Monday, April 19, 2010

మన బ్యాంకింగ్‌ వ్యవస్థ పటిష్ఠమైంది : ప్రణబ్‌

రఘునాథ్‌గంజ్‌ (పశ్చిమ బెంగాల్‌): అమెరికా, యూరోప్‌ దేశాల మాదిరిగా కాక భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ దృఢంగా నిలదొక్కుకున్నదని, మన బ్యాంకులకు ఆర్థికపరంగా ప్రభుత్వ అందడండలు అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారు. ముర్షిదాబాద్‌ జిల్లాలోని రఘునాథ్‌గంజ్‌లో దేనా బ్యాంకు శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. అంతక్రితం ఇదే జిల్లాలోని మార్‌గ్రామ్‌లో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖను మంత్రి ప్రారంభించారు. భారత బ్యాంకులు డబ్బు వెంట పరుగులు తీసి, ఆస్తుల బుడగ మాయలో పడబోవని ప్రణబ్‌ అన్నారు. ఆమధ్య అమెరికాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ఆ తరువాత ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఉదంతాన్ని ఆయన ప్రస్తావించి, మన దేశంలోని బ్యాంకింగ్‌ వ్యవస్థకు అమెరికా, యూరోప్‌లలో మాదిరిగా స్పెక్యులేటివ్‌ కార్యకలాపాల్లో ప్రమేయం లేదని వివరించారు. భారత సమ్మిళిత వృద్ధి లక్ష్య సాధనలో తోడ్పాటును అందిస్తున్నందుకు బ్యాంకింగ్‌ వ్యవస్థను మంత్రి ప్రశంసించారు. ఇటీవలే ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. కేంద్రం ప్రకటించిన పలు పన్ను రాయితీలు జీడీపీ వృద్ధి రేటు క్షీణించే సరళికి అడ్డుకట్ట వేసినట్లు చెప్పారు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో సుమారు 8.5 శాతం వృద్ధి ఉంటుందని ప్రణబ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సీబీఐకు మరో రూ.250 కోట్లు!ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం మే-జూన్‌ కాలంలో కేంద్ర రి-క్యాపిటలైజేషన్‌ కింద సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(సీబీఐ)కు రూ.250 కోట్లు లభించనున్నాయని బ్యాంకు శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా సంస్థ సీఎండీ ఎస్‌.శ్రీధర్‌ చెప్పారు. ఈ ప్రణాళిక కింద తాము ఇప్పటికే రూ.460 కోట్లను కేంద్రం నుంచి పొందామన్నారు. ఇప్పట్లో ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చే ఆలోచనేదీ లేదన్నారు.