50 దాటిన తయారీ కంపెనీలు

డ్యూయల్ సిమ్.. ట్రిపుల్ సిమ్.. 3జీ.. టచ్ స్క్రీన్.. ఇంటర్నెట్ బ్రౌజింగ్, టీవీ ఛానల్స్ వీక్షణం.. సోషల్ నెట్‌వర్కింగ్.. ఎఫ్‌ఎం రేడియో.. ఎంపీ3.. స్టీరియో హెడ్‌సెట్.. 12 మెగా పిక్సెల్స్ కెమెరా.. వీడియో రికార్డింగ్.. 32 జీబీ వరకు మెమొరీ విస్తరణ సదుపాయం.. 3 గంటల టాక్‌టైమ్.. మరో 150 గంటల స్టాండ్‌బై టైం.. వంటి మరెన్నో ఫ్యాన్సీ ఫీచర్లు పొందుపరచిన అధునాతన ఫోన్లను విడుదల చేయడంలో ఉత్పత్తిదారులు పోటీపడుతున్నారు. ప్రధానంగా విద్యార్థులు, యువ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకునే ఉత్పత్తులు రూపొందిస్తున్నారు. 3జీతో వీడియో కాన్ఫరెన్స్ (బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ కలిగిన వారికి) సేవలు అందుబాటులోకి రావడం.. ఇందుకనువైన మొబైల్స్ రూ.5000 ధరలోనూ లభ్యం కావడంతో వాడుతున్న మొబైల్ మార్చుకుని కొత్తది కొనుగోలు చేసే వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది.
దేశంలోని 115 కోట్ల మంది ప్రజల్లో 55 కోట్ల మందికి మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. గత డిసెంబరుతో ముగిసిన ఆర్థిక త్రైమాసికంలోనే కొత్తగా 5.3 కోట్ల మంది టెలికం వినియోగదారులయ్యారు. వీరిలో మూడో వంతు గ్రామీణులే. 1995 జులై 31న దేశంలో మొబైల్ సేవలు ఆరంభమైనా, అయిదేళ్లు గడిచాకే కాస్త ప్రాచుర్యం లభించింది. అనంతరం దశాబ్దకాలంలోనే ఇంతలా ప్రజా జీవనంలో మమేకమైన పరికరం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. కనెక్షన్లకు మరికొన్ని రెట్ల మేర సెల్‌ఫోన్ హ్యాండ్‌సెట్ల విక్రయాలు సాగుతున్నాయి. మొబైల్ హ్యాండ్‌సెట్ల మార్కెట్ దేశంలో రూ.50,000 కోట్లకు చేరిందని అంచనా. వాడి పారేస్తున్న మొబైల్స్ పునర్వినియోగం సరిగా లేనందున ఏటా 5,000 టన్నుల ఇ-వ్యర్థాలు పోగు బడుతున్నాయంటే కొత్తవి ఎంతమేర కొనుగోలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
దేశంలో మొబైల్ కనెక్షన్లు కలిగిన వారు 45% మంది అని ఐక్యరాజ్య సమితి అధ్యయనంలోనే తేలింది. 2000-01లో ప్రతి 100 మందికి 0.35 మాత్రమే ఉన్న సెల్‌ఫోన్లు, రాకెట్ వేగంతో దూసుకెళ్లి ప్రస్తుతం 45కు చేరాయి.
*విద్యుత్తు రంగంలో ప్రసిద్ధమైన ల్యూమినస్ కంపెనీ విన్ టెలికం పేరిట డ్యూయల్ సిమ్ ఫోన్లు 7 మోడళ్లను విడుదల చేసింది. వీటి విలువ రూ.5,000 లోపే.
*ఆలివ్ టెలీ కమ్యూనికేషన్స్ గ్రామీణుల అవసరాలకు అనుగుణమైన 9 మొబైల్స్‌ను రూ.999, ఆపై ధరల్లో గత డిసెంబరులో ఆవిష్కరించింది. ఈ ఏడాదిలో మరో 30 మోడళ్లను ప్రవేశ పెట్టనుంది.
*వీడియోకాన్ రూ.1300 నుంచి రూ.19,000 విలువైన 21 మోడళ్లతో ఇప్పటికే మార్కెట్‌లోకి ప్రవేశించింది. టచ్ ప్యాడ్, వీడియో ఫోన్లకూ సిద్ధమవుతోంది.
*తక్కువ ధర డ్యూయల్ సిమ్ ఫోన్లతో రంగంలోకి వచ్చిన కార్బన్ కంపెనీ దేశవ్యాప్తంగా 350 సర్వీస్ కేంద్రాలు నెలకొల్పింది. మల్టీమీడియో ఫోన్ల మార్కెట్‌లో 7-10% వాటా లక్ష్యంగా సాగుతోంది.
*లండన్ కేంద్రంగా పనిచేసే ఐఎన్‌క్యూ నగర వినియోగదారులే లక్ష్యంగా సోషల్ నెట్‌వర్కింగ్ ఆధారిత 3 ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ ఆపరేటర్ ఎయిర్‌సెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది కూడా.
మొబైల్స్ మార్కెట్ తీరు
* 2009లో విక్రయాలు: 13 కోట్లు
* గంటలో అమ్ముడవుతున్నవి: 12,000
* హ్యాండ్‌సెట్ సగటు వినియోగం: 18 నెలలు
* మార్పిడిపై కొంటున్నవి: 30-35%
* ఏటా పారవేస్తున్న ఫోన్లు: 3.5 కోట్లు
* ఏటా పోగవుతున్న ఇ-వ్యర్థాలు: 5,000 టన్నులు
* ప్రస్తుత వినియోగదారులు: 60 కోట్లు
* 2012 నాటికి వినియోగదారులు
(గార్నర్ అంచనా): 73 కోట్లు
* 2015 నాటికి మొబైల్ కనెక్షన్లు: 100 కోట్లు
(ఐక్యరాజ్య సమితి అంచనాలు)