Thursday, April 29, 2010

పత్తి కొను'గోడు'

ధర తగ్గడంతో రైతన్న విలవిల..
ఎగుమతుల నిలుపుదలే కారణం!
వారంలో క్వింటాలు ధర రూ.500 పతనం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పత్తి ఎగుమతులను కేంద్రం నిషేధించడంతో మార్కెట్‌లో ధరతోపాటు కొనుగోలు తగ్గింది. వారం వ్యవధిలో క్వింటాలుకి రూ.500 ధర తగ్గడంతో రైతుల్లో కలవరం మొదలైంది. తొలుత దేశవ్యాప్తంగా 292 లక్షల బేళ్లు పత్తి ఉత్పత్తి అవుతుందని భావించిన కేంద్రం ఎగుమతులను అనుమతించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 19 వరకు దాదాపు 58 లక్షల బేళ్లు చైనా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లకు ఎగుమతి జరిగింది. ఏటా 70 లక్షల బేళ్లు ఎగుమతి అవుతాయి. ఈ ఏడు ఎక్కువ ఎగుమతి జరగడంతో ఈ నెల 19వ తేదీ నుంచి ఎగుమతులను కేంద్రం నిలిపివేసింది. టెక్స్‌టైల్‌ కమిషనర్ల వద్ద వ్యాపారులు రిజిస్టరు చేసుకున్న 22 లక్షల బేళ్ల ఎగుమతులను అనుమతించారు. దేశంలో ఉత్పత్తయిన 292 లక్షల బేళ్లలో దేశీయ అవసరాలకు 230 లక్షల బేళ్లు అవసరమవుతాయని జౌళి పరిశ్రమ అంచనా. ఇప్పటివరకు జరిగిన ఎగుమతులు, రిజిస్టరు అయినవి కలిపితే 80 లక్షల బేళ్ల వరకు వచ్చాయి. మిగిలింది 212 లక్షల బేళ్లే కావడంతో కేంద్రం కొత్తగా ఎగుమతులను నిలిపింది.

సీసీఐ కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించినా.. ధరల గిట్టుబాటుగా ఉండటంతో రైతులు ఊరట చెందారు. తెలంగాణ జిల్లాల్లో నిల్వ చేసుకున్న రైతులకు ఎగుమతులను నిషేధించిన కేంద్రం నిర్ణయం అశనిపాతంలా తాకింది. దీంతో దేశీయంగా పత్తి ధరలు తగ్గిపోవడం ప్రారంభమయ్యాయి. కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వారం క్రితం వరకు క్వింటాలు రూ.3600 పలికిన పలికిన పత్తి మంగళవారం రూ.3200, బుధవారం రూ.3100కు పడిపోయాయి. గుంటూరు జిల్లాలో క్వింటాలు రూ.3400 వరకు పలికిన ధర రూ.300 వరకు తగ్గింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 50 లక్షల బేళ్ల పత్తి అమ్మకాలు జరగ్గా మరో 5 లక్షల బేళ్లు రైతుల వద్ద నిల్వ ఉన్నట్లు అంచనా. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం దారం, నూలు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ డ్యూటీని 7.5 శాతానికి పెంచడంతో నూలుమిల్లుల యజమానులు కొనుగోళ్లను తగ్గించారు. ఇది ప్రైవేటు వ్యాపారుల కొనుగోళ్లపై ప్రభావం చూపింది. ఇప్పటికే వరంగల్‌ జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిచాయి. కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో మార్కెట్‌ యార్డులకు సెలవు ప్రకటించారు. శని, ఆదివారాల్లో సాధారణ సెలవులు. దీంతో ఈ నాలుగు రోజులు విక్రయాలు ఉండవు.

నేడు, రేపు పత్తి పరిశ్రమల బంద్‌
గుంటూరు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాలు పత్తి పరిశ్రమలు బంద్‌ నిర్వహిస్తున్నట్లు ఎ.పి. కాటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోరంట్ల పున్నయ్యచౌదరి తెలిపారు. బుధవారం గుంటూరు నగరంలోని కాటన్‌ అసోసియేషన్‌ హాలులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం దూది ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేయడం సమంజసం కాదన్నారు. దీనికి నిరసనగా జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌, కాటన్‌ ట్రేడర్స్‌ బంద్‌ నిర్వహిస్తున్నారన్నారు. ఎగుమతులు నిలిపివేయడం సరికాదని, వెంటనే పునఃప్రారంభించాలన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య ఈ విషయమై జోక్యం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులు నష్టపోతారని, అందుకే తాము బంద్‌ నిర్వహిస్తున్నామన్నారు. రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి రోశయ్యను కలవనున్నట్లు ఆయన తెలిపారు.