Tuesday, April 20, 2010

లిస్టింగ్ సమయం తగ్గితే 800 కోట్లు ఆదా

న్యూఢిల్లీ : పబ్లిక్ ఇష్యూ ముగింపు, లిస్టింగ్‌ల మధ్య సమయాన్ని తగ్గిచటం వల్ల ఏటా సుమారు 800 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. ఐపిఒ ముగింపు, లిస్టింగ్‌ల మధ్య సమయాన్ని 22 నుంచి 12 రోజులకు తగ్గిస్తూ ఇటీవల సెబి మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు సహా సంపన్న వర్గాలకు చెందిన (హెచ్ఎన్ఐ) ఇన్వెస్టర్లు ఏటా 800 కోట్ల రూపాయలను ఆదా చేయగలరని క్రిసిల్ తన నివేదికలో తెలిపింది.

సెబి తీసుకున్న నిర్ణయం కారణంగా మధ్య కాలిక మార్కెట్ ఒడిదుడుకులతో పాటు ఇన్వెస్టర్లు నిధులను రాను న్న ఐపిఒలలో వేగంగా పెట్టే వీలు కలుగుతుందని క్రిసిల్ ఈక్వి టీస్ హెడ్ చేతన్ మతీజా తెలిపారు. సెబీ తాజా ఆదేశాలు మే ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా భారతీయ మార్కెట్లను తీర్చిదిద్దటానికి కొత్త నిబంధనలు తోడ్పడతాయని సెబి భావిస్తోంది.

బిహెచ్ఇఎల్‌కు 6,300 కోట్ల ఆర్డర్
ముంబై: ఇంజనీరింగ్ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ కర్ణాటకలో విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పడానికి సంబంధించి 6,300 కోట్ల రూపాయల ఆర్డర్‌ను సంపాదించింది. ఈ ఆర్డర్‌లో భాగంగా రాయ్‌చూర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు 1600 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్ ప్లాంట్ డిజైనింగ్ దగ్గరి నుంచి నెలకొల్పే వరకు అన్ని రకాల కార్యకలాపాలను భెల్ స్వయంగా నిర్వహిస్తుంది.