Thursday, April 22, 2010

రూ. 2000 కోట్లు సమీకరణకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బాండు: రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం

హైదరాబాద్, ఏప్రిల్ 22: రాష్ట్ర విద్యుత్ శాఖ ఆర్థికంగా చిక్కుల్లో ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశించినంత పరిపుష్టిగా లేకపోవడంతో విద్యుత్ శాఖ కోసం కనీసం రెండు వేల కోట్ల రూపాయలు సమీకరించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. గురువారం జరిగిన సమావేశంలో విద్యుత్ శాఖ అవసరాలకోసం అదనపు ఆర్థిక వనరుల సమీకరణ అంశం ప్రస్తావనకు వచ్చింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బాండ్లు జారీ చేసి తద్వారా ఈ నిధులు సమీకరించాలని క్యాబినెట్ నిర్ణయించింది.

విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఆగస్టు నుంచి అమలు చేయాలని మంత్రి మండలి మరొక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు వినియోగించే విద్యుత్‌పై అదనంగా 50 పైసలు వసూలు చేయాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది. అలాగే ఐ.ఐ.ఐ.టి.లో ప్రస్తుతం ఉన్న సీట్లను 3000 వరకూ తగ్గించాలని క్యాబినెట్ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది.

ఇకపోతే వైద్య, ఆరోగ్య శాఖలలో దాదాపు 1700 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. గిరిజన సాధికారిక బిల్లుకు కూడా మంత్రి మండలి ఆమోదం లభించింది. ఇకపోతే రెండవ కాన్పులో కవలలు పుట్టినా స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అనర్హతగా భావించరాదని మంత్రిమండలి మరో నిర్ణయాన్ని ప్రకటించింది.