేందుకు 1.7 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.7,480 కోట్ల)ను పెట్టుబడిగా చెల్లించనున్నట్లు ఆర్‌ఐఎల్‌ ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే.రిలయన్స్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌)కు, ఆర్‌ఐఎల్‌కు మధ్య కొనసాగుతున్న న్యాయ పోరాటం తుది ఫలితం ఎలా ఉండబోతుందన్నది కూడా ఆర్‌ఐఎల్‌ బిజినెస్‌ అవుట్‌లుక్‌పై ప్రభావాన్ని చూపగలుగుతుంది. శుక్రవారం బీఎస్‌ఈలో ఆర్‌ఐఎల్‌ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ.11.80ఎగసి, రూ.1,087.35 వద్ద స్థిరపడింది.