
సీఆర్‌ఆర్ అర శాతం దాకా పెరగనుందాఅంచనాలకు మించి పైపైకి దూసుకుపోతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టే దిశలో ఈసారి ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకోవచ్చు. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 9.90 శాతానికి చేరుకొని, రెండంకెల స్థాయికి చేరువైన నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేసేందుకు ఆర్‌బీఐ సీఆర్‌ఆర్‌ను మరో పావు శాతం నుంచి అర శాతం దాకా పెంచే అవకాశం ఉంది. మునుపే ఒకసారి సీఆర్‌ఆర్‌ని పెంచినా, ఆ ప్రయత్నం అంతగా ఫలించకపోగా ద్రవ్యోల్బణం మరింత ఎగసింది. నిజానికి ఆర్‌బీఐ తన పరిధిలో ఉన్న అన్ని ఆయుధాలను ప్రయోగించి ద్రవ్యోల్బణాన్ని అంచనాలకు మించి పెరగకుండా చేయాలన్న దృఢ సంకల్పంతో వ్యవహరిస్తోంది. ఈసారీ సీఆర్‌ఆర్‌ను స్వల్పంగా ఇపుడు ఉన్న 5.75 శాతం నుంచి 6.25 శాతం దాకా పెంచేందుకు ఆర్‌బీఐ చొరవ తీసుకోవచ్చు. తత్ఫలితంగా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి దాదాపు రూ.24,000 కోట్ల నుంచి 26,000 కోట్ల దాకా నిధులు ఆర్‌బీఐకి చేరతాయి. అయితే ప్రస్తుతం బ్యాంకుల వద్ద పుష్కలంగా నిధులు ఉన్నందువల్ల వడ్డీరేట్లపై పెద్ద ప్రభావం చూపకపోవచ్చు.
రెపో రేటు పెరగొచ్చు
ఆర్‌బీఐ రెపో రేటు (ఆర్‌బీఐ బ్యాంకులకిచ్చే స్వల్ప కాలిక రుణాలపై వసూలు చేసే రేటు)ను స్వల్పంగా పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న రెపో రేటును 5.25 శాతానికి పెంచి, సరళతర విధానానికి స్వస్తి పలికే దిశలో ఆర్‌బీఐ స్పందించవచ్చు. కిందటి నెలలో ఆర్‌బీఐ రెపో, రివర్స్ రెపో రేట్లను పెంచినప్పటికీ బ్యాంకులు వాటి వడ్డీరేట్లను పెంచలేదు. సాధారణ పరిస్థితుల్లో రెపో రేటు పెరిగినట్లయితే దానికి అనుగుణంగా బ్యాంకులు వాటి వడ్డీరేట్లను పెంచుతాయి. అయితే గడిచిన ఆర్థిక సంవత్సరంలో చాలా బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లపై ఒత్తిడి ఉన్నప్పటికీ వడ్డీరేట్లను పెంచకుండా, ఆర్‌బీఐ రేపు ప్రకటించబోయే ద్రవ్య, పరపతి విధానం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇకపోతే రివర్స్ రెపో రేటును ఆర్‌బీఐ పెంచకుండా యధాపూర్వంగా కొనసాగించే అవకాశం ఉంది. బ్యాంకుల వద్ద ఉన్న అధిక నిధులను రివర్స్ రెపో రూపంలో ఆర్‌బీఐ వద్ద ఉంచకుండా వాటిని రుణ వితరణకు వినియోగించేందుకు, బ్యాంకులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రివర్స్ రెపో రేట్లను పెంచకుండా బ్యాంకులకు ఈ రేట్లు అనాకర్షణీయంగా ఉంచడం అవసరం. అందువల్ల ఈసారి ఆర్‌బీఐ రివర్స్‌రెపో రేటును పెంచకపోవచ్చు.
రుణ వితరణ పెంచే దిశలో..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8% నుంచి 8.5% వృద్ధిరేటును సాధించాలంటే రుణ వితరణ పెరగడం ఎంతో అవసరం. కిందటి ఆర్థిక సంవత్సరం 2009-10లో ఆర్‌బీఐ బ్యాంకుల రుణ వితరణ 16% వృద్ధి చెందాలన్న లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. నిజానికి మూడో త్రైమాసికం వరకు అంతంత మాత్రంగా ఉన్న రుణ వితరణ మార్చిలో పుంజుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణవితరణ కనీసం 20% వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ వివిధ రంగాలకు రుణ వితరణకు తగిన వాతావరణాన్ని కల్పిస్తూ బ్యాంకులకు దిశా నిర్దేశం చేయాలి. ముఖ్యంగా మౌలిక రంగానికి దన్ను ఇవ్వాల్సి ఉంది. చిన్న, మధ్య తరహా సంస్థ (ఎస్‌ఎంఈ)లకు అందించే రుణాలు ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత వృద్ధి చెందేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాల్సి ఉంది. వ్యవసాయ రంగానికి, ఇతర ప్రాధాన్య రంగాలకు అవసరమైన మేరకు రుణాలు అందించే విధంగా బ్యాంకులకు మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంది. ఒకవైపు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకొంటూ, మరో వైపు వృద్ధి రేటును పెంచే వాతావరణాన్ని సృష్టించే దిశగా ఆర్‌బీఐ కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు.